NTV Telugu Site icon

Apple Company: iPhone లేటెస్ట్‌ మోడల్స్‌కి కేరాఫ్‌గా మారనున్న ఇండియా

Apple Company

Apple Company

Apple Company: iPhoneలో ‘ఐ’ అంటే ఏమిటని అడిగితే చెప్పటానికేమీలేదు. ఎందుకంటే.. అదొక యాపిల్ కంపెనీ ఫోన్ మోడల్ పేరు మాత్రమే. కానీ.. భవిష్యత్తులో ఐఫోన్‌ అంటే ఇండియా ఫోన్‌ అని చెప్పుకునే రోజులు రానున్నాయనిపిస్తోంది. 2027వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా వాడుకునే ప్రతి రెండు ఐఫోన్లలో ఒకటి ఇండియాలోనే తయారుకానుండటమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ పర్సంటేజీ 5 కన్నా తక్కువగానే ఉన్నట్లు లేటెస్ట్‌ న్యూస్‌ చెబుతున్నాయి.

యాపిల్‌ కంపెనీ 2022వ సంవత్సరంలోని ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో.. అంటే.. 9 నెలల్లోనే.. రెండున్నర బిలియన్లకు పైగా ఐఫోన్లను భారతదేశంలో తయారుచేసి ఎగుమతి చేసింది. ఇది.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ఎక్స్‌పోర్ట్‌లతో పోల్చితే దాదాపు రెట్టింపు కావటం విశేషం. ఈ డేటా అనాలసిస్‌ను సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ అనే సంస్థ వెలువరించింది. తైవాన్‌లోని డిజిటైమ్స్‌ అనే వార్తా పత్రిక విశ్లేషకుడు చేసిన అంచనాను ఆధారంగా చేసుకొని ఈ నిర్ణయానికొచ్చింది.

TCS Recruits Freshers: కొత్త ఆర్థిక సంవత్సరంలో మొత్తం లక్షన్నర వరకు ఉద్యోగ నియామకాలు

2025వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉండే మొత్తం ఐఫోన్లలో పాతిక శాతం వరకు మన దేశంలోనే అసెంబుల్‌ అవుతాయని జేపీ మోర్గాన్‌ అనే సంస్థ గతంలోనే జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. యాపిల్‌ కంపెనీ.. ఐఫోన్లను ఎక్కువగా చైనా ఫ్యాక్టరీల్లోనే తయారుచేయిస్తుంది. ఆ సంప్రదాయానికి భిన్నంగా ఇప్పుడు లేటెస్ట్‌ మోడల్‌ ఐఫోన్లను ఇండియాలో తయారుచేయిస్తుండటం గమనించాల్సిన అంశం.

యాపిల్‌ సంస్థ ఆలోచనా ధోరణిలో వచ్చిన ఈ చెప్పుకోదగ్గ మార్పును మేకిన్‌ ఇండియా పథకం సాధించిన కీలక విజయాల్లో ఒకటిగా పరిగణించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అగ్ర రాజ్యం అమెరికాకు చెందిన యాపిల్‌ కంపెనీ.. వాస్తవానికి.. భారతదేశంలో లేటెస్ట్‌ మోడల్‌ ఐఫోన్ల తయారీని గతేడాది మాత్రమే ప్రారంభించింది. అప్పటివరకు ఫాక్స్‌కాన్‌ అనే తైవాన్‌ అసెంబ్లిగ్‌ సంస్థే ఐఫోన్లను అత్యధికంగా సరఫరా చేసేది.

విశాలమైన కార్మిక శక్తి.. ప్రధాని నరేంద్ర మోడీ ముందుచూపు.. కేంద్ర ప్రభుత్వ మద్దతు.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న స్థానిక మార్కెట్.. తదితర పరిస్థితుల నేపథ్యంలో యాపిల్ కంపెనీ.. ఐఫోన్ల తయారీకి మన దేశాన్ని అనువైన ప్రదేశంగా ఎంచుకోవటం మనందరికీ గర్వకారణం. యాపిల్‌ కంపెనీకి ఐఫోన్లను అత్యధికంగా సప్లై చేసే ఫాక్స్‌కాన్‌ సంస్థ.. వివిధ దేశాల్లోకి విస్తరించటంలో భాగంగా ఇండియాలో ఐదారేళ్ల కిందటే ఈ ఫెసిలిటీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

తాజాగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం కూడా పొందటం ప్రస్తావించాల్సిన పరిణామం. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ కేంద్రంగా మలిచేందుకు మోడీ సర్కారు.. ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్‌సెన్‌టివ్స్‌ స్కీమ్‌ను.. అంటే.. PLI పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఈ PLI పథకం కింద మొదటి ఏడాదిలోనే మూడున్నర బిలియన్‌ రూపాయలకు పైగా ఆర్థిక ప్రయోజనాలను పొందింది.

ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్‌ సంస్థ.. ఇండియాలోని తన ప్లాంట్‌లో ఐఫోన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకోనుందని యాపిల్‌ కంపెనీ అనలిస్ట్‌ ఒకరు డిసెంబర్‌ నెలలో పేర్కొన్నారు. ప్రొడక్షన్‌ కెపాసిటీని పెంచటం ద్వారా ప్రస్తుత సంవత్సరంలో ఐఫోన్ల తయారీలో కనీసం 150 శాతం వృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఫాక్స్‌కాన్ సంస్థ ఇండియాలో ఐఫోన్ల ప్రొడక్షన్‌ను భారీగా పెంచి.. మీడియం లేదా లాంగ్‌ టర్మ్‌ షిప్‌మెంట్స్‌ టార్గెట్‌లో 45 శాతం వరకు చేరుకోనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఈ లక్ష్యాన్ని ప్రస్తుతానికి 2 శాతం నుంచి 4 శాతం వరకు మాత్రమే చేరుకుంటోంది. ఇదిలాఉండగా.. ఇండియాలో ఇప్పుడు యాపిల్‌ కంపెనీ.. i Phone SE, i Phone 12, i Phone 13 మరియు i Phone 14 వంటి బేసిక్‌ మోడల్స్‌ను తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో అమ్ముతున్న ప్రోమోడల్స్‌ అన్నీ కూడా దిగుమతి చేసుకున్నవే కావటం గమనించాల్సిన విషయం.