Sriranga Neethulu Review: సుహాస్, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో నటించిన ‘శ్రీరంగనీతులు’ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి ఈ సినిమాను నిర్మించారు. వరుస హిట్ల మీద ఉన్న సుహాస్ నటించిన సినిమా కావడం బేబీ సినిమా తర్వాత విరాజ్ అశ్విన్ నటించిన సినిమా కావడంతో సాధారణంగానే ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
శ్రీరంగనీతులు కథ
శ్రీరంగనీతులు ఒక్కరి కథ కాదు, ముగ్గురి కథ. శివ(సుహాస్) హైదరాబాద్ అంబర్ పేట బస్తీలో నివసించే కుర్రాడు. ఒక మంచి టీవీ సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్ గా పని చేస్తూ తన బస్తీలో ఉన్న మిగతా కుర్రాళ్ళ కన్నా గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. చిన్న పనిచేసినా పబ్లిసిటీ చేసుకుని ఫ్లెక్స్ లు కొట్టించి ఏదో సాధించినట్లు. అదే ఏరియాలో ఉండే మరో గ్యాంగ్ తో గొడవ పెట్టుకోవడంతో ఒక ఫ్లెక్సీ విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరో పక్క కార్తీక్(కార్తీక్ రత్నం) చాలా తెలివైన కుర్రాడు కానీ ఒక విషయంలో ఫెయిల్ అయ్యాయని, దాన్నే తలుచుకుంటూ గంజాయి మందు కొడుకు వాటికి బానిస అయిపోతాడు. బయటినుంచి కొనుక్కు రావాలంటే గంజాయికి చాలా ఖర్చవుతుంది అని భావించి ఏకంగా ఇంట్లోనే మొక్క పెంచుతాడు. ఒకరోజు కార్తీక్ తమ్ముడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక సెల్ఫీతో పోలీసులు కార్తీక్ కోసం వెంటపడతారు. గంజాయి మొక్కలతో కార్తీక్ పారిపోగా తండ్రి( దేవి ప్రసాద్) కార్తిక్ కోసం వెంటపడతాడు. ఇక మరో కథలో.. ఇందు(రుహాణి శర్మ) వరుణ్(విరాజ్ అశ్విన్) ప్రేమలో ఉండగా హిందూ కుటుంబం మరొక సంబంధం తీసుకొస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఇందు పీరియడ్స్ మిస్ కావడంతో ప్రగ్నెంట్ అయ్యానేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. శివ ఫ్లెక్సీ గొడవ ఏమైంది? గంజాయి మొక్కలతో పారిపోయిన కార్తీక్ పోలీసులకు దొరికాడా? ఇందు తన ప్రేమ విషయం పేరెంట్స్ కి చెప్పిందా? లేదా అనేది తెలియాలి అంటే శ్రీరంగనీతులు సినిమాను థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ:
స్టార్ క్యాస్ట్ లేకున్నా కంటెంట్ తో మెప్పిస్తున్నారు ఇప్పటి యువ దర్శకులు. సినిమాను ఫన్నీగా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలానే తీసుకెళ్తూ చివరికి సందేశాన్ని అందిస్తూ వస్తున్నారు. `శ్రీరంగ నీతులు` సినిమాను కూడా అలాగే ప్లాన్ చేసినట్టు అనిపించింది. మూడు జీవితాలను చూపిస్తూ ప్పటి జనరేషన్ యువత ఎలా ఉంటుందనేది చెబుతూనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే సినిమాలో సందేశం ఇవ్వాలన్న తపన బాగుంది కానీ ఎందుకు? ఏమిటి? అనే క్లారిటీ మాత్రం మిస్ అయ్యింది. ఎంచుకున్న కథ బాగుంది కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు దర్శకుడు. అయితే సినిమాలో చాలా వరకు ఫన్నీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సుహాస్ పాత్ర, వారి ఫ్రెండ్స్ చేసే చేష్టలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్లెక్సీ కోసం సుహాస్ అండ్ కో పడే ఆరాటంతో కామెడీ వర్కౌట్ అయింది. విరాజ్, రుహానీ శర్మల పాత్రల ద్వారా ఈ తరం లవర్స్ పడే వేదన చూపించాడు. పెళ్లిళ్ల విషయంలో కులాల ప్రయారిటీ, దాని వలన పడే వేదనని సున్నితంగా ఆవిష్కరించారు. ఇక కార్తీక్ రత్నం పాత్రతో టాలెంట్ ఉండి, సరైన గైడెన్స్ లేక, సమాజంపై కోపంతో తప్పుడు దారిలో వెళ్లే క్రమాన్ని చూపించాడు. అయితే జనరల్‌గా ఇలాంటి కథల్లో ఈ మూడు పాత్రలకు ఎక్కడో ఓ చోట ముడి పెట్టి, భలే కనెక్ట్ చేశాడా డైరెక్టర్ అనేలా ముగింపు పలుకుతారు. అయితే కానీ ఈ సినిమాలో ఈ పాత్రలు కలువవు, ఒకానొక సమయంలో కలిసే అవకాశం ఉన్నా కలవకుండానే వేర్వేరు కథలుగానే చూపించారు. మూడు కథల్లో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో చూపినా లవర్స్ మినహాయించి మరో రెండు పత్రాలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయాడు. కార్తీక్ రత్నం ఎందుకు మత్తుకు బానిస అయ్యాడు? అనేదానికి బలమైన కారణం ఏంటి అనేది చెప్పలేదు. ఇక సుహాస్.. ఎందుకు ప్లెక్సీలు నిలబెట్టడానికి అంతగా ఆరాటపడుతున్నాడనేది ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకా బావుండేది. అయితే యువతకు ఇచ్చే సందేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి.
నటీనటుల విషయానికి వస్తే శివ అనే బస్తీ కుర్రాడి పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. అతని ఫ్రెండ్‌గా రాగ్ మయూర్‌కి కూడా మంచి పాత్ర పడింది. కార్తీక్ రత్నం మత్తు బాధితుడిగా జీవించాడు. కార్తీక్ తండ్రి పాత్రలో దేవి ప్రసాద్ మరోసారి ఆకట్టుకున్నాడు. విరాజ్ అశ్విన్, రుహానీశర్మలు తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు. కిరణ్ మచ్చా, తనికెళ్ళ భరణి వంటి ఇతర పాత్రదారులు సైతం ఓకే అనిపించారు. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరింది. పాటలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా సెట్ అయింది. డైలాగ్స్ బాగున్నాయి. కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ శ్రీరంగ నీతులు యువతకు కోసం చేసిన ఒక సందేశాత్మక మూవీ.