విజయ్ ఆంటోని బేసికల్ గా మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ‘మహాత్మ’, ‘దరువు’ చిత్రాలకు సంగీతం అందించాడు. పదేళ్ళ క్రితం నటుడిగా మారిన విజయ్ ఆంటోనికి ‘బిచ్చగాడు’ మూవీ స్టార్ హీరో స్టేటస్ ను తెచ్చిపెట్టింది. అప్పటి నుండి దాదాపు అతని తమిళ చిత్రాలన్నీ తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. ఏడేళ్ళ క్రితం వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా లైన్ లో ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ మూవీని నిర్మిస్తూ… తొలిసారి తానే డైరెక్ట్ చేశాడు విజయ్ ఆంటోని. మరి అప్పటి ‘బిచ్చగాడు’ను ఈ లేటెస్ట్ మూవీ మరిపించిందో లేదో చూద్దాం.
విజయ్ (విజయ్ ఆంటోని) ఇండియాలోని అత్యంత సంపన్నులలో ఒకడు. రాష్ట్ర ముఖ్యమంత్రి (రాధారవి)తోనూ అతనికి ప్రత్యక్ష సంబంధాలుంటాయి. బిజినెస్ టైకూన్ విజయ్ ను అతని కుడిభుజంగా ఉండే అరవింద్ (దేవ్ గిల్), చైతన్య (మహేశ్ పేరడి), శివ (జాన్ విజయ్) వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. అతని వేల కోట్ల ఆస్తిని కాజేయడానికి బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) బ్రెయిన్ ను విజయ్ లోకి ట్రాన్స్ ప్లాంటేషన్ చేయిస్తారు. ఇదంతా దుబాయ్ లో జరుగుతుంది. చిన్నప్పుడు అడుక్కుంటున్న సమయంలో సత్య తన చెల్లిని పోగొట్టుకుంటాడు. చేయని నేరానికి బాల నేరస్థుల గృహంలో చేరతాడు. జైలు నుండి వచ్చాక చెల్లి ఆచూకీ కనిపెడుతుండగా… అరవింద్ ముఠా చేతిలో అతను ప్రాణాలు కోల్పోతాడు. మరి విజయ్ బాడీలో ఉన్న సత్య బ్రెయిన్ ఎలా పనిచేసింది? అతని ద్వారా కోట్లు కాజేయాలనుకున్న అరవింద్ కోరిక తీరిందా? విజయ్ గా మారిన సత్య తన చెల్లి ఆచూకీ తెలుసుకోగలిగాడా? అతను ప్రారంభించిన ‘యాంటీ బికిలి’ కథేంటసలు? ఇది మిగతా సినిమా.
బాడీలోని పార్ట్స్ ను ట్రాన్స్ ప్లాంట్ చేసినట్టుగా ఇక్కడ బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగుతుంది. అందులోని సాధ్యాసాధ్యాలను పక్కనపెడితే… సినిమా ప్రథమార్థం అంతా కార్పొరేట్ సెక్టార్ లోని లుకలుకల మీదే సాగింది. దానితో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూ కొంత ప్రాధాన్యమిచ్చారు. సత్య బ్రెయిన్ ను విజయ్ బాడీలోకి మార్చేసిన తర్వాత అతని ద్వారా కోట్లు గడించాలని చూసిన ముగ్గురు విలన్స్ ఆటను అతను ఎలా అరికట్టాడనేది నిజానికి ఆసక్తికరమైన అంశం. కానీ దానికి ఇంటర్వెల్ లోనే దర్శకుడు విజయ్ ఆంటోని తెరదించేశాడు. సెకండ్ హాఫ్ లో సత్య తన చెల్లిని వెతకడానికి ప్రాధాన్యమిస్తాడనుకుంటే… వీధిలోని బిచ్చగాళ్ళకు, బీదలకు సాయం చేసే ప్రోగ్రామ్ ప్రారంభించడమనేది ఊహించని మలుపు. వ్యక్తిగత లక్ష్యాలను పక్కన పెట్టి సమాజ హితానికి పాటుపడితే అంతా మంచే జరుగుతుందని డైరెక్టర్ చెప్పాలనుకున్నాడు. ఆ రకంగా స్టోరీని డ్రైవ్ చేశాడు. చివరకు సత్య తన చెల్లిని కలుసుకోవడంతో కథ సుఖాంతం కావడంతో ప్రేక్షకులు సైతం ఊపిరి పీల్చుకుంటారు!
నటీనటుల విషయానికి వస్తే… విజయ్ ఆంటోని ఇందులో ద్విపాత్రాభినయం చేసినా… తెర పైన ఏకకాలంలో ఒకే పాత్ర కనిపిస్తుంది. ఈ రెండు పాత్రలను బాగా చేశాడు. గ్లామర్ డాల్ కావ్య థాపర్ ఇప్పటికే తెలుగులో రెండు మూడు చిత్రాలలో నటించింది. ప్రధమార్థంలో అందాలు ఆరబోయగా, ద్వితీయార్థంలో ఆమె పాత్రకో అర్థాన్ని కలిగించారు. ఇతర ప్రధాన పాత్రలను రాధారావి, దేవ్ గిల్, మహేశ్ పేరడి, జాన్ విజయ్, యోగిబాబు, మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్ తదితరులు పోషించారు. నటీనటుల నుండి విజయ్ ఆంటోని చక్కని నటనే రాబట్టుకున్నాడు. ఈ సినిమాకు అతనే ఎడిటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఈ రెండింటితో పాటు ఓం నారాయణ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. తెలుగు వర్షన్ కు భాషాశ్రీ అర్థవంతమైన సాహిత్యాన్ని అందించాడు. ఇది విజయ్ ఆంటోని సొంత సినిమా కావడంతో ఎక్కడా రాజీ పడలేదు. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే… సెకండ్ హాఫ్ కాస్తంత ట్రాక్ తప్పింది. బట్ ముగింపు… హృదయానికి హత్తుకునేలా ఉంది. లాజిక్స్ జోలికి పోకుండా, ‘బిచ్చగాడు’ సినిమాతో పోల్చకుండా ఈ సినిమాను చూస్తే… బాగానే ఉంటుంది.
రేటింగ్: 2.75 / 5
ప్లస్ పాయింట్స్:
‘బిచ్చగాడు’ పంథాలో సాగడం
విజయ్ ఆంటోని పనితనం
మేకింగ్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
ట్రాక్ తప్పిన ద్వితీయార్థం
ఆకట్టుకోని కథనం
బలహీనమైన సెంటిమెంట్ సీన్స్
ట్యాగ్ లైన్: వన్ మ్యాన్ షో!