Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్‌!

Ajinkya Rahane Retirement

Ajinkya Rahane Retirement

Ajinkya Rahane Retirement: టీమిండియా సీనియర్ క్రికెటర్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని రహానే గురువారం ఉదయం తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. తాను ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో కూడా ఆడనని జింక్స్ ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నాడు. రహానే వీడ్కోలుతో భారత క్రికెట్‌లో ఓ స్వర్ణ అధ్యాయానికి ముగింపు పలికినట్లైంది.

భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అజింక్య రహానే పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని తన నాయకత్వంలో టీమిండియాకు అందించాడు. అడిలైడ్ టెస్టులో భారత్ చారిత్రాత్మకంగా 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత.. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లగా రహానే జట్టు బాధ్యతలు చేపట్టాడు. గాయాలతో సతమతమవుతున్న యువ జట్టును సమర్థంగా నడిపించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించి.. ఆపై ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

అంతర్జాతీయ కెరీర్‌లో రహానే 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 8,000కు పైగా పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో 5,077 పరుగులు, 12 సెంచరీలు నమోదు చేశాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఆడిన ఇన్నింగ్స్‌లు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాయి. విదేశాల్లో అత్యంత నమ్మకమైన భారత బ్యాటర్లలో రహానే ఒకడిగా గుర్తింపు పొందాడు. రహానే 2015 వన్డే ప్రపంచ కప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 భారత జట్టులో ఉన్నాడు. వెస్టిండీస్‌తో 2023 జూలైలో ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్టే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్‌.

తన సుదీర్ఘ కెరీర్‌లో అజింక్య రహానే ప్రశాంత స్వభావం, జట్టుకు అంకితభావం, ఒత్తిడి సమయంలో బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో సాధించిన చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం అతడిని భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలబెట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రహానేకు అభిమానులు, మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలుపుతూ అతని సేవలను కొనియాడుతున్నారు.