Thika Maka Thanda Movie Review :విభిన్నమైన కథలకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండియన్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కవలలు హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా హీరోయిన్ గా మారిన యాని, రేఖా నిరోషా హీరోయిన్స్ గా వెంకట్ డైరెక్షన్లో తికమకతాండ అనే సినిమా తెరకెక్కింది. గతంలో విక్రమ్ కె కుమార్, గౌతమ్ మీనన్ దగ్గర పనిచేసిన వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవగా ఊరందరికీ మతిమరుపు అనే కొత్త కాన్సప్ట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ
తెలంగాణలోని తికమకతాండ అనే ఒక మారుమూల గ్రామంలో ఊరందరికీ మతిమరుపు సమస్య ఉంటుంది. ఊరందరికీ అదే సమస్య వింతగా ఉన్నా ఆ సమస్యను పోగొట్టుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అని ఫిక్స్ అవుతారు. అయితే ఆ జాతర చేయడానికి రెడీ అయిన తర్వాత అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అయితే నిజానికి ఈ ఊరి మొత్తానికి మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఊరి గర్భగుడిలో ఉండాల్సిన అమ్మవారి విగ్రహం అసలు ఎలా మాయమైంది? ఆ గ్రామ సమస్యలు పరిష్కరించడానికి, విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి ఊరు వాళ్ళు, సహా హీరోలు, హీరోయిన్లు ఏమి చేశారు? చివరికి ఆ సమస్య తీరిందా? లేదా? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా మొత్తం చూడాల్సిందే.
విశ్లేషణ:
తికమక తాండ పేరుకు తగ్గట్టే కామెడీ చుట్టూనే తిప్పాడు దర్శకుడు. మొదటి భాగం అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగగా అమ్మవారి విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే ఆ చోరీ తరువాత నుంచి కథను సస్పెన్స్ లో పెట్టి కథనాన్ని సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ నుంచి సినిమా మీద ఆసక్తిగా పెరిగేలా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం ఊళ్ళో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలు, వాటి కోసం హీరోలు ఏమి చేశారు అనే విషయాలు చూపించారు.
ఇక నటీనటుల విషయానికొస్తే.. హరికృష్ణ, రామకృష్ణ కవల పిల్లలు. ఈ సినిమాతో హీరోలుగా పరిచయం అయిన ఈ ఇద్దరూ నటనలో మెప్పించే ప్రయత్నం చేశారు. రాజన్న సహా అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన యాని ఈ సినిమాలో హీరోయిన్ గా మల్లిక అనే పాత్రలో ఒదిగిపోయింది. హీరోయిన్ గా క్యూట్ గా కనిపించి అలరించింది. మరో హీరోయిన్ రేఖా నిరోషా కూడా ఆకట్టుకుంది. ఇక శివన్నారాయణ, బుల్లెట్ భాస్కర్, యాదమ్మ రాజు, రాకెట్ రాఘవ తమ పాత్రలతో నవించే ప్రయత్నం చేశారు. ఇక టెక్నీకల్ టీం విషయానికి వస్తే దర్శకుడు వెంకట్ ఎంచుకున్న కథాంశాన్ని ఇంకా క్లారిటీతో కరెక్ట్ స్క్రీన్ ప్లేతో చెప్పి ఉంటే బాగుండేది. పి హరికృష్ణన్ ఫోటోగ్రఫీ సినిమాకి చాలా ప్లస్ అయింది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి మరో అదనపు ఆకర్షణ అని చెప్పాలి. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక సినిమా లొకేషన్స్ ను ఫోటోగ్రఫీతో మరింత అందంగా చూపించారు మేకర్స్. తిరుపతి శ్రీనివాసరావు టెక్నికల్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా సినిమాని నిర్మించారు.
ఫైనల్లీ: ఈ ‘తికమకతాండ’ తికమక పెడుతూనే నవ్విస్తుంది.