విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా ఇప్పటికీ విడుదల కావలసి ఉంది. అనేక కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాగ వంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, నాగవంశీ అందరికీ ఒక మంచి హిట్ కావాలి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ గట్టిగా చేసింది సినిమా టీమ్. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్లోకి మరింత వెళ్ళింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కింగ్డమ్ కథ: సూరి (విజయ్ దేవరకొండ) హైదరాబాదులో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉంటాడు. చిన్నప్పుడే తన తండ్రిని చంపి పారిపోయిన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతూ ఉండగా, అతను శ్రీలంక జాఫ్నాలో ఒక స్మగ్లింగ్ ముఠా నాయకుడిగా ఉన్నాడని తెలుసుకుంటాడు. అతన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు సూరి శ్రీలంకకు బయలుదేరతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సూరి శివని వెనక్కి తీసుకురాగలిగాడా లేదా? శ్రీలంకలో తెలుగు కుటుంబాలు ఏం చేస్తున్నాయి? వారందరికీ సూరి ఎలా అండగా నిలబడ్డాడు? మధ్యలో శ్రీకాకుళం నేపథ్యమేమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: సినిమా ఓపెనింగ్ తోనే ఇది ఒక పీరియాడిక్ కథ అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. అది కూడా ఇప్పుడు కాదు, దాదాపు 110 ఏళ్ల క్రితం శ్రీకాకుళం తీరంలో మొదలైన ఈ కథ శ్రీలంకకు చేరుతుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్య అనంతరం శ్రీలంక, హైదరాబాద్ మధ్య మొదలు అయి మళ్లీ శ్రీలంకకే చేరుతుంది. రాసినది చదవడానికి కాస్త ఇబ్బందికరంగా ఉందంటే, స్క్రీన్ మీద మాత్రం చాలా జాగ్రత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీసుకొచ్చారు. అసలు విషయం ఏమిటంటే, చిన్నప్పుడే తండ్రిని హత్య చేసి పారిపోయిన అన్నయ్యను వెతుక్కుంటూ వెళ్తున్న సూరి అనబడే విజయ్ దేవరకొండకు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మీ అన్నను వెనక్కి తెచ్చుకోవచ్చని ఆఫర్ ఇస్తాడు. అయితే అందుకు ఇప్పుడున్న జీవితాన్ని వదిలేసి రావాలని షరతులు పెడతాడు. అందుకు సిద్ధమై అన్న కోసం వెళ్లిన సూరి తన అన్నను కలుస్తాడు. మొదటి పరిచయంలోనే నీ తమ్ముడిని నేను అని చెప్పి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే అక్కడి నుంచే కథ అనేక మలుపులు తిరిగేలా రాసుకున్నాడు దర్శకుడు. నిజానికి ఫస్ట్ హాఫ్ చాలా నీటుగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథ ఎందుకో అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఈ సినిమా కథ ఇంక ఎక్కడో చూసినట్టు అనుమానాలు మొదలవుతాయి. యుగానికి ఒక్కడు నుంచి మొదలై ఇటీవల వచ్చిన రెట్రో లాంటి సినిమా ఛాయలు కనిపిస్తాయి. అయితే నటీనటుల పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఫస్ట్ హాఫ్ మెప్పించినంతగా సెకండ్ హాఫ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో తడబడింది అనడంలో సందేహం లేదు. అయితే సినిమా సీక్వెల్ కు ఇచ్చిన లీడ్ అయితే కొంతవరకు ఎంగేజింగ్ అనిపించింది. అయితే ఒక మంచి క్లిఫ్ హాంగర్ గనక సెలెక్ట్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమా టెక్నికల్‌గా బాగుంది. అయితే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ విషయంలో ఇంకా బలంగా కథ రాసుకుంటే బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ అదరగొట్టాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్‌గా మొదలైన అతని పాత్ర తర్వాత మలుపులు తిరిగిన తీరు అతని నటనకు ఉపయోగపడింది. భాగ్యశ్రీ బోర్సే పాత్ర చాలా చిన్నది. ఆమెకు నటించే అంత స్కోప్ ఉన్న సీన్స్ ఒకటి కూడా లేదు. అయితే సత్యదేవ్‌తో పాటు వెంకటేష్ అనే కొత్త నటుడు సినిమాలో తమ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. ఎమోషన్స్‌తో పాటు కథకు టర్నింగ్ పాయింట్స్ లాంటి సీన్స్‌లో ఆకట్టుకున్నారు. ఇక మిగతా నటీనటులు చాలామంది ఉన్నారు. వారంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు గౌతమ్ ఫస్ట్ హాఫ్‌ని చాలా ఎంగేజింగ్‌గా రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కొన్నిచోట్ల ప్లాట్‌గా వెళుతుంది అనిపించినా ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్‌గానే ఉంది. సెకండ్ హాఫ్ రైటింగ్ మిషన్‌లో కూడా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమా టెక్నికల్‌గా చాలా క్వాలిటీగా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని ఫ్రేమ్స్ కొత్తగా అనిపించాయి. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లలో వైలెన్స్ పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ఇలాంటి సినిమాలకు ఎమోషనల్ హై చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పాటలు ఫర్వాలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా ఇంపాక్ట్ చూపాల్సింది. లొకేషన్స్ బాగున్నాయ్.
ఓవరాల్‌గా కింగ్డమ్ టెక్నికల్లీ రిచ్.. కానీ ఎమోషనల్లీ?