(మే 17న మహానటి శాంతకుమారి జయంతి)
‘అమ్మ’ పాత్రల్లో మేటిగా నటించి మెప్పించడమే కాదు, నిజజీవితంలోనూ ఎందరి చేతనో ‘అమ్మా’ అని పిలిపించుకున్న మహానటి పి.శాంతకుమారి. ప్రముఖ తెలుగు దర్శకులు పి.పుల్లయ్య సతీమణి శాంతకుమారి. పుల్లయ్యను ‘డాడీ’ అని, శాంతకుమారిని ‘మమ్మీ’ అంటూ పలువురు నటీనటులు, నిర్మాతలు, సాంకేతికనిపుణులు అభిమానంగా పిలిచేవారు. ఆ దంపతులు సైతం ఎంతోమందిని తమ కన్నబిడ్డల్లాగే చూసుకొనేవారు. చిత్రసీమలో ఆదర్శప్రాయమైన జంటల్లో పుల్లయ్య, శాంతకుమారి ముందు వరుసలో ఉంటారు. ఈ దంపతులిద్దరికీ తెలుగుచిత్రసీమలో ప్రతిష్ఠాత్మకమైన ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ లభించడం విశేషం!
శాంతకుమారి అయిన సుబ్బమ్మ!
శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. 1920 మే 17న కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెల్లాల శ్రీనివాసరావు, పెద్ద నరసమ్మ దంపతులకు ఆమె జన్మించారు. శ్రీనివాసరావుకు లలితకళలంటే ఎంతో అభిమానం. దాంతో కూతురు సుబ్బమ్మకు పిన్నవయసులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఆల్ ఇండియా రేడియోలో గాయనిగానూ పనిచేశారామె. సుబ్బమ్మ గానం, అభినయం నచ్చి 1936లో తెరకెక్కిన ‘శశిరేఖా పరిణయం అను మాయాబజార్’లో శశిరేఖగా ఆమెను ఎంచుకున్నారు. చిత్రసీమలో సుబ్బమ్మ కాస్తా శాంతకుమారిగా మారిపోయారు. తరువాతి సంవత్సరంలోనే పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘సారంగధర’లో చిత్రాంగిగా తన పాటతోనూ, నటనతోనూ మురిపించారు. ఈ సినిమా పూర్తికాగానే తన 17వ యేట ఆ చిత్ర దర్శకుడు పి.పుల్లయ్యను వివాహమాడారు శాంతకుమారి. 1939లో తన భర్త తెరకెక్కించిన ‘బాలాజీ’ చిత్రంలో పద్మావతిగా నటించి మెప్పించారు. ఆ సినిమా కథనే తరువాత 1960లో ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’గా రూపొందించారు పుల్లయ్య. ఇందులో యన్టీఆర్ శ్రీనివాసునిగా నటించగా, వకుళ మాతగా శాంతకుమారి అభినయించారు. ఈ చిత్రమే యన్టీఆర్ ను తెరవేలుపుగా నిలిపింది. థియేటర్లను దేవాలయాలుగా మార్చింది.
అందరికీ ‘అమ్మ’నే!
తన భర్త దర్శకత్వం వహించిన పలు చిత్రాలలో శాంతకుమారి నాయికగానూ, కీలక పాత్రల్లోనూ నటించారు. 1947లో పుల్లయ్య, శాంతకుమారి దంపతులు రాగిణి పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తరువాత ‘పద్మశ్రీ పిక్చర్స్’ పతాకంపైనా అనేక సినిమాలను నిర్మించి, తెలుగువారిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రాలన్నిటా శాంతకుమారి తనకు తగ్గ పాత్రలు ధరించి మెప్పించారు. తనకంటే వయసులో చిన్నవారయిన ఏయన్నార్, గుమ్మడి వంటి వారికి జోడీగానూ నటించారు శాంతకుమారి. తరువాతి రోజుల్లో యన్టీఆర్, ఏయన్నార్, జగ్గయ్య, శివాజీగణేశన్, జెమినీ గణేశన్ వంటి మేటి నటులకు తల్లిగా నటించి మెప్పించారు. తెలుగులోనే కాదు తమిళ చిత్రాలలోనూ శాంతకుమారి మేటి నటిగా సాగారు. చిత్రసీమలో అడుగుపెట్టే నిర్మాతలు ఎందరో పుల్లయ్య, శాంతకుమారి దంపతుల ఆశీస్సులు తీసుకొనేవారు. అలాంటి వారిలో డి.రామానాయుడు ఒకరని చెప్పవచ్చు. ఆయన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ (1964)లో యన్టీఆర్ కు అక్కగా నటించారు శాంతకుమారి. ఆ సినిమాతో నిర్మాతగా పరిచయమైన రామానాయుడు, ‘ప్రేమనగర్’ (1971)తో చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. ‘ప్రేమనగర్’లో ఏయన్నార్ కు తల్లిగా నటించారామె. అలా రామానాయుడును నిర్మాతగా నిలిపిన రెండు చిత్రాలలోనూ శాంతకుమారి కీలక పాత్రలు పోషించారు. నాయుడు సైతం ఆమెను ‘అమ్మ’గానే ఎంతో గౌరవించేవారు.
నటిగా…గాయనిగా…
తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడంలో శాంతకుమారి ఎప్పుడూ ముందుండేవారు. నటిగానే కాకుండా గాయనిగానూ సుప్రసిద్ధులైన శాంతకుమారి చేతనే తరువాతి రోజుల్లోనూ కొందరు అదే పనిగా పాటలు పాడించారు. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘తల్లా-పెళ్ళామా’లో హీరోకు తల్లిగా నటించిన శాంతకుమారి, అందులో “మమతలెరిగిన నా తండ్రీ… మనసు తెలిసిన ఓ నాన్నా…” అనే పాటను పాడి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ పాటలో నందమూరి హరికృష్ణ ఆమె మనవడిగా నటించడం విశేషం. 1979 వరకు శాంతకుమారి నటిగా కొనసాగారు. 1981లో పి.పుల్లయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. 1999లో శాంతకుమారికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006 జనవరి 16న శాంతకుమారి కన్నుమూశారు. తెలుగునాట ‘అమ్మ’ పాత్రల్లో శాంతకుమారి అభినయం నభూతో నభవిష్యత్ అని చెప్పవచ్చు.