రచయితగా సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతీరావు నటనలోనూ తన బాణీ పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినిమా నటుడు అనే తెలిసి ఉండవచ్చు. కానీ, రచయితగా ఆయన కలం సాగిన తీరును గుర్తు చేసుకుంటే సాహిత్యాభిమానులకు ఈ నాటికీ పరవశం కలుగక మానదు. రచయితగా, కథకునిగా, నాటకరచయితగా, విలేఖరిగా, ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పత్రికారంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతీరావు కలం అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో తొలిసారి సినిమా బాట పట్టింది. అందులో కౌసల్యాదేవి రచనకు సినిమా అనుకరణ చేస్తూ గొల్లపూడి కలం సాగింది. ఆపై పలు చిత్రాలకు రచనలో చమక్కులు పలికిస్తూ సాగారు గొల్లపూడి. ముఖ్యంగా రీమేక్ సినిమాలకు గొల్లపూడి రచన ఓ దన్నుగా నిలచింది. “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు ఆకలిది, ఇల్లాలు” వంటి హిట్ రీమేక్స్ కు గొల్లపూడి రచన ఓ కళ తెచ్చింది. ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’తో నటునిగా మారిన గొల్లపూడి అభినయంతోనూ ఆకట్టుకున్నారు.
ఆయన లేరు… జ్ఞాపకాలు పదిలం…
దర్శకుడు కోడి రామకృష్ణ తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య -వీధిలో క్రిష్ణయ్య’తోనే గొల్లపూడి నటనాజీవితం మొదలయింది. దాంతో కోడి రామకృష్ణ తెరకెక్కించిన పలు చిత్రాలలో గొల్లపూడి కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్రాలలో గొల్లపూడి ముఖ్యపాత్రలు ధరించి, ఆకట్టుకున్నారు. ‘సంసారం ఒక చదరంగం’ చిత్రంలో గొల్లపూడి నటన జనాన్ని మరింతగా అలరించింది. నటనలో బిజీ అయిపోయిన గొల్లపూడి సినిమా రచనకు దూరంగా జరిగారు. అయినా పత్రికల్లో ఆయన రచనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ ‘ప్రేమపుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ప్రమాదంలో మరణించాడు. ఆ చిత్రం ద్వారానే నేటి తమిళ స్టార్ హీరో అజిత్ శ్రీకర్ అన్న పేరుతో పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని గొల్లపూడి పూర్తి చేశారు. తరువాత నుంచీ తన తనయుడు శ్రీనివాస్ పేరిట ఓ స్మారక పురస్కారం ఏర్పాటు చేసి, ఉత్తమ సినీ దర్శకులకు అవార్డు ప్రదానం చేస్తూ వచ్చారు. నేడు గొల్లపూడి లేరు. కానీ, ఆయన జ్ఞాపకాలు తెలుగువారిలో మదిలో సదా పదిలంగా ఉంటాయని చెప్పవచ్చు.