Her Voice Her Story: బెంగళూరులో భారతీయ సంగీత సామ్రాజ్యంలో మహిళల గాత్ర ప్రస్థానాన్ని వివరిస్తూ ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’ (Her Voice. Her Story) అనే అద్భుతమైన ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది. నిజానికి సంగీతానికి భాష లేదు.. కానీ ఆ సంగీతానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మహిళల గొంతును లోకానికి వినిపించిన ఒక గొప్ప మలుపు గురించి మీలో ఎంత మందికి తెలుసు. ఒకప్పుడు మహిళల పాట కేవలం దేవాలయాలు, రాజాస్థానాలు లేదా కొంతమంది ప్రముఖుల మధ్యే వినిపించేది.
READ ALSO: Rukmini Vasanth: ఆ నటుడితో ప్రేమలో రుక్మిణి వసంత్.. ఫొటో లీక్?
కానీ 1902లో భారతదేశానికి ‘గ్రామఫోన్ రికార్డింగ్’ సాంకేతికత పరిచయమైంది. ఈ చిన్న మార్పు ఒక పెద్ద సామాజిక విప్లవానికి దారితీస్తుందని ఆ రోజుల్లో ఎవరు అనుకొని ఉండరు. నాలుగు గోడల మధ్య బంధీ అయిన మహిళా స్వరాలు గ్రామఫోన్ రికార్డుల ద్వారా దేశంలోని మారుమూల ఇళ్లలోకి సైతం వెళ్లగలిగాయి. తాజాగా స్టార్ అయిన ఈ ప్రదర్శనలో మనం కేవలం సంగీతాన్ని మాత్రమే కాకుండా, ఆనాడు పురుషాధిక్య సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎందరో మహనీయుల గురించి తెలుసుకోవచ్చు.
భారతదేశంలో మొట్టమొదటి రికార్డింగ్ స్టార్ గౌహర్ జాన్, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గొప్ప సంఘ సంస్కర్త బెంగళూరు నాగరత్నమ్మ, తమ అద్భుతమైన గాత్రంతో ఆనాడు లక్షలాది మందిని ఉర్రూతలూగించిన సంగీత కళాకారిణులు జద్దన్ బాయి, జానకీ బాయి, వీరితో పాటు సేలం గోదావరి, కోయంబత్తూర్ తాయి వంటి వారు తమ కళా నైపుణ్యంతో ఒక కొత్త పరిశ్రమనే ఎలా నిర్మించారో ఈ ప్రదర్శన మనకు కళ్లకు కడుతుంది. ఈ ఎగ్జిబిషన్ కేవలం పాటల ప్రదర్శన మాత్రమే కాదు, ఇది సాంకేతికత, లింగ వివక్ష, జ్ఞాపకాలు, పవర్ (అధికారం) గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. చరిత్రలో పేరు దక్కించుకున్న వారే కాకుండా, అసలు పేర్లు తెలియని ఎంతో మంది మహిళా గాయనీమణుల కృషిని కూడా ప్రదర్శిస్తున్నారు. మీరు బెంగళూరులో ఉన్నట్లయితే ఈ అపురూప ప్రదర్శనను సందర్శించే అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇండియన్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ మ్యూజియం (IME) & ప్రెస్టీజ్ సెంటర్ (PCPA). ప్రెస్టీజ్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కోణనకుంటె, బెంగళూరులో ఈ కార్యక్రమం జనవరి 17, 2026 నుంచి జనవరి 25 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఇందులో స్పెషల్ ఏంటి అంటే.. అందరికీ ప్రవేశం ఉచితం. నిజానికి మన సంస్కృతిని, మన గడ్డపై నుంచి వినిపించిన గొప్ప స్వరాలను గౌరవించడానికి ఇదొక మంచి అవకాశం. మీ పిల్లలను, పెద్దలను వెంటబెట్టుకొని ఈ సంగీత ప్రయాణంలో భాగస్వామ్యం అయితే మీ జీవితంలో అదొక మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
READ ALSO: Global Gold Reserves: ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందో తెలుసా.. ఈ రేసులో భారత్ ప్లేస్ ఇదే!