NTV Telugu Site icon

Tiger Nageswara Rao Movie Review: టైగర్ నాగేశ్వరరావు రివ్యూ

Tiger Nageswara Rao

Tiger Nageswara Rao

నటీనటులు: రవితేజ, నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, హరీష్ పేరడీ, రేణు దేశాయ్
నిర్మాత : అభిషేక్ అగర్వాల్
దర్శకుడు: వంశీ కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాష్ కుమార్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా మూవీ టైగర్ నాగేశ్వరరావు. వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. రవితేజ కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమాను తెలుగు భాషతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమా చేస్తున్నారు అని ప్రకేంచినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మరింత పెంచేసింది. ఇక శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం రండి.

టైగర్ నాగేశ్వరరావు కథ:
సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్(అనుపమ్ ఖేర్) గుంటూరు క్రైమ్ డీఎస్పీ(మురళీ శర్మ)ను హుటాహుటిన ఢిల్లీ పిలిపించి పీఎం పేషీ ముఖ్యులతో టైగర్ నాగేశ్వరరావు గురించి ఎమర్జన్సీ మీటింగ్ పెట్టడంతో కథ మొదలవుతుంది. అయితే అసలు నాగేశ్వరరావు ఎవరు? అతని నేపథ్యం ఏంటి? గరిక నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు? అనే విషయాలను పలు సంఘటనలుగా మార్చి చూపించారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఎలా దొంగతనం చేశాడు? తండ్రిని తల నరికి ఎందుకు చంపాల్సి వచ్చింది? అతను ప్రేమించిన సారా(నుపూర్ సనన్)ను వివాహం చేసుకున్నాడా? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
మద్రాసు ప్రాంతం మొత్తాన్ని గజ గజ వణికించి అతి పిన్న వయసులోనే పోలీస్ కాల్పుల్లో మరణించిన ఒక గజదొంగ మీద సినిమా చేస్తున్నారు అనగానే అందరికీ అనేక అనుమానాలు. అసలు జనం చెప్పుకునే మాటలు, పోలీసు రికార్డుల్లో కేసులు తప్ప ఎలాంటి కథ కానీ ఇతర వివరాలు కానీ లేని ఒక విషయాన్ని రెండున్నర గంటల సినిమాగా తీసుకురావడం అనేది ఒక ఛాలెంజ్. సరిగ్గా అలాంటి ఛాలెంజ్ ను తీసుకున్నాడు డైరెక్టర్ వంశీ కృష్ణ. సరిగ్గా గుర్తు కూడా లేని రెండు సినిమాలు చేసిన ఆయనకు ఇలాంటి భారీ బడ్జెట్ తో కూడిన భారీ పాన్ ఉన్న పాన్ ఇండియన్ సినిమాను నమ్మి అప్పచెప్పడమే ఈ సినిమాకి మొదటి విజయం అని చెప్పొచ్చు. దొంగ మీద బయోపిక్ ఏంటి? అంతలా ఎగ్జైట్ చేసిన అంశాలు ఏమున్నాయి అని ముందు అనిపించవచ్చు. అయితే సినిమా చూసాక ఆ అభిప్రాయం అంతా మారిపోతుంది. నిజానికి మొదటి భాగంలో హీరో ఏకంగా పీఎం ఇంటికి దొంగతనానికి వస్తున్నానని లేఖ రాయడంతో మొదలవుతుంది. అలా లేఖ రాయడంతో సెక్యూరిటీ టీం అంతా కలిసి ఇతను ఎవరో తెలుసుకునే పనిలో పడడంతో మొదలు పెట్టి పోలీసుల దృష్టిలో ఈ టైగర్ నాగేశ్వర్ రావు ఎవరు? ఎందుకు అతన్ని టైగర్ అని పిలుస్తున్నారు? అతని నేర చరిత్ర ఏమిటి? ఇలా అనేక విషయాలను పోలీసుల వెర్షన్ లో చూపించారు. మొదటి భాగం చూసిన అందరికీ ఇలాంటి వాడి మీద సినిమా కూడా చేయాలా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలయినప్పటి నుంచి అసలు టైగర్ నాగేశ్వర రావు ఎవరు? ఎందుకు అతను దొంగతనాలు మొదలు పెట్టాడు? ఎందుకు గరిక నాగేశ్వర రావు అనే అతన్ని టైగర్ నాగేశ్వర రావును చేశారు? లాంటి విషయాలను ఆసక్తికరంగా చూపించారు. నిజానికి ఈ సినిమాలో వాస్తవాలను చాలా వరకు మార్చి హీరోయిజం ఎలివెట్ చేసేందుకు వాడుకున్నారు. కానీ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో తీసుకున్న జాగ్రత్తలు సినిమా నిడివి ఇంత ఉన్నా పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. నిజానికి ఒకే విషయాన్ని రెండు కోణాల నుంచి చూపించే ప్రయత్నం చేశారు. రావణుడిలో కూడా ఒక రాముడు ఉంటాడు, ఆ రావణుడు చేసిన మంచి ఏమిటో లంకకు వెళ్లి తెలుసుకోవాలి అని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నిజానికి ఆ ఒక్క డైలాగ్ తో సినిమా మొత్తాన్ని డిఫైన్ చేయచ్చు. స్టువర్టుపురం అనే ఒక నేరస్తుల ప్రాంతంలో పుట్టి పెరిగిన నాగేశ్వర రావు ఆ ప్రాంతాన్ని ఆ కూపంలో నుంచి బయటకు తెచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది ఇంట్రెస్టింగ్ గా చూపించారు. నిడివి ఒక్కటే కొంత ఇబ్బంది అనిపించినా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు.

ఎవరెలా చేశారు అనే విషయంలో ముందుగా నటీనటుల సంగతికి వస్తే రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో ఇమిడిపోయాము. నిజానికిది రవితేజకు ఒక ఛాలెంజ్ లాంటి పాత్ర. ఎందుకంటే నిజజీవితంలో నాగేశ్వర రావు 25 ఏళ్లకే మరణిస్తాడు. అంతే కథ మొత్తం రవితేజ యంగ్ గా కనిపించాలి. ఈ విషయంలో చేసిన కంప్యూటర్ గ్రాఫిక్స్ అంతగా బాలేదు కానీ నటన వరకు ఆయన వన్ మ్యాన్ షో అనిపించాడు. ఇక ఆయన తరువాత హీరోయిన్లుగా నటించిన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ గ్లామర్ తోనే కాదు నటనతో కూడా ఆకట్టుకున్నారు. ఇక విలన్స్ గా నటించిన జిషు సేన్ గుప్తా, హరీష్ పేరడీ క్రూరత్వం పండించారు. నాజర్, కంచరపాలెం కిషోర్ వంటి వారు కూడా సినిమా మొత్తం కనిపిస్తూ ఆకట్టుకున్నారు. అనుపమ్ ఖేర్ కి కూడా మంచి రోల్ పడింది. ఇక రేణు దేశాయ్ యాక్టింగ్ సేటిల్డ్ అనిపించినా ఆమె డబ్బింగ్ సెట్ అవలేదు. నిడివి కూడా ఆమె పాత్రది చాలా తక్కువ. టెక్నికల్ విషయాలకు వస్తె వంశీ కృష్ణ అదరగొట్టాడు. నిడివి ఒక్కటే మైనస్ అనిపించినా దాన్ని కూడా మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. బోర్ కొట్టకుండా హీరోయిక్ ఎలివేషన్ లు ఇస్తూనే ఆకట్టుకునే పయత్నం చేసి దాదాపు సఫలం అయ్యాడు. ఇక శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ తో విజిల్స్ వేయించడమే కాదు ఆలోచింప చేశాడు కూడా. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం విషయానికి వస్తె ఆయన పాటలు గుర్తుంచుకోదగ్గవి కొన్ని ఉన్నా నేపథ్య సంగీతం విషయంలో న్యాయం చేశారు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ పని తనం దాదాపు సినిమా అంతా కనిపించింది. 70లలోకి మనల్ని తీసుకువెళ్లడం మాత్రమే కాదు ట్రైన్ ను సృష్టించి అందులో దొంగతనం సీక్వెన్స్ ప్లాన్ చేసుకున్న తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఇక గ్రాఫిక్స్ విషయంలో ఇంకా కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత అందాన్ని తీసుకొచ్చింది. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా తగ్గినట్టు అనిపించలేదు.

ఫైనల్లీ: టైగర్ నాగేశ్వర రావు ఒక పీరియాడిక్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్. జరిగిన కథ అయినా సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళితే యాక్షన్ లవర్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా.