Asia Cup 2023: దాయాదులు మధ్య సమరానికి అంతా సిద్ధం అయింది. ఆసియా కప్ 2023 టోర్నోలో భాగంగా ఈ రోజు ఇండియా, పాకిస్తాన్ తో తలపడబోతోంది. శ్రీలంక క్యాండీ పల్లెకెలె స్టేడియంలో ఇరు దేశాల మధ్య క్రికట్ సంగ్రామం జరగబోతోంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ పై ఆసక్తిగా ఉంది.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచుపై పలువురు మాజీ దిగ్గజ క్రికెటర్లు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా ఆడితే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనే విషయాలను వివరిస్తున్నారు. సౌతాఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్తాన్ టీంని సైలెంట్ చేయాలంటే ముందుగా బాబర్ అజామ్‌ని అవుట్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
పాకిస్తాన్ బ్యాటింగ్ పై ఒత్తిడి తేవాలంటే బాబర్ అజామ్ ని అవుట్ చేయాలని ఏబీడీ వ్యాఖ్యానించారు. ఆసియా కప్ తొలి మ్యాచులోనే పాకిస్తాన్ సత్తా చాటింది. నేపాల్ పై ఏకంగా 238 పరుగుల తేడాలో విజయం సాధించింది. బాబర్ నేపాల్ పై 151 పరుగులతో చెలరేగాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. ఆసియాకప్, వచ్చే వరల్డ్ కప్ గెలవాలన్నా బాబర్ ఫామ్ పాకిస్తాన్ జట్టుకు చాలా అవసరమని డివిలియర్స్ అన్నాడు.
