Varun Sandesh’s Nindha Review: హ్యాపీడేస్, కొత్త బంగారులోకం, కుర్రాడు లాంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న వరుణ్ సందేశ్ తర్వాత దారుణమైన డిజాస్టర్లు అందుకున్నాడు. ఇక ప్రస్తుతానికి సినిమాలకు దూరమైన ఆయన ఈ మధ్యన ఇందువదన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు నింద అనే సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్, టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.
కథ:
పెద్దాపురం తాలూకా కాండ్రకోట గ్రామంలో మంజు(మధు)ను రేప్ చేసి.. మర్డర్ చేసిన కేసులో బాలరాజు(చత్రపతి శేఖర్) జైలుకు వెళ్తాడు. ఉరిశిక్ష కూడా పడిన నేపథ్యంలో అనూహ్యంగా అతని కేసులో ఇన్వాల్వ్ అయిన లాయర్, పోస్టుమార్టం చేసిన డాక్టర్, ప్రత్యక్ష సాక్షులు అందరూ కిడ్నాప్ అవుతారు. కిడ్నాప్ చేసిన వారు ఆ కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ వారిని టెన్షన్ పెడుతూ ఉంటారు. బాలరాజు ఆ మర్డర్ చేయలేదు అనేది కిడ్నాప్ చేసిన వారి ఉద్దేశం. దీంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అసలు నిజంగా బాలరాజు ఆ మర్డర్ చేయలేదా? అతని కోసం ఇంతమందిని ఎవరు కిడ్నాప్ చేశారు? చివరికి ఏమైంది? అనేదే సినిమా కథ.
విశ్లేషణ:
ఒక హత్య కేసులో ఎలాంటి తప్పు చేయని వారు చిక్కుకుని బలి అవడానికి సిద్ధంగా ఉండగా హీరో లేదా హీరోయిన్ వచ్చి తమ తెలివి తేటలతో కాపాడడం లాంటి లైన్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ నింద సినిమా కూడా అందుకు అతీతం కాదు. దాదాపు అదే లైన్ తో ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. అయితే దానికి ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా రాసుకున్నారు కానీ దాన్ని రాసుకున్నంత పకడ్బందీగా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. మొదటి భాగం మొదలు కావడంతోనే కిడ్నాప్ డ్రామా మొదలు పెట్టి కథలోకి తీసుకు వెళ్ళడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఈ క్రమంలో కన్ఫ్యూజ్ చేస్తూనే ఇంటర్వెల్ దాకా తెచ్చేశారు. హత్యాచారం జరిగింది, అది బాలరాజు చేయలేదు కానీ ఎవరు చేశారు? అనే ప్రశ్న రేకెత్తించాడు డైరెక్టర్. అయితే సెకండ్ హాఫ్ మొదలు అయ్యాక కథను చాలా ఈజీగా ఊహించగలిగేలా ఉండడం సినిమాకి మైనస్. అంతేకాక డైలాగ్స్ కూడా ప్రేక్షకులు ముందే ఊహించేలా ఉండడం మైనస్ అనే చెప్పాలి. అయితే క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ ఊహించే విధంగానే ఉన్నా అది వచ్చినపుడు మాత్రం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అయితే క్లైమాక్స్ మాత్రం తెలుగు సినిమా ఎండింగ్ అనిపించలేదు. సో దానికి మనోళ్లు కాస్త కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే.
నటీనటుల విషయానికి వస్తే:
వరుణ్ సందేశ్ తనకు అలవాటైన లవర్ బాయ్ పాత్రలను దాటి ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ అధికారిగా ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఇలాంటి పాత్రలు కూడా చేయగలను అని నిరూపించాడు. ఇక హీరోయిన్ శ్రేయా రాణి పాత్ర పరిమితమే. మధు ఫర్వాలేదు అనిపించినా.. యానీ మాత్రం అదరగొట్టింది. ఇక చత్రపతి శేఖర్, మైం మధు, తనికెళ్ళ భరణి సహా ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వచ్చేసరికి సినిమాటోగ్రఫీ మీద కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక రీ రికార్డింగ్ బాగానే ఉన్నా పాటలు పెద్దగా గుర్తుంచుకో దగినవి లేవు. ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్నా లాగ్ అనిపిస్తుంది.
ఫైనల్లీ:
ఈ నింద ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నచ్చొచ్చు. కానీ అందరికీ కనెక్ట్ కావడం కష్టమే.