Site icon NTV Telugu

Parallel Marriage: బాబోయ్ ‘ప్యారలల్ మ్యారేజ్’.. ఈ కొత్త ట్రెండ్‌తో కూలిపోతున్న కాపురాలు!

Parallel Marriage

Parallel Marriage

Parallel Marriage: రెండు మనసులు కలిసి, ఇరు కుటుంబాల అంగీకారంతో అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచి, మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన దంపతులు.. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో వారికే తెలియకుండా ‘ప్యారలల్ మ్యారేజ్’ అనే ఊబిలోకి వెళ్లిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ, పిల్లల బాధ్యతలు పంచుకుంటూ, వీకెండ్ షాపింగ్‌కి వెళ్తున్నా కూడా వారి మధ్య ఏదో తెలియని దూరం ఉందని బాధపడుతుంటారు. మీకు కూడా మీ భార్యతోనే, లేదంటే భర్తతోనే ఇలాంటి పరిస్థితే ఉంటే మీరు ‘ప్యారలల్ మ్యారేజ్’ అనే డేంజర్ జోన్‌లో ఉన్నట్టే! ఇంతకీ ప్యారలల్ మ్యారేజ్ అంటే ఏమిటి, దీని వల్ల మీ కాపురం కూలిపోవచ్చా, ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Motorola Signature Launch: 5200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా.. ప్రీమియం లుక్‌తో వచ్చేసిన మోటో సిగ్నేచర్‌!

‘ప్యారలల్ మ్యారేజ్’ అంటే..
పలువురు సైకాలజిస్టులు మాట్లాడుతూ.. భార్యాభర్తలు ఇద్దరూ కూడా రైలు పట్టాల్లా పక్కపక్కనే ప్రయాణిస్తారు కానీ, వారి మనసులు మాత్రం కలవవు. దీన్నే ‘ప్యారలల్ మ్యారేజ్’ అంటారు. అంటే వీళ్లిద్దరూ బయటకు ఆదర్శ దంపతులు, బాధ్యతాయుతమైన తల్లిదండ్రుల్లా కనిపిస్తారు. కానీ ఆ భార్యాభర్తల జీవితంలోకి తరిచి చూస్తే ఎవరి లోకం వారిదే అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఇద్దరు అపరిచితులుగా ఒకే రూమ్‌లో ఉన్నట్టు ఉంటుంది ఆ భార్యాభర్తలు వైవాహిక జీవితం. నిజానికి చాలా మంది భార్యాభర్తలు ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా.. గొడవలు కాదు.. ఒకరికొకరు దూరమవ్వడం అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. 55% మంది విడాకులకు కారణం ఇదేనని వివరించారు. గొడవ పడితే అప్పుడైనా వారి మనసులో ఉన్నది బయటపడుతుంది, కానీ భార్యాభర్తల మధ్య రాజ్యమేలుతున్న ఈ ‘మౌనం’ అనేది వారి బంధాన్ని నిశ్శబ్దంగా చంపేస్తుందని వెల్లడించారు.

ఎందుకు ఇలా జరుగుతుందంటే..
చాలా మంది భార్యాభర్తలు వారి ఆఫీసు డెడ్ లైన్ల బిజీలో, అలాగే పిల్లల పెంపకం, వారి హోంవర్కులు, రకరకాల బిజీ పనుల మధ్య తమ గురించి తాము మాట్లాడుకోవడం మానేస్తారు. అలాగే మరికొందరి విషయానికి వస్తే “మాట్లాడితే మళ్లీ గొడవ అవుతుందిలే” అని మౌనంగా ఉండిపోవడం కనిపిస్తుందని తెలిపారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కేవలం ‘డ్యూటీ’ చేస్తున్నట్టు బ్రతకడం మరికొందరు భార్యాభర్తల విషయంలో మనకు అవగతం అవుతుంది.

భార్యాభర్తల మధ్య గ్యాప్ పెరిగినట్లు అనిపిస్తే ఈ టిప్స్ ట్రై చేయండి..

* రోజులో కనీసం 30 నిమిషాలు ఫోన్లు పక్కన పెట్టేసి భార్యాభర్తలిద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకోండి.

* దంపతులిద్దరూ కలిసి ఏదైనా కొత్త పని (వంట చేయడం, డాన్స్ నేర్చుకోవడం లేదా కొత్త ప్రదేశానికి వెళ్లడం) మొదలుపెట్టండి.

* నిజానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవ పడటానికి ఎప్పుడూ భయపడకండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకండి.. మీరు గొడవపడేది విమర్శించడానికి కాదు, మీ సమస్యను పరిష్కరించుకోవడానికి అని గుర్తించుకోండి.

* ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒకసారి కేవలం మీ ఇద్దరి కోసమే సమయం కేటాయించండి.

* పెళ్లి అంటే కేవలం బాధ్యతలను పంచుకోవడం మాత్రమే కాదు.. భావోద్వేగాలను పంచుకోవడం. మీ వైవాహిక నావను విడివిడిగా కాదు, కలిసి నడపండి.

READ ALSO: Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లు గోవిందా!

Exit mobile version