(మే 8న చలపతిరావు పుట్టినరోజు)
నటుడు చలపతిరావు పేరు వినగానే, ముందుగా ఆయన నటించిన కేరెక్టర్ రోల్స్ పలకరిస్తాయి. తరువాత మహానటుడు యన్టీఆర్ మనిషి చలపతిరావు అన్న మాటలూ గుర్తుకు వస్తాయి. ఎందుకంటే, చిత్రసీమలో ఎంతోమంది యన్టీఆర్ ను నమ్ముకొని, అక్కడే రాణించారు. అలాంటి వారిలో చలపతిరావు ప్రముఖులు. అంతకు ముందు బిట్ రోల్స్ లో తెరపై కనిపించిన చలపతిరావు, యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘కథానాయకుడు’ (1969)లో కాసింత గుర్తింపు ఉన్న పాత్ర పోషించారు. అందులో యన్టీఆర్, నాగభూషణం వంటి హేమాహేమీలతో నటించారు. ఆ సినిమాలో యన్టీఆర్ మునిసిపల్ ఛైర్మన్ అయినప్పుడూ, ఆయన బలం తగ్గి దిగిపోయినప్పుడు ఆ ఫలితాన్ని ప్రకటించే అధికారిగా చలపతిరావు కనిపిస్తారు. అప్పటి నుంచీ యన్టీఆర్ నటించిన పలు చిత్రాలలో చలపతిరావు ఏదో ఒక పాత్రలో కనిపించేవారు. అలా గుర్తింపు సంపాదించిన చలపతిరావుకు మెల్లగా ఇతరుల చిత్రాలలోనూ అవకాశాలు లభించాయి.
అన్నతో అనుబంధం!
రామారావు చిత్రాలలో చలపతిరావుకు ఏదో ఒక వేషం ఉండేది. ముఖ్యంగా ఆయన సొంత చిత్రాలలో చలపతిరావుకు గుర్తింపు ఉండే పాత్రలు లభించేవి. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో త్రిపాత్రాభినయం చేసి, నిర్మించిన ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో చలపతిరావు బహుపాత్రాభినయం చేశారు. అందులో సూతునిగా, దేవేంద్రునిగా, బ్రాహ్మణునిగా, యాచకునిగా, జరాసంధునిగా చలపతిరావు కనిపిస్తారు. రామారావు దర్శకత్వంలో సినిమా అంటే అందులో చలపతిరావుకు ఏదో విధంగా ఓ పాత్ర సిద్ధంగా ఉండేది. చలపతిరావు కూడా తాను అన్న అంటూ అభిమానించే రామారావు కోరగానే, ఇతర చిత్రాలను వదలుకొని, యన్టీఆర్ సొంత సినిమాల్లో నటించేవారు. అలా ఎందుకు చేసేవారంటే, చలపతిరావు కష్టాల్లో ఉన్న సమయంలో యన్టీఆర్ ఆదుకున్నారట! ఈ విషయాన్ని చలపతిరావే పలు వేదికలపై చెప్పారు. యన్టీఆర్ సొంత సినిమాల్లో నటించేవారికి డబ్బులు వస్తాయనే భరోసాతో పనులు ప్రారంభించుకోవచ్చు అంటారాయన. రామారావు సినిమాల్లో నటించేవారికి తగిన పారితోషికం లభించేదని చెబుతారాయన. అలా అన్న యన్టీఆర్ తో పలు చిత్రాలలో నటించి ప్రేక్షకుల్లోనూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు చలపతిరావు.
చలపతిరావు పుత్రోత్సాహం!
వందలాది చిత్రాలలో నటించిన చలపతిరావును కృష్ణవంశీ ‘నిన్నే పెళ్ళాడతా’ ఓ మలుపు తిప్పింది. అప్పటి దాకా ఎక్కువ చిత్రాలలో విలన్ వేషాలే వేసిన చలపతిరావు, ‘నిన్నే పెళ్ళాడతా’ తరువాత నుంచీ మంచి తండ్రిగా కూడా నటించి మెప్పించారు. నిజజీవితంలోనూ చలపతిరావు మంచి తండ్రిగానే గుర్తింపు పొందారు. పిల్లలు చిన్నగా ఉండగానే ఆయన భార్య చనిపోయింది. వారిని పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఓ ఇంటివారిని చేశారు చలపతిరావు. ఆయన తనయుడు రవిబాబు కూడా తండ్రి బాటలో నటుడిగా మారాడు. రవిబాబు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించి, నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించారు. రవిబాబు విజయాన్ని చూసి చలపతిరావు పుత్రోత్సాహం అనుభవిస్తున్నారు. చలపతిరావు మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా చేసుకోవాలని ఆశిద్దాం.