NTV Telugu Site icon

Rudrudu Movie Review: రుద్రుడు రివ్యూ (తమిళ డబ్బింగ్)

Rudrudu Movie

Rudrudu Movie

Rudrudu Movie Review: ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవేంద్ర లారెన్స్ సినిమా విడుదలై చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయింది. తాజాగా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కతిరేశన్ రూపొందించిన ‘రుద్రుడు’తో లారెన్స్ మరోసారి తెలుగువారి ముందుకు ఏప్రిల్ 14న వచ్చాడు. లారెన్స్ మార్క్ మాస్ యాక్షన్, సెంటిమెంట్ డ్రామాతో రూపుదిద్దుకున్న ‘రుద్రుడు’ మూవీని తెలుగులో ‘ఠాగూర్’ మధు విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

రుద్ర (లారెన్స్)ది హ్యాపీ ఫ్యామిలీ. తండ్రి దేవరాజ్ (నాజర్) ట్రావెలింగ్ బిజినెస్ లో ఉంటే, తల్లి ఇంద్రాణి (పూర్ణిమా జయరాం) హౌస్ వైఫ్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రుద్ర ఇంటర్వూకు వెళ్ళే ముందు సర్టిఫికెట్స్ పోగొట్టుకుంటే… వాటిని అతనికి అనన్య (ప్రియ భవానీ శంకర్) అనే అమ్మాయి తెచ్చి ఇస్తుంది. ఆమెలోని హెల్పింగ్ నేచర్ చూసి రుద్ర ప్రేమలో పడిపోతాడు. పెద్దల అంగీకారంతో పెళ్ళీ జరిగిపోతుంది. ఇంతలో అనుకోకుండా రుద్ర కుటుంబం ఆర్థిక సంక్షోభానికి గురి కావడంతో దాన్ని ఎదుర్కోటానికి రుద్ర ఇష్టం లేకపోయినా… ఉద్యోగరీత్యా లండన్ కు ప్రయాణమౌతాడు. అప్పుల బారి నుండి ఫ్యామిలీ బయట పడుతోందని భావిస్తున్న సమయంలో ఊహించని దుర్ఘటనలు చోటు చేసుకుంటాయి. అతను ఎంతగానో ప్రేమించే తల్లి, భార్య హత్యకు గురౌతారు. సాధారణ జీవితాన్ని గడిపే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రుద్ర… తనకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అందులో భూమి (శరత్ కుమార్) పాత్ర ఏమిటీ? అనేదే ‘రుద్రుడు’ అసలు కథ.

వాస్తవంగా ఇది పరమ రొటీన్ రివేంజ్ డ్రామా. అంతే రొటీన్ గా డైరెక్టర్ కతిరేశన్ తెరకెక్కించాడు. అక్రమార్జనకు అలవాటు పడిన వ్యక్తులు సమాజాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వారికి అడ్డు వచ్చిన వారిని అతి దారుణంగా హత్య చేయడం కూడా ఇవాళ సర్వ సాధారణమైపోయింది. అయితే… అలాంటి వారి దృష్టి ఎన్. ఆర్. ఐ. కుర్రాళ్ళ తల్లిదండ్రులు మీద పడితే పరిస్థితి ఏమిటీ అనేదే ఇందులోని ప్రధానాంశం. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళిన కుర్రాళ్ళు అక్కడి విలాసాలకు అలవాటు పడి ఇక్కడ అయినవారిని పట్టించుకోక పోతే… అసాంఘీక శక్తులు వారి ఆస్తి మీద కన్నేసి దాన్ని పొందడం కోసం ఎంతకైనా తెగిస్తే… జరిగే పరిణామాలు ఏమిటనేది ఇందులో చూపించారు. ఇది కాస్తంత ఆలోచించాల్సిన అంశమే అయినా చాలా ఆలస్యంగా తెర మీదకు తీసుకొచ్చాడు. అప్పటికే చూసిన నాన్ స్టాప్ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకుడి బుర్ర హీటెక్కి పోతుంది. చివరిలో డైరెక్టర్ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, వారిని వృద్ధాశ్రమాలలో చేర్చడం సరైనదని కాదని చెప్పినా… ఆ సందేశాన్ని ఆకళింపు చేసుకునే స్థితిలో ప్రేక్షకుడు ఉండడు. బేసికల్ గా లారెన్స్ పలు సేవా కార్యక్రమాలను చేస్తుంటాడు కాబట్టి… అతని పాత్రతోనే క్లయిమాక్స్ లో వాటి ఆవశ్యకతను నొక్కి చెప్పించారు.

లారెన్స్ కు ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. అయితే ఏ కోశానా అతనో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనే భావన మనకు కలగదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ప్రతీకార జ్వాలతో రగిలిపోతూనే ఉంటాడు. పాటల కోసం సిట్యుయేషన్స్ ను బలవంతంగా క్రియేట్ చేయడంతో అవన్నీ మొక్కుబడి వ్యవహారంగా మారిపోయాయి. వాటికి లారెన్స్ వేసిన స్టెప్పులు సైతం పరమ రొటీన్ గా ఉన్నాయి. హోమ్లీ క్యారెక్టర్స్ తో నెట్టుకొస్తున్న ప్రియ భవానీ శంకర్ ఇందులో అనన్య పాత్రను బాగానే చేసింది. కానీ ఆమెకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది. ఇక హీరో తల్లిదండ్రుల పాత్రలను నాజర్, పూర్ణిమా భాగ్యరాజా చేశారు. నాజర్ కు డబ్బింగ్ సెట్ కాలేదు. ఇన్నేళ్ళుగా ఆయన వాయిస్ ను వేరేగా విని… ఇప్పుడు ఈ వాయిస్ తో నాజర్ ను చూస్తుంటే ఎలానో అనిపించింది. శరత్ కుమార్ ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్ లో నటించడం గ్రేట్! భూమిగా ప్రతినాయకుడి పాత్రలో మెప్పించాడు. ఇతర ప్రధాన పాత్రలను శరత్ లోహితాస్య, జయప్రకాశ్, రెడిన్ కింగ్ స్లే, శివజీత్, అభిషేక్ వినోద్, సచు తదితరులు పోషించారు. జీవీ ప్రకాశ్ స్వర పరిచిన బాణీలేవీ గొప్పగా లేవు. ఒక్క మెలోడీ సాంగ్ తప్ప! ఇక సామ్ సి. ఎస్. తన నేపథ్య సంగీతంతో చెవుల్లో తుప్పు వదిలించేశాడు. ఆర్. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ కొంతలో కొంత బెటర్. బట్… ఇలాంటి రొటీన్ మాస్, యాక్షన్, హెవీ ఫ్యామిలీ డ్రామాతో ఈ తరం ప్రేక్షకులను ఒప్పించగలనని లారెన్స్ ఎలా అనుకున్నాడో అర్థమే కాదు. ఇది చాలదన్నట్టు దీని సీక్వెల్ కూ సిద్ధం కమ్మంటూ భయపెట్టడం కొసమెరుపు!

రేటింగ్: 2 /5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న అంశం
క్లయిమాక్స్ సాంగ్

మైనెస్ పాయింట్స్
మూవీ రన్ టైమ్
ఆకట్టుకోని స్క్రీన్ ప్లే
ఓవర్ డోస్ యాక్షన్ సీన్స్

ట్యాగ్ లైన్: బాదుడు!

Show comments