Site icon NTV Telugu

Afghanistan Squad: రషీద్ ఖాన్ కెప్టెన్.. టీ20 వరల్డ్‌ కప్‌కు అఫ్గానిస్తాన్‌ జట్టు ఇదే!

Afghanistan Cricket

Afghanistan Cricket

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ 2026లో అఫ్గానిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత్‌, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఇదే జట్టు జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా పాల్గొననుంది.

టీ20 వరల్డ్‌కప్‌ 2026 జట్టులోకి అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్ గుల్బదిన్ నయిబ్, ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ తిరిగి వచ్చారు. భుజం గాయంతో కొంతకాలంగా దూరంగా ఉన్న నవీన్ తిరిగి జట్టులో చేరడం బౌలింగ్ విభాగానికి బలం చేకూర్చనుంది. అలాగే ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌కు దూరమైన ఫజల్‌హక్ ఫరూకీ కూడా జట్టులో చోటు సంపాదించడంతో పేస్ అటాక్ మరింత పటిష్టంగా మారింది. స్పిన్ విభాగంలో కీలక మార్పు జరిగాయి. ఏఎం ఘజన్‌ఫర్ స్థానంలో ముజీబ్ ఉర్ రెహమాన్‌ను జట్టులో వచ్చాడు. ఘజన్‌ఫర్‌ను రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉంచారు.

ఏసీబీ చీఫ్ సెలెక్టర్ అహ్మద్ షా సులేమాన్‌ఖిల్ మాట్లాడుతూ… ‘గుల్బదిన్ నయిబ్ ముఖ్యమైన ఆటగాడు. అతడి రాక జట్టుకు ఎంతో బలం ఇస్తుంది. నవీన్ ఉల్ హక్ తిరిగి రావడం మా ఫాస్ట్ బౌలింగ్ నాణ్యతను పెంచుతుంది. ఘజన్‌ఫర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకోలేకపోవడం కఠిన నిర్ణయమే. అతని స్థానంలో ముజీబ్‌కు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది’ అని చెప్పారు. టీ20 వరల్డ్‌కప్‌ 2026లో అఫ్గానిస్తాన్ జట్టు గ్రూప్‌-డీలో ఉంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెనడా, యూఏఈ వంటి బలమైన జట్లు ఉన్నాయి. రషీద్ ఖాన్ సారథ్యంలోని అఫ్గానిస్తాన్ ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

Also Read: Aadi Saikumar: మహేంద్రన్ నాకు మంచి ఫ్రెండ్.. ‘నీలకంఠ’ను హిట్ చేయండి!

అఫ్గానిస్తాన్ గ్రూప్ మ్యాచ్‌లు:
# న్యూజిలాండ్‌తో: ఫిబ్రవరి 8 – చెన్నై
# దక్షిణాఫ్రికాతో: ఫిబ్రవరి 11 – అహ్మదాబాద్
# యూఏఈతో: ఫిబ్రవరి 16 – ఢిల్లీ
# కెనడాతో: ఫిబ్రవరి 19 – చెన్నై

అఫ్గానిస్తాన్ జట్టు:
రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జై, సెదికుల్లా అతల్, ఫజల్‌హక్ ఫరూకీ, రహ్మనుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమాల్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నయిబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహమాన్, దర్విష్ రసూలి, ఇబ్రాహిమ్ జద్రాన్.
రిజర్వు ప్లేయర్స్: ఏఎం ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జై, జియౌర్ రెహమాన్ షరీఫీ.

Exit mobile version