NTV Telugu Site icon

Banks exposure to Adani Group: రుణాల పట్ల ఆందోళన అవసరంలేదని వెల్లడి

Banks exposure to Adani Group

Banks exposure to Adani Group

Banks exposure to Adani Group: అదానీ గ్రూప్‌ కంపెనీల బిజినెస్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ రిలీజ్‌ అనంతరం ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు లబోదిబో అంటున్నారు. తమ డబ్బు ఏమైపోతుందో ఏమోనని దిగులు పెట్టుకున్నారు. దీంతో పార్లమెంట్‌ సైతం ఇదే వ్యవహారంపై దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో.. అదానీ గ్రూపు సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకులు మరియు ఎల్‌ఐసీ ఒకదాని తర్వాత ఒకటి స్పందిస్తున్నాయి. తాము ఎంత లోనిచ్చామో చెబుతున్నాయి. ప్రభుత్వ రంగంలో పెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ అదానీ గ్రూపు కంపెనీలకు ఎంత రుణం ఇచ్చిందనేదాన్ని అసలు ఇష్యూగానే చూడొద్దనే సూచనలు సైతం వ్యక్తమవుతున్నాయి.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. ఎల్‌ఐసీ.. అదానీ గ్రూపులో 36 వేల 474 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఎస్‌బీఐ.. 27 వేల కోట్ల రూపాయలిచ్చింది. ఈ అమౌంట్‌.. ఎస్‌బీఐ మొత్తం లోన్‌ బుక్‌లో కనీసం 1 శాతానికి కూడా సమానం కాకపోవటం గమనించాల్సిన విషయం. ఎస్‌బీఐ ఇప్పటికీ 338 బిలియన్‌ రూపాయల అదనపు కేటాయింపు నిల్వలను కలిగి ఉందని ఫిచ్‌ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్‌సైట్స్‌ పేర్కొంది. ప్రీ-ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్‌ను లేదా ఆదాయాన్ని కూడా ఎస్‌బీఐ కలిగి ఉందని తెలిపింది. మొండి బకాయి అనే అంశాన్ని ప్రస్తావించే ముందు దీన్ని గుర్తుంచుకోవాలని కోరింది.

read more: Home Rents: రెంటల్‌కి డిమాండ్ ఎక్కువ.. సప్లై తక్కువ..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఆర్‌బీఐ.. తమకు అనుమతించిన పరిమితిలో 4వ వంతు లోను మాత్రమే అదానీ గ్రూపునకు ఇచ్చినట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. బ్యాంకులో అందుబాటులో ఉన్న అర్హత మూలధనంలో ఎక్కువ శాతాన్ని అత్యంత పటిష్టమైన నగదు లభ్యత మరియు నాణ్యమైన ఆస్తులు కలిగిన గ్రూపు సంస్థలకే ఇచ్చామని బ్యాంక్‌ ఎండీ సంజీవ్‌ చద్దా వివరించారు. తమ ఓవరాల్‌ లోన్‌ బుక్‌ సైజ్‌ 29 లక్షల కోట్ల రూపాయలు కాగా అందులో సున్నా పాయింట్‌ ఐదు శాతం మాత్రమే అదానీ సంస్థలకు మంజూరు చేసినట్లు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది.

మరో వైపు.. యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా స్పందించింది. తమ నెట్‌ అడ్వాన్స్‌ల్లో సున్నా పాయింట్‌ తొమ్మిదీ నాలుగు శాతం మాత్రమే అదానీ గ్రూప్‌ సంస్థలకు ఇచ్చినట్లు వెల్లడించింది. అది కూడా.. పోర్టులు, ట్రాన్స్‌మిషన్‌, పవర్‌, గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌, రోడ్లు మరియు ఎయిర్‌పోర్టులు వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకే మంజూరు చేశామని స్పష్టం చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. అదానీ గ్రూపునకు దాదాపు 7 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇందులో 2 వేల 500 కోట్ల రూపాయలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లోని ప్రతిష్టాత్మక విభాగమైన ఎయిర్‌పోర్ట్‌ బిజినెస్‌కి కేటాయించామని తెలిపింది.

ఎల్‌ఐసీతోపాటు ఈ 5 బ్యాంకులు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకుంటే.. అదానీ గ్రూప్‌ సంస్థల వ్యాపార భవిష్యత్‌ విషయంలో ఇన్వెస్టర్లు, డిపాజిట్‌దారులు ఎలాంటి భయపడాల్సిన పనీ లేదనే అర్థం ధ్వనిస్తోంది. అదానీ కంపెనీలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన లోన్లను అసలు ఒక వివాదంగా చూడాల్సిన అవసరమే లేదని ఫిచ్‌ గ్రూప్‌నకు చెందిన రీసెర్చ్‌ సంస్థ క్రెడిట్‌సైట్స్‌ ధీమాగా చెబుతోంది. ఎస్‌బీఐ.. అదానీ గ్రూపునకు చెందిన క్యాష్‌ జనరేటింగ్‌ అసెట్స్‌ని తనఖా పెట్టుకొనే రుణాలు ఇచ్చింది తప్ప షేర్లను తాకట్టు పెట్టుకొని కాదని స్పష్టం చేసింది.

ఎస్‌బీఐ.. అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల్లో ఆన్-షెడ్యూల్ మరియు అండర్-కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులు కూడా ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని క్రెడిట్‌సైట్స్‌ ప్రస్తావించింది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో అదానీ కంపెనీలు వెనకడుగు వేస్తాయనే అపనమ్మకాలు తమకు లేవని ఎస్‌బీఐ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అదానీ సంస్థలకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ మరియు బ్యాంక్‌ గ్యారెంటీల రూపంలోనూ లోన్లు మంజూరు చేసిందని, అయితే అవేవీ కూడా ఈక్విటీలకు లేదా అక్విజిషన్‌ కార్యకలాపాలకు సంబంధించినవి కావని క్రెడిట్‌సైట్స్‌ వివరించింది.

ఈ క్రెడిట్‌సైట్స్‌ సంస్థే గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో అదానీ గ్రూప్ సంస్థల రుణాలు ఆందోళ‌న‌క‌రమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ అభ్యంతరం వ్యక్తం చేయటంతో తమ రిపోర్టులో క్యాల్‌కులేషన్‌ ఎర్రర్స్‌ చోటుచేసుకున్నాయంటూ వివరణ ఇచ్చుకుంది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ విషయంలో మాత్రం క్రెడిట్‌సైట్స్‌ ఇప్పుడు పూర్తిగా అదానీ గ్రూపునకే మద్దతుగా నిలుస్తుండటం చెప్పుకోదగ్గ అంశం.