NTV Telugu Site icon

Crude Oil Conspiracy: ‘క్రూడాయిల్‌’ వెనక కుట్ర!. ఉద్దేశపూర్వకంగానే ఉత్పత్తిని తగ్గిస్తున్నాయా?

Crude Oil Conspiracy

Crude Oil Conspiracy

Crude Oil Conspiracy: చమురు ధరలు మళ్లీ మండిపోనున్నాయి. ప్రస్తుతం 85 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ఆయిల్‌ రేటు త్వరలోనే వంద డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజు వారీ చమురు ఉత్పత్తిని తగ్గించనున్నట్లు సౌదీ అరేబియాతోపాటు ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ప్రకటించటమే దీనికి కారణం. ఈ ప్రకటన కారణంగా ఒక్క రోజులోనే బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ ధర 8 శాతం పెరిగింది.

మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్లుగానే చమురు ఉత్పత్తిని తగ్గి్స్తున్నామని సంబంధిత దేశాలు పైకి చెబుతున్నప్పటికీ లోపల వేరే ఉద్దేశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. క్రూడాయిల్‌ రేట్లను మరోసారి వంద డాలర్ల పైకి చేర్చాలనేది ఆయా దేశాల లక్ష్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఉత్పత్తిని తగ్గిస్తే.. గిరాకీ పెరిగి.. ధరలు సైతం భగ్గుమంటాయని సౌదీ అరేబియా మరియు ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది.

read more: Alibaba Group Splitting: అలీబాబా.. అర డజను ముక్కలు. వ్యూహం మార్చిన జాక్‌ మా వ్యాపార సామ్రాజ్యం

ఎందుకంటే.. ఈ దేశాలు గతేడాది నవంబర్‌ నుంచే రోజువారీ ఆయిల్‌ ప్రొడక్షన్‌ తగ్గించాయి. అప్పట్లో రోజువారీ చమురు ఉత్పత్తిని 20 లక్షల బ్యారెళ్లు తగ్గించగా.. ఇప్పుడు మరో 11 పాయింట్‌ 6 లక్షల బ్యారెళ్ల మేరకు కుదిస్తున్నట్లు వెల్లడించాయి. దీంతో గ్లోబల్‌ మార్కెట్లు షాక్‌కి గురయ్యాయి. ఆయిల్‌ రేట్లు తగ్గే అవకాశమే లేదంటూ ఆందోళనకు గురవుతున్నాయి.

చైనా ఎకానమీ ఇప్పుడిప్పుడే కరోనా ఎఫెక్ట్‌ నుంచి కోలుకుంటోంది. ఫలితంగా చమురుకి గిరాకీ రానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు చమురు ఉత్పత్తి దేశాలు పావులు కదిపాయని మార్కెట్‌ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

ముఖ్యంగా.. ద్రవ్యోల్బణం పెరగనుంది. దీంతో ఆ ప్రభావం సామాన్యుల పైన పడనుంది. ఆహార పదార్థాల ధరలు, రవాణా వ్యయాలు తడిసి మోపెడవుతాయి. ఇన్‌ఫ్లేషన్‌ని కట్టడి చేసేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. మాంద్యం వస్తుందనే భయాలు కూడా వెంటాడుతున్నాయి.

బ్యాంకింగ్‌ సంక్షోభం సైతం దీనికి తోడైంది. మన దేశం చమురు అవసరాల కోసం 85 శాతం దాక దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు పెట్టాయి. దీంతో ఆ దేశం ఇండియాకి తక్కువ ధరకే ఆయిల్‌ విక్రయిస్తోంది. కానీ.. ఆ ప్రయోజనం దేశ ప్రజలకు ఇంతవరకూ అందలేదు.

పోయినేడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై పన్నులు తగ్గించింది. కానీ.. దాదాపు ఏడాది కావొస్తున్నప్పటికీ మళ్లీ ట్యాక్స్‌ తగ్గించే ఆలోచనే చేయట్లేదు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నష్టాలను పూడ్చుకోవాల్సి ఉండటంతో పన్నులు తగ్గించాలనే విషయాన్ని సర్కారు చూసీచూడనట్లు వదిలేస్తోంది. తాజాగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమనటం గమనించాల్సిన అంశం.

ఈ కారణంగా భవిష్యత్తులో మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు దిగొచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు. గత నెలలో ఒక దశలో బ్యారెల్‌ ఆయిల్‌ ధర 15 నెలల కనిష్టానికి పడిపోయింది. దీంతో అప్పుడు చమురు రేట్లు తగ్గించాలనే డిమాండ్‌లు వచ్చాయి. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితిలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.