India vs Pakistan: సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్చి 1, 2003 ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎవరూ మరిచిపోరు. శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ శివాలెత్తి పాకిస్తాన్ పై ఆడాడు. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ టీమ్ పై శివతాండమే చేశాడు. వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్ వంటి బౌలర్లను చీల్చి చెండాడాడు. భారీ స్కోర్ సాధించి, భారత్ ను ఓడిద్దాం అని అనుకున్న పాకిస్తాన్ కు సచిన్ చుక్కలు చూపించాడు. భారత్ కు శివరాత్రి, పాకిస్తాన్ కు కాళరాత్రిని మిగిల్చిన ఈ మ్యాచు చరిత్రలో చాలా ప్రత్యేకం.
2003 ఐసీసీ ప్రపంచకప్ మ్యాచులో భారత్, పాకిస్తాన్ తో తలపడింది. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. గ్రూప్ ఏలో తిరుగులేని విజయాలతో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో ఉండగా.. తరువాతి రౌండ్ క్వాలిఫైయింగ్ బెర్త్ కోసం భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్యలో మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్ ముందు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ ఓపెనర్ సయీద్ అన్వర్ 126 బాల్స్ లో 101 పరుగులు చేసి భారీ స్కోరుకు కారణం అయ్యాడు. అయితే అప్పటి వరకు భారత్ కు 222 కంటె ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఎన్నడూ కూడా విజయవంతంగా ఛేదించలేకపోయిన భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. గెలుపు తమదే అనే ధీమాతో పాక్ ఉంది. అయితే వాళ్లకు అప్పుడు తెలియదు శివతాండవం ఉంటుందని.
Read Also: IND vs AUS: మూడో టెస్టులో గట్టి పోటీ.. ఆధిక్యంలో ఆసీస్ జట్టు
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ జోడిగా వచ్చారు. ఇద్దరు వచ్చీ రావడంతోనే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 5 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేశారు. టీ 20 ఫార్మాట్ అంతగా అందుబాటులోకి రాని రోజుల్లోనే హిట్టింగ్ చేస్తూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్ లో సచిన్ ఆడిన అప్పర్ కట్ షాట్ ఇప్పటికే ఓ క్లాసిక్. సచిన్ ఆడిన షాట్ నే మళ్లీ సెహ్వాగ్ పాక్ బౌలర్లకు రుచి చూపాడు. సెహ్వాగ్, కెప్టెన్ గంగూలీ వికెట్లు త్వరగానే పడిపోయినా.. మహ్మద్ కైఫ్, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ జట్టును విజయతీరాలకు చేర్చి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచులో సచిన్ కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులు చేయడంతో పాటు వన్డేల్లో 12,000 పరుగులను పూర్తి చేశాడు.
27వ ఓవర్ లో షాహీద్ అఫ్రీదీ బౌలింగ్ లో సచిన్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తరువాత ద్రావిడ్ 44 పరుగులతో, యువరాజ్ సింగ్ 50 పరుగులు చేసి భారత్ ను గెలిపించారు. 6 వికెట్ల నష్టానికి మరో 26 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.