Site icon NTV Telugu

Economic Survey 2023 Highlights: ‘ఎకనమిక్‌ సర్వే-2023’ చెబుతున్నదిదే

Economic Survey 2023 Highlights

Economic Survey 2023 Highlights

Economic Survey 2023 Highlights: ఇవాళ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎకనమిక్‌ సర్వే-2023ను ప్రవేశపెట్టారు. ఈ సర్వే మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు అద్దం పట్టింది. వివిధ రంగాల గణాంకాలను సవివరంగా పొందుపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా సెక్టార్ల పనితీరును ప్రతిబింబించింది.

కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన వివిధ పథకాల గురించి, వాటి వల్ల వచ్చిన ఫలితాల గురించి స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వ పథకాల ప్రభావం, వాటిని కొనసాగించాల్సిన అవసరం తదితర అంశాలను తెలిపింది. ఈ నేపథ్యంలో.. ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ మార్గదర్శకత్వంలో ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన ఎకనమిక్‌ సర్వే-2023లోని ముఖ్యాంశాలను చూద్దాం..

I Love You Pepsi: కన్నడ సూపర్‌ స్టార్‌ యశ్‌

భారతదేశం.. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుంది. ఇండియన్‌ ఎకానమీ.. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల ప్రభావాల నుంచి గణనీయంగా కోలుకుంటోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మన దేశ GDP గ్రోత్ రేట్ 7 శాతంగా నమోదుకానుంది. GDP.. 6 నుంచి 6 పాయింట్‌ 8 శాతం మధ్యలో ఉంటుందని అంచనా వేశారు. దేశీయంగా వస్తూత్పత్తికి డిమాండ్‌ పెరగనుంది. మూలధన పెట్టుబడి ఊపందుకోనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో GDPలో ప్రైవేట్ వినియోగం 58 పాయింట్ 5 శాతంగా నమోదైంది. ఇది.. గత ఎనిమిదేళ్లలో అత్యధికం కావటం విశేషం. వాణిజ్యం, హోటల్‌, రవాణా తదితర రంగాలు రాణించటం వల్ల ఇది సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 8 నెలల్లో 63 పాయింట్‌ 4 శాతం పెరిగింది. ప్రైవేట్‌ రంగంలో క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా మూలధన పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నాయి.

2022 ఏప్రిల్‌లో చిల్లర ద్రవ్యోల్బణం 7 పాయింట్‌ 8 శాతంగా ఉంది. ఇది.. ఆర్‌బీఐ నిర్దేశించిన పరిమితి 6 శాతం కన్నా ఎక్కువే అయినప్పటికీ ఇతర దేశాలతో పోల్చుకుంటే తక్కువే కావటం గమనించాల్సిన విషయం. మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ సెక్టార్‌లో క్రెడిట్‌ గ్రోత్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. 2022 జనవరి-నవంబర్‌ మధ్య కాలంలో సగటున 30 పాయింట్‌ 5 శాతం కన్నా ఎక్కువగా ఉంది.

ఇతర కరెన్సీలతో పోల్చితే రూపాయి మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లు పెరగనుండటంతో రూపాయి విలువ ఇంకా పడిపోయే అవకాశం ఉంది. కరంట్‌ అకౌంట్‌ లోటు(CAD)ని సైతం మరింత పెరగొచ్చు. ఇదే జరిగితే రూపాయిపై ఒత్తిడి పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫారెక్స్‌ రిజర్వ్‌లు సరిపోను ఉన్నాయి కాబట్టి CAD, రూపాయి విలువ పతనాన్ని, ఫారెక్స్‌ మార్కెట్‌ పరిస్థితులను అదుపులో ఉంచగలిగాం.

గత ఆర్థిక సంవత్సరంలోని రెండో అర్ధ భాగం మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి అర్ధ భాగంలో దేశ ఎగుమతులు పెరిగాయి. దేశీయ ఉత్పత్తి రంగం ఊపందుకుందని చెప్పటానికి ఇదో ఉదాహరణ. ఎలక్ట్రానిక్స్‌ ఎక్స్‌పోర్ట్‌లు ఏకంగా మూడు రెట్లు పెరగటం గొప్ప విషయం. స్థూల పన్నుల ఆదాయం ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య కాలంలో అంతకుముందు సంవత్సరం కన్నా 15 పాయింట్‌ 5 శాతం పెరిగింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. రెపో రేటును 225 బేసిస్‌ పాయింట్లు పెంచింది. నిరుద్యోగం రేటు పడిపోయింది. 2018-19లో ఇది 5 పాయింట్‌ 8 శాతంగా ఉండగా 2020-21లో 4 పాయింట్‌ 2 శాతానికి తగ్గటం గమనించాల్సిన విషయం. వ్యవసాయ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులు 9 శాతానికి పైగా పెరిగాయి. పారిశ్రామిక రంగం వల్ల ఓవరాల్‌ గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌.. GVA.. 3 పాయింట్‌ 7 శాతం వృద్ధి చెందింది.

Exit mobile version