Maama Mascheendra Movie Review: మహేష్ బాబు బావమరిది, నైట్రో స్టార్ గా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘మామా మశ్చీంద్ర’. ఈ సినిమాతో నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకుడుగా మారుతూ ఉండడంతో పాటు ఈ సినిమా ట్రెయిలర్, టీజర్ సహా సినిమాలో సుధీర్ బాబు మూడు లుక్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేసింది. దానికి తోడు మేనమామ, మేనల్లుడు కథ అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉన్నది? అందరి అంచనాలు ఎంత వరకు ఆడుకుంది? అనేది సినిమా రివ్యూలో చూద్దాం.
‘మామా మశ్చీంద్ర’ కథ : ఒక గొప్పింటి తల్లి కడుపున పుట్టిన పరశురామ్ (సుధీర్ బాబు) బాల్యంలో చూసిన, అనుభవించిన కొన్ని పరిస్థితులలో ఒక చలనం, ఎమోషన్స్ లేని మనిషిగా మారడతాడు. కోట్ల ఆస్తి కోసం సొంత మనుషులను సైతం చంపడానికి వెనుకాడని ఆయన కళ్ళు లేని చెల్లెలు, ఆమె భర్తతో పాటు పిల్లల్ని చంపమని తన మనిషి దాసు (హర్షవర్ధన్)ను పంపిస్తే వారు మిస్ అవుతారు. ఇక తర్వాత పెరిగి పెద్దదైన పరశురామ్ కుమార్తె విశాలాక్షి (ఈషా రెబ్బా), విశాఖలో రౌడీ షీటర్ దుర్గ (సుధీర్ బాబు) ప్రేమలో, దాసు కుమార్తె మీనాక్షి (మృణాళిని రవి), ఫేమస్ డీజే (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు. ఈ విషయం తెలిసి… తన పోలికలతో జన్మించిన ఆ ఇద్దరు మేనల్లుళ్లు పగ తీర్చుకోవాలని ఇలా ప్రేమ నాటకానికి దిగారని పరశురామ్ అనుమానిస్తాడు. అయితే ఈ పగ నిజమా? లేక అది అతని భ్రమా? అసలు పరశురామ్ మీద హత్యాయత్నం చేసింది ఎవరు? కుమార్తెల విషయంలో పరశురామ్, దాసు చేసిన అన్యాయం ఏంటి? ఆ నిజం వాళ్ళకు ఎప్పుడు తెలిసింది? ఆ నిజం తెలిసిన తరువాత ఏమైంది? అనేది సినిమా కథ.
విశ్లేషణ: ఈ సినిమాను డైరెక్ట్ చేసింది రచయితగా మనం, గుండె జారి గల్లంతు అయింది లాంటి సినిమాలకి రచయితగా వ్యవహరించిన హర్ష వర్ధన్ కావడంతో సహజంగా అందరికీ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. అంటే ఆయన మీద పెద్ద పెద్ద బాధ్యతలే పడ్డాయి. ఈ సినిమా కధపరంగా చూస్తే కొత్త కథ ఏమీ కాదు. గతంలో మనం చూసిన ఎన్నో సినిమాల్లో నలిగిన కథనే ఇప్పుడు తనదైన శైలోలో అనేక ట్విస్టుల ఉండేలా రాసుకున్నాడు హర్ష వర్ధన్. అయితే ఈ ‘మామా మశ్చీంద్ర’లో టిస్టులు కొత్తగా ఉన్నాయా? అంటే ఉన్నాయని అనలేం. అయితే కొన్ని ట్విస్టుల మాత్రం అసలు ఏం జరుగుతోంది? అని అర్థం కాక ప్రేక్షకులు బుర్రకు పదును పెట్టేలా ఉన్నాయి. కథను ఆసక్తికరంగా ముందు తీసుకు వెళ్లడంలో హర్షవర్ధన్ బాగా తడబడ్డాడు. నిజానికి ఆయనకు కామెడీ విషయంలో మంచి పట్టుంది కానీ ఈ సినిమాలో అది పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. చాలా సీన్లు లాజిక్ కి దూరంగా, పూర్తి సినిమాటిక్ గా ఉన్నాయి. సినిమాటిక్ లిబర్టీనీ ఒక రేంజ్ లో వాడేసుకుని అసలు మన ఊహకు కూడా అందని సీన్లు ఆకట్టుకునేలా తీయాలని ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. పూర్తిస్థాయిలో రొటీన్ కథకు ట్విస్టులను జోడించి ఏదో చేయాలని అనుకుంటే ఇంకేదో అయింది.
ఎవరేలా చేశారంటే : ముందుగా నటీనటుల విషయానికి వస్తే సుధీర్ బాబు మూడు పాత్రలలో నటన విషయంలో ఆకట్టుకునేలా నటించినా రెగ్యులర్ లుక్కులో తప్ప లావుగా ఉన్న లుక్ లో మేకప్ సెట్ కాలేదు. ముసలి గెటప్ కూడా ఎందుకో నప్పలేదు. ఈషా రెబ్బా, మృణాళిని రవి… హీరోయిన్లు ఇద్దరి పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేదనిపించింది. అయితే దర్శక, రచయితగా కంటే నటుడిగా హర్షవర్ధన్ తన టాలెంట్ చూపించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే హర్షవర్ధన్ డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. ఇక స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. పాటలు గుర్తుంచుకునేలా లేవు, నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. పీజీ విందా కెమెరా వర్క్ ఫర్వాలేదనిపిస్తుంది.
ఫైనల్లీ : మామా మశ్చీంద్ర మెదళ్ళకు పని పెట్టి కన్ఫ్యూజ్ చేసే రొటీన్ రివెంజ్ స్టోరీ..