జాతీయ భద్రత, పౌరుల వ్యక్తిగత గోప్యత కోసం కేంద్ర ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. అందులో వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్ కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు తయారుచేసే స్మార్ట్ ఫోన్లలో వాడే వివిధ సాంకేతిక అంశాలను తెలియచేయాలని కేంద్రం నోటీసులిచ్చింది. ఫోన్లలో వాడే హార్ట్ వేర్, సాఫ్ట్ వేర్ వివరాలు, ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్, భద్రత, షేరింగ్ అంశాలు, వినియోగదారుల భద్రతకు సంబంధించిన షేరింగ్ అంశాలను కేంద్రం పరిశీలించనుంది.
చైనా కంపెనీలు భారతీయ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ వివరాలు, ఆధార్ కార్డు, లొకేషన్ వంటివి షేర్ చేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ పౌరుల భద్రత కోసం కేంద్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది. వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్.. వంటి కంపెనీలు భారతీయ మార్కెట్లో 50 శాతం పైగా స్థానాన్ని ఆక్రమించాయి. మిగతా ఫోన్ల కంటే ఇవి కాస్త తక్కువ ధరకు లభిస్తున్నాయి.
దీంతో వినియోగదారులు వాటివైపు మొగ్గుచూపుతున్నారు. ఈమధ్య కాలంలో లోన్ యాప్‌లు ఎంత అరాచకానికి కారణం అయ్యాయో అందరికీ తెలిసిందే. లోన్ ఇవ్వడం, వారి వ్యక్తిగత వివరాలు, ఫ్రెండ్స్ వివరాలు కూడా సేకరించి… ఈఎంఐ ఆలస్యం అయితే వారిని వేధించడం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేంద్రం వినియోగదారుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.
గత ఏడాది లడఖ్ లో గాల్వాన్ ఘటన తరువాత, భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశ భద్రత దృష్యా భారత ప్రభుత్వం పలు చైనా యాప్ లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. 2020లో మోడీ ప్రభుత్వం మొత్తం 220 చైనా యాప్ లను బ్యాన్ చేసింది.
ఇండియా భద్రతా ప్రమాణాలకు ముప్పు కలిగించేవిగా ఉన్నాయని చెప్పి.. చైనాకు చెందిన 59 యాప్ లను 2020 జూన్ 29 న బ్యాన్ చేశారు. అందులో హలో, టిక్ టాక్, యూసీ బ్రౌజర్, కామ్ స్కానర్ వంటివి ఉన్నాయి. ఆ తరువాత సెప్టెంబర్ 5 వ తేదీన 118 యాప్ లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అందులో పబ్జీ, పబ్జీ లైట్ వంటివి ఉన్నాయి. ఆ తరువాత నవంబర్ 24న మరో 43 చైనా యాప్ లపై నిషేధం విధించింది. గత ఏడాది 220 చైనా యాప్స్ పై కేంద్రం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. తాజాగా నాలుగు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.