గత కొద్దిరోజులుగా మలయాళ సినిమా మార్కో గురించి తెలుగు సినిమా సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడంతో ఒక్కసారిగా అందరి చూపు ఆ సినిమా మీద పడింది. ఆసక్తికరంగా ఆ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. రేపు జనవరి ఒకటి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు ఒక స్పెషల్ ప్రీమియర్ ద్వారా తీసుకువచ్చారు ఎన్విఆర్ సినిమా నిర్మాతలు. అయితే ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అనే విషయాలు ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం పదండి
మార్కో కథ:
సినిమా నేపథ్యం అంతా కొచ్చిన్ లో జరుగుతూ ఉంటుంది. పుట్టుకతో గుడ్డివాడైన విక్టర్(ఇషాన్ షౌకత్) దారుణమైన స్థితిలో హత్య చేయబడతాడు. కొచ్చిన్ లోనే ఒక పెద్ద బంగారపు డీలర్ అయిన జార్జ్(సిద్దిక్ అలీ) సోదరుడే ఈ విక్టర్. అతనికి సోదరుడైన మార్కో (ఉన్ని ముకుందన్) విక్టర్ మరణానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో పడతాడు. కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే మార్కో తన ప్రాణానికి ప్రాణమైన సోదరుడు ఎలా మరణించాడో కనుక్కోగలిగాడా? అసలు విక్టర్ ని చంపింది ఎవరు? ట్విట్టర్ని చంపిన వారిని మార్కో ఏం చేశాడు? అసలు చివరికి ఏం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా ప్రారంభం ప్రేక్షకులలో కొంత ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇద్దరు స్నేహితులు అందులో ఒకరు మరణించడం, మరొకరు హంతకుడిని గుర్తుపట్టడంతో ఆ హంతకుడు మరో స్నేహితుడిని చంపడంతో అసలు హీరో ఎంట్రీ ఎలా ఉంటుందా? అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో రొటీన్ ఫార్మాట్ లోకి వచ్చేస్తూ దర్శకుడు హీరో ఎంట్రీ ఆసక్తికరంగా ప్లాన్ చేసుకున్నాడు. హీరో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది కొత్త కథ ఏమీ కాదని ఈజీగా అర్థమయిపోతుంది. సోదరుడి చావుకు పగ తీర్చుకునేందుకు సిద్ధమైన హీరోకి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి? చివరికి ఆ పగ తీర్చుకున్నాడా? లేదా? అనేది ఈ సినిమా కథ. నిజానికి ఇలాంటి కథలతో తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషలలో ఎప్పుడో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కథ కూడా కొత్తది ఏమీ కాదు. కానీ సినిమాలో చెప్పుకోవాల్సింది కేవలం యాక్షన్ గురించి మాత్రమే. హీరో ఇంట్రడక్షన్ తర్వాత నుంచి హీరో చేసే ఫైట్లు యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో హై ఇచ్చేలా డిజైన్ చేసుకున్నారు. సినిమా మొత్తం హీరో స్వాగ్, హీరో చేసే యాక్షన్ సీక్వెన్సలతోనే ప్రేక్షకులు ఎంగేజ్ చేసేలా రాసుకున్నాడు డైరెక్టర్. ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే మైండ్ పోతుంది లోపల అన్నట్టుగా డిజైన్ చేసుకున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే. ఎందుకంటే సాధారణంగానే మన వాళ్ళు సున్నిత మనస్కులు. అలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాని సాధారణంగా జీర్ణించుకోవడం కష్టమే. అయితే యానిమల్, కిల్ వంటి సినిమాలు చూసినవారు, వాటిని ఎంజాయ్ చేసినవారు దీన్ని ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమా వాటికి బాప్ లాంటి సినిమా అన్నమాట. హీరో ఇంట్రడక్షన్ తర్వాత నుంచి హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారనుకుంటే ఆ విషయం జోలికి వెళ్లకుండా కేవలం హీరో చేత వందల మందిని, అతి జుగుత్సాకర రీతిలో చంపించడం మీదే దృష్టి పెట్టాడు డైరెక్టర్. అయినా సరే హీరో క్యారెక్టర్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అతని బ్యాక్ స్టోరీ ఏమిటి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ కుటుంబం కోసం దేనికైనా సిద్ధం అనే క్యారెక్టర్ కు సాధారణ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అయితే ఒక రకంగా బ్లడ్ బాత్ అనే పదానికి విజువల్ రూపంగా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారేమో అనిపిస్తుంది. మలయాళంలో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడం కూడా పెద్ద విషయం ఏమీ కాదు. సినిమా మొత్తాన్ని నడిపించింది యాక్షన్ బ్లాక్స్.. ఒక్క యాక్షన్ బ్లాక్ కి మించి మరొక యాక్షన్ బ్లాక్ అనేలా డిజైన్ చేసుకున్నారు. హీరో యాక్షన్, స్వాగ్ తో సినిమా మొత్తాన్ని నడిపించారు. ఒక స్టైలిష్ యాక్షన్ కల్ట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇలాంటి స్థాయి వయలెన్స్ మన ఇండియన్ స్క్రీన్ మీద ఈ మధ్యకాలంలో చూడలేదు. ముందే చెప్పుకున్నట్టు యానిమల్, కిల్ లాంటి సినిమాలు చూస్తున్నప్పుడే చాలామందికి ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. ఈ సినిమా చూసినప్పుడు అంతకుమించి అనే ఫీలింగ్ కలగడం ఖాయం.
నటీ నటుల విషయానికి వస్తే ఇప్పటికే మాలికాపురం అనే సినిమాతో అటు మలయాళం లో సూపర్ హిట్ అందుకున్న ఉన్ని ముకుందన్ తెలుగులో కూడా ఆ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేశారు. కాకపోతే ఆశించిన మేర ఫలితం అయితే దక్కలేదు కానీ ఈ సినిమాతో మార్కో అనే పాత్రలో ఉన్ని ముకుందన్ పరకాయ ప్రవేశం చేసినట్లు అనిపించింది. తనదైన నటనతో యాక్షన్ తో స్వాగ్తో వన్ మాన్ షో నడిపించాడు ఉన్ని. ఆ తర్వాత సిద్ధిక్, జగదీష్, అభిమన్యు తిలకన్, కబీర్ దుల్హన్ సింగ్ వంటి వాళ్లు తమదైన శైలిలో సినిమాని ఒక రేంజ్ లో నడిపించడంలో సక్సెస్ అయ్యారు. సినిమాలో ఈ పాత్రలు కనిపించిన ప్రతిసారి ఒక రకమైన కిక్ ప్రేక్షకులకు ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. రంగబలి సినిమాలో నటించిన యుక్తి తరేజ ఈ సినిమాలో నటించింది కానీ ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే కాదు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ముందుగా దర్శకుడు ఫోకస్ ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ మీదే ఉంది అనిపించింది. కొత్త కథ కాదు కొత్త స్క్రీన్ ప్లే కూడా కాదు. అయినా సరే ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు సీట్లకే అతుక్కుపోయేలా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కాకపోతే మితిమీరిన బ్లడ్ బాత్ మన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనే విషయం మీద సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. సినిమా తెలుగు డైలాగ్స్ భలే సెట్ అయ్యాయి. అలాగే పాటలు గుర్తుంచుకో తగ్గట్టుగా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది. ఇక సినిమాను ఒక రేంజ్ కి తీసుకు వెళ్ళడంలో బాగా సక్సెస్ అయింది ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. తెలుగు లిరిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.. యాక్షన్ డైరెక్టర్స్ ఎవరో కానీ వారికి వీరతాడు వేయాల్సిందే.. ఆ రేంజ్ లో యాక్షన్ పండించారు.
ఫైనల్గా : మార్కో అన్లిమిటెడ్ బ్లడ్ బాత్ విత్ ఎంగేజింగ్ యాక్షన్.. కానీ సున్నిత మనస్కులకు కాదు సుమీ.