NTV Telugu Site icon

Indian Box Office Report: 2022లో ఇండియన్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లు

Indian Box Office Report

Indian Box Office Report

Indian Box Office Report: 2022లో ఇండియన్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లు 10 వేల కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకున్నాయి. నవంబర్‌కు సంబంధించిన ఇండియన్‌ బాక్సాఫీస్‌ రిపోర్ట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నెలలో.. హిందీలో వచ్చిన దృశ్యం-2 మూవీ అన్ని భాషల చిత్రాల కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ ఒక్క పిక్చర్‌ మాత్రమే నవంబర్‌లో వంద కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్‌ను క్రాస్‌ చేయటం విశేషం.

దీంతో.. ఆ నెలలో అన్ని భాషల సినిమాలు కలిపి మొత్తం 711 కోట్ల రూపాయలను సంపాదించాయి. అయితే.. ఈ సంవత్సరం జులై నెల తర్వాత ఇవే అతి తక్కువ వసూళ్లు కావటం గమనించాల్సిన విషయం. 2022లో రిలీజై అత్యధిక కలెక్షన్లు పొందిన టాప్‌-10 మూవీల్లో హిందీ దృశ్యం-2 ఎనిమిదో ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు అన్ని భాషల సినిమాలు కలిపి 9 వేల 751 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్‌ చేశాయి.

read more: Reliance-Metro Deal: ఒకేసారి పెరగనున్న 30 లక్షల మంది కస్టమర్లు

అవతార్‌ సక్సెస్‌తో డిసెంబర్‌ నెలలో ఈ వసూళ్లు 10 వేల మార్క్‌ను దాటాయి. మరో 948 కోట్ల రూపాయలు వస్తే చాలు. గ్రాస్‌ కలెక్షన్ల విషయంలో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద 2022వ సంవత్సరం అత్యుత్తమ ఏడాదిగా నిలుస్తుంది. ఇప్పటివరకు ఈ రికార్డు 2019వ సంవత్సరం పేరిట ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ ముగిసినప్పటికీ ఆ నెలకు సంబంధించిన వసూళ్ల నివేదిక విడుదల కావటానికి ఇంకా మూడు వారాల సమయం పడుతుంది.

ఎందుకంటే.. ఆర్మాక్స్‌ మీడియా సంస్థ ఇండియన్‌ బాక్సాఫీస్‌ రిపోర్ట్‌ను ప్రతి నెలా మూడో వారంలో విడుదల చేస్తుంది. అంటే.. 2022 డిసెంబర్‌ నివేదిక 2023 జనవరి మూడో వారంలో అందుబాటులోకి వస్తుంది. అప్పుడు గానీ.. 2022వ సంవత్సరం.. సినిమాల వసూళ్ల విషయంలో కొత్త చరిత్ర నెలకొల్పిందా లేదా అనేది అధికారికంగా తెలుస్తుంది. నవంబర్‌లో విడుదలై కలెక్షన్లపరంగా టాప్‌-10లో నిలిచిన చిత్రాల జాబితాను చూద్దాం.

280 కోట్ల రూపాయలతో హిందీ దృశ్యం-2 మొదటి ప్లేసును ఆక్రమించింది. 92 కోట్లతో బ్లాక్‌ పాంథర్‌ సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. 76 కోట్లు రాబట్టిన లవ్‌ టుడే మూవీ మూడో ర్యాంకు పొందింది. ఆ తర్వాత స్థానాల్లో బేడియా 75 కోట్లు, ఊన్‌ఛాయ్‌ 35 కోట్లు, యశోద 20 కోట్లు, ఫోన్‌ బూత్‌ 16 కోట్లు, మసూద 11 కోట్లు, గాలోడు మరియు కూమ్యాన్‌ చిత్రాలు 10 కోట్ల రూపాయల చొప్పున సంపాదించాయి. సుడిగాలి సుధీర్‌ మూవీ గాలోడుకి టాప్‌-10లో చోటు లభించటం చెప్పుకోదగ్గ విషయం.

భారీ లాభాలను ఆర్జించిన హిందీ దృశ్యం-2 నవంబర్‌లో లీడింగ్‌ పిక్చర్‌గా నిలిచింది. ఇలా.. ఒక నెలలో.. ఒక హిందీ మూవీ.. కలెక్షన్ల పరంగా ముందు వరుసలో ఉండటం అరుదైన పరిణామంగా పేర్కొనొచ్చు. ఈ సంవత్సరం విడుదలై మొత్తం వసూళ్ల విషయంలో టాప్‌-10లో నిలిచిన చిత్రాల్లో అక్టోబర్‌తో పోల్చితే నవంబర్‌లో చివరి మూడు ప్లేసులు మాత్రమే మారాయి. టాప్‌-7 ప్లేసులు యాజిటీజ్‌గా కంటిన్యూ అయ్యాయి.

అక్టోబర్‌ రిపోర్టులో చివరి మూడు ర్యాంకులను భూల్ భులయ్యా-2, బీస్ట్‌, డాక్టర్‌ స్ట్రేంజ్‌ ఇన్‌ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌ అనే చిత్రాలు కైవసం చేసుకున్నాయి. నవంబర్‌కి వచ్చేసరికి ఈ మూడు స్థానాలను హిందీ దృశ్యం-2, భూల్ భులయ్యా-2 మరియు బీస్ట్‌ అనే మూవీలు ఆక్రమించాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్ని భాషల చిత్రాల స్థూల వసూళ్ల వాటాలను పరిశీలిద్దాం.

అత్యధిక వాటాను.. అంటే.. 35 శాతం షేర్‌ను హిందీ లాంగ్వేజ్‌ పిక్చర్లు సొంతం చేసుకున్నాయి. 21 శాతం వాటాతో తెలుగు చిత్రాలు రెండో స్థానంలో ఉండగా 17 శాతం షేరుతో తమిళ సినిమాలు మూడో ర్యాంకు పొందాయి. హాలీవుడ్‌ మరియు కన్నడ మూవీలు రెండూ కూడా 8 శాతం చొప్పున వాటాలు పొందాయి. మలయాళం మూవీలు 6 శాతం, ఇతర భాషల చిత్రాలు 5 శాతం షేర్లతో చిట్టచివరన నిలిచాయి.

2022 ప్రారంభం నుంచి కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ గ్రాస్‌ కలెక్షన్లలో హిందీ చిత్రాలే ఎక్కువ వాటాను.. అంటే.. 35 శాతం షేరును కలిగి ఉంటున్నాయి. అయితే.. బాక్సాఫీస్‌ వద్ద ‘‘ది బెస్ట్‌ ఇయర్‌’’గా నిలిచిన 2019లో మాత్రం బాలీవుడ్‌ మూవీల పర్సంటేజీ ఏకంగా 44 శాతంగా నమోదైంది. దాంతో పోల్చుకుంటే ఈ ఏడాది.. 9 శాతం వాటాను కోల్పోయి 35 శాతానికి పరిమితమైంది.