Vj Sunny Starrer Sound Party Movie Review: తెలుగులో ఒక సీజన్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేశాడు. అయితే ఆయన హీరోగా మరో సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్నీ హీరోగా హృతిక శ్రీనివాస్ హీరోయిన్ గా సౌండ్ పార్టీ అనే సినిమా తెరకెక్కింది. సంజయ్ శేరి డైరెక్షన్లో పేపర్ బాయ్ మూవీ ఫేం జయశంకర్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. కొత్త నిర్మాతలు ముగ్గురు కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం రండి.
సౌండ్ పార్టీ సినిమా కథ:
తరాలుగా కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అనే కుటుంబంలో పుట్టిన కుబేర్ కుమార్( అప్పాజీ శివనారాయణ) తన కొడుకు డాలర్ కుమార్(సన్నీ)ని కూడా అలాగే పెంచుతాడు. కష్ట పడకుండా డబ్బు రాదని గోరుముద్ద పేరుతో ఒక రెస్టారెంట్ మొదలు పెడతారు. అయితే డాలర్ కుమార్ ప్రేమించిన ప్రియురాలు(హృతిక) తండ్రి ఆ వ్యాపారాన్ని దెబ్బ తీస్తాడు. అయితే ఈ బిజినెస్ కోసం అప్పు చేసిన వ్యక్తి( ఆకు మాణిక్ రెడ్డి) బలవంతం చేయడంతో ఆ డబ్బు కట్టేందుకు ఒక దొంగతనం కేసులో వేరే వాళ్ళ ప్లేసులో జైలుకు వెళ్లేందుకు ఒప్పుకుంటారు. అయితే అది దొంగతనం కేసు కాదని, రేప్ కేసు అని జైలుకు వెళ్ళాక అర్థం అవుతుంది. అయితే అసలు ఆ రేప్ కేసును దొంగతనం కేసు అని కుబేర్ – డాలర్ లను ఒప్పించింది ఎవరు? ఈ రేప్ కేసు నుంచి తండ్రి కొడుకులు ఎలా బయట పడ్డారు? అసలు బయట పడ్డారా లేదా? ఈ క్రమంలో సైంటిస్ట్(అలీ) పాత్ర ఏమిటి? అనే వివరాలు తెలియాలి అంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈజీగా డబ్బు సంపాదించాలని వెళ్లి హీరో అండ్ కో ఇబ్బందులు పడి చివరికి చావు తప్పించుకుని కన్ను లొట్ట పోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ డబ్బు సంపాదించే క్రమంలో ఏర్పడే సమస్యలు, వాటి నుంచి హీరో అండ్ కో తప్పించుకోవడానికి చేసే పాట్లు చూపిస్తూ దానితో కామెడీ జనరేట్ చేసి సినిమాలు చేసి నవ్విస్తున్నారు కొందరు. ఇప్పుడు ఈ సౌండ్ పార్టీ మేకర్స్ కూడా దాదాపుగా అదే కోవలో వచ్చారు. పూర్తిగా కామెడీని బేస్ చేసుకుని అప్పటికప్పుడు సిచ్చువేషనల్ కామెడీతో ఈ సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్ సంజయ్. కష్టపడకుండానే డబ్బు సంపాదించాలనుకునే ఓ ఫ్యామిలీలోని తండ్రీ కొడుకుల కథ. ఏమాత్రం జనరల్ నాలెడ్జ్ లేని వీరు ఎన్నో పనులు చేసేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడుతూ ఉంటారు. తండ్రీకొడుకులు డబ్బు సంపాదించే క్రమంలో చేసే పనులతో ఫన్ జనరేట్ చేయాలని ప్రత్నించిన డైరెక్టర్ సంజయ్ శేరి ఆ విషయంలో కొంత వరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఈ `సౌండ్ పార్టీ` సినిమా మొత్తం సన్నీ ఫ్యామిలీ మొత్తం చేసే పనులు ఫెయిల్ అవడం కారణంగా పుట్టే కామెడీతో ఆద్యంతం సాగుతుంది. ఈజీగా డబ్బు సంపాదించాలని కొత్తగా అలోచించి హోటల్ పెట్టడం, అందులో అమ్మాయిల చేత గోరు ముద్దుల తినిపించడం వంటి సీన్లు నవ్వులు పూయించేలా ఉంటాయి. ఆ తర్వాత అది క్లోజ్ కావడం, అప్పు ఇచ్చిన వారి బెదిరింపులకు భయపడి దొంగతనం కేసు అని డబ్బులకు ఆశపడితే అది రేప్ కేసు అయి జైలుకి వెళ్లడం, అందులో జైల్ నుంచి తప్పించుకునేందుకు అనేకపాట్లు పడుతూ దొరికిపోతున్న క్రమంలో పుట్టే కామెడీని నమ్ముకుని ఈ సినిమాని తెరకెక్కించగా అది కొంత వరకు మాత్రమే సక్సెస్ అయింది. నిజానికి ఓవరాల్ గా చెప్పుకుంటే చాలా సీన్లు పూర్తి స్థాయిలో నవ్వు తెప్పించలేక పోయాయి. సిచ్యువేషనల్ కామెడీ కరెక్ట్ గా వర్కౌట్ అయితే అది వేరే లెవల్ కు తీసుకు వెళ్తుంది, కానీ కొన్ని సీన్లు రొటీన్ అనిపిస్తాయి. సన్నీ, శివన్నారాయణ కెమిస్ట్రీ, చలాకీ చంటి ట్రాక్, సప్తగిరితో జైల్లో సీన్లు చాలా వరకు పేలాయి. అయితే ఈమధ్య వచ్చిన ఆస్కార్ కొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా స్ఫూఫ్ ఎందుకో ఆశించిన స్థాయిలో లేదనిపించింది. క్లైమాక్స్ లోని బిట్ కాయిన్ ఎపిసోడ్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. అలా కొన్ని సీన్లు పేలగా కొన్ని రొటీన్ అనిపించాయి. ఓవరాల్గా సినిమా నవ్వులు పూయించింది.
నటీనటుల విషయానికి వస్తే కుబేర్ కుమార్ పాత్రలో శివన్నారాయణ, డాలర్ కుమార్ పాత్రలో సన్నీ భలే సెట్ అయ్యారు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో జీవించారు, ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన అసెట్. ఒక్కమాటలో చెప్పాలంటే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కంటే తండ్రీ కొడుకుల కెమిస్ట్రీ బాగుంది. ఇక ఎమ్మెల్యేగా పృథ్వీ, సైంటిస్ట్ గా అలీ, ఎమ్మెల్యే కొడుకుగా భువన్ సాలూరు ఆట్టుకున్నారు. ఇక అప్పు ఇచ్చే వ్యక్తి పాత్రలో మాణిక్ రెడ్డి బాగా నవ్వించాడు. సత్తిగా చలాకీ చంటి, జైల్లో జైలర్గా సప్తగిరి ట్రాక్స్ బాగున్నాయి. చిత్ర దర్శకుడు చేసిన ఒక చిన్న పాత్ర కూడా భలే నవ్వించేలా ఉంది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే మోహిత్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది, మనీ మనీ పాట బాగుంది, మిగిలినవి ఫర్వాలేదు అనిపించాయి. ఇక ఆర్ఆర్ కూడా సెట్ అయింది. కెమెరా వర్క్ బాగుంది, కలర్ ఫుల్గా అనిపించింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఫైనల్లీ ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్, ఎలాంటి అంచనాలు లేకుండా లాజిక్స్ గురించి ఆలోచించకుండా సినిమా చూస్తే నచ్చచ్చు.