Anaconda vs Python: ప్రపంచంలోనే అతిపెద్ద పాముల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేవి అనకొండా, కొండచిలువ (పైథాన్). భారీ శరీరం, విషం లేకుండానే వేటాడే సామర్థ్యం, ఒకేసారి పెద్ద జంతువులను మింగేయగల శక్తిని సొంతం చేసుకున్న కారణంగా ఈ రెండు పాములను చాలామంది ఒకటే అనుకుంటారు. కానీ వాస్తవానికి వీటి మధ్య అనేక కీలక తేడాలు ఉన్నాయి. నివాస ప్రాంతం నుంచి శరీర నిర్మాణం, వేట తీరు వరకు ఎన్నో విషయాల్లో ఈ రెండు పాములు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.
అనకొండా బరువులో కింగ్.. పైథాన్ పొడవులో ఛాంపియన్
అనకొండాను ప్రపంచంలోనే అత్యంత బరువైన పాముగా గుర్తిస్తారు. ముఖ్యంగా గ్రీన్ అనకొండా 15 నుంచి 20 అడుగుల వరకు సాధారణంగా పెరుగుతుంది, కొన్ని సందర్భాల్లో 26 అడుగుల కంటే ఎక్కువ పొడవు కూడా పెరుగుతుంది. దీని బరువు 250 కిలోలకుపైగా ఉండొచ్చు. మందంగా, దృఢంగా ఉండే శరీరమే దీని ప్రత్యేకత. ఇక రెటిక్యులేటెడ్ పైథాన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముగా రికార్డు సృష్టించింది. ఇది 20 అడుగులకు పైగా పెరగడం సాధారణం. కొన్ని పైథాన్‌లు 30 అడుగులకు పైగా కూడా పెరుగుతాయి. అయితే అనకొండాతో పోలిస్తే దీని శరీరం సన్నగా ఉండటంతో బరువు తక్కువగా ఉంటుంది.
ఎక్కడ కనిపిస్తాయంటే..
అనకొండాలు ప్రధానంగా దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులు, నదులు, చిత్తడి నేలలు వంటి నీటి ప్రాంతాల్లో జీవిస్తాయి. ఇవి నీటిలోనే ఎక్కువ సమయం గడుపుతాయి. కళ్లూ, ముక్కు తలపై భాగంలో ఉండటంతో నీటిలో పూర్తిగా దాక్కొని వేటాడగలవు. పైథాన్‌లు మాత్రం ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉంటాయి. ఇవి అడవులు, గడ్డి మైదానాలు, చెట్లపై కూడా సంచరించగలవు. అనకొండా, పైథాన్ రెండూ విషపూరిత పాములు కావు. వేటాడేటప్పుడు ముందుగా తమ పదునైన దంతాలతో ఆహారాన్ని పట్టుకుని, శరీరంతో బిగించి ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి. అనంతరం మొత్తం ఆహారాన్ని ఒకేసారి మింగేస్తాయి. అనకొండా ఎక్కువగా చేపలు, తాబేళ్లు, పక్షులు, అడవి పందులు, కాపిబారా వంటి జంతువులను వేటాడుతుంది. కొన్ని సందర్భాల్లో చిన్న మొసళ్లపై కూడా ఇది దాడి చేస్తుంది. పైథాన్‌లు ఎలుకలు, కోతులు, జింకలు, అడవి పందులు, పక్షులు వంటి జంతువులను ఎక్కువగా వేటాడతాయి. అవసరమైతే చెట్లెక్కి పక్షుల గూళ్లలోని గుడ్లను కూడా తింటాయి.
సంతానోత్పత్తిలోనూ తేడా
ఈ రెండు పాముల మధ్య మరో ముఖ్యమైన తేడా సంతానోత్పత్తిలో కనిపిస్తుంది. అనకొండా గుడ్లు పెట్టదు. నేరుగా పిల్లలకు జన్మనిస్తుంది. అయితే పైథాన్ గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల చుట్టూ చుట్టుకుని వాటికి వేడి అందిస్తూ పిల్లలు బయటకు వచ్చే వరకు కాపలా కాస్తుంది.
ఎది ప్రమాదకరం అంటే..
ఈ రెండు పాములు కూడా మనుషులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయవు. అయితే రెచ్చగొట్టినా లేదా ప్రమాదంగా భావించినప్పుడు మాత్రమే దాడి చేసే అవకాశం ఉంటుంది. వాటి సహజ నివాసాల్లో ఇవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మొత్తానికి… అనకొండా అంటే భారీ బరువు, నీటిలో జీవించే పాము. పైథాన్ అంటే అత్యంత పొడవైన, చెట్లెక్కే సామర్థ్యం కలిగిన భారీ పాము. రెండూ విషం లేని శక్తివంతమైన పాములే అయినప్పటికీ, వాటి ఆకారం, నివాసం, జీవనశైలి, సంతానోత్పత్తి వంటి అంశాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి.

