2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!

  • మరో ఏడాదిలో 2027 వన్డే ప్రపంచకప్‌
  • మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూచనలు
  • హార్దిక్ పాండ్యాకు సరైనప్రత్యామ్యాయం నితీశ్
Nitish Kumar Reddy, Hardik Pandya

Nitish Kumar Reddy, Hardik Pandya

Team India 2027 ODI World Cup Planning: 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ఇప్పటి నుంచే కీలక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూచించాడు. ముఖ్యంగా తరచూ గాయాల బారిన పడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడం భారత జట్టు యాజమాన్యానికి అత్యంత ప్రాధాన్యంగా ఉండాలని పేర్కొన్నాడు. జియోస్టార్ నిర్వహించిన ‘ఫాలో ద బ్లూస్’ కార్యక్రమంలో మాట్లాడిన రైనా.. హార్దిక్ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని, అయితే అతని ఫిట్‌నెస్ సమస్యలు భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశమని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి హార్దిక్‌కు సరైన బ్యాకప్ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

నితీశ్ రెడ్డి సరైనోడు:

తెలుగు ఆటగాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ప్రశంసించాడు. ‘బ్యాటింగ్‌లో నితీశ్ మరింత పరిణతి సాధించాడు. ఐపీఎల్‌లో బాగా బౌలింగ్ చేస్తూ నియంత్రణను కూడా ప్రదర్శించాడు. అతని ఫిట్‌నెస్ కూడా మెరుగ్గా ఉంది. అయితే నితీశ్ పనిభారాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తూ నిరంతరం అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత జట్టు యాజమాన్యంపై ఉంది’ అని రైనా చెప్పాడు. 2027 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయావకాశాలకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టోర్నమెంట్లలో వీరిద్దరికీ అపార అనుభవం ఉందని, కీలక మ్యాచ్‌ల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వారికి బాగా తెలుసని రైనా చెప్పాడు.

×
×
Ad

గిల్‌కు రో-కోల సలహాలు:

ప్రస్తుతం భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞుల మద్దతు ఎంతో ఉపయోగపడుతుందని సరేష్ రైనా పేర్కొన్నాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించే గిల్‌కు రో-కోల సలహాలు, అనుభవం గొప్ప బలంగా నిలుస్తాయని వివరించాడు. మరోవైపు మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా గిల్ నాయకత్వాన్ని ప్రశంసించాడు. ఐపీఎల్‌లో గిల్ బౌలర్లను సమర్థవంతంగా వినియోగించాడని, స్పిన్నర్లను సరైన సమయంలో ఉపయోగించడంతో పాటు ఒత్తిడి పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కొన్నాడని చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ అతని బ్యాటింగ్ ఫామ్ ఏమాత్రం తగ్గలేదని కొనియాడాడు.

గిల్‌కు మార్గనిర్దేశం:

శుభ్‌మన్ గిల్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల సహకారం లభిస్తుండటం కూడా పెద్ద ప్లస్ పాయింట్ అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఫీల్డ్ సెట్టింగ్స్, బౌలింగ్ మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాల్లో వారు గిల్‌కు మార్గనిర్దేశం చేయగలరని, దీంతో కెప్టెన్‌గా అన్ని బాధ్యతలను ఒంటరిగా మోయాల్సిన అవసరం ఉండదని చెప్పాడు. యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌ను వన్డే జట్టులో ఎంపిక చేయడాన్ని కూడా కుంబ్లే స్వాగతించాడు. ఐపీఎల్‌తో పాటు దేశీయ క్రికెట్‌లో అతను చూపిన ప్రతిభ ఆధారంగానే ఈ అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. కట్టర్లు, స్లోవర్ బాల్స్, యార్కర్లు వంటి వైవిధ్యమైన బౌలింగ్ ఆయుధాలు అతని బలమని కుంబ్లే వివరించాడు.