NTV Telugu Site icon

SIR Movie Review: సార్ రివ్యూ

Sir

Sir

SIR Movie Review: సార్ రివ్యూ
విడుదల: 17-02-2023
నిర్మాణం: ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు: ధనుష్‌, సంయుక్త మీనన్, సాయికుమార్, తనికెళ్ళ భరణి, సముతిరఖని, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్, తోటపల్లి మధు
సంగీతం: జి.వి.ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ: యువరాజ్
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: వెంకీ అట్లూరి

తమిళ హీరోలు ఈ మధ్య కాలంలో స్ర్టయిట్‌ తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి ద్విభాషా చిత్రాలే అయినా, తెలుగు నిర్మాతలు, తెలుగు దర్శకులతో వాటిని చేస్తుండటం విశేషం. అలా సితార ఎంటర్‌ టైన్ మెంట్స్ బ్యానర్ లో ధనుష్‌ చేసిన సినిమా ‘సార్‌’. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీకి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య మరో నిర్మాత. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘సార్’కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం.

ఇవాళ చాలా మంది విద్య వ్యాపారంగా మారిపోయిందని వాపోతుంటారు. నిజానికి దానికి బీజం పాతికేళ్ళ క్రితమే పడింది. గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని అన్ని రంగాల్లోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశించినట్టు ఎడ్యుకేషన్‌ సిస్టమ్ లోనూ అవి చాపకింద నీరులా అడుగుపెట్టాయి. బెటర్‌ ఎడ్యుకేషన్‌ అనే నెపంతో మధ్యతరగతి వాళ్ళను సైతం జలగల్లా పీల్చుకుతినడం మొదలు పెట్టాయి. జలగల్లాంటి ఆ సంస్థలు రాబోయే రోజుల్లో ఆక్టోపస్ ల మాదిరి తయారవుతాయని గ్రహించిన ఓ సాధారణ లెక్చరర్‌ ఆ విధానంపై ఎలా పోరాటం చేశాడన్నదే ‘సార్‌’ కథ.

ఇది దాదాపు పాతికేళ్ళ క్రితం నాటి కథ. త్రిపాఠి ఎడ్యుకేషనల్ సొసైటీలో బాలు అనే బాలగంగాధర్‌ తిలక్‌ (ధనుష్‌) జూనియర్‌ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ప్రభుత్వ కాలేజీల్లోనూ మేలైన విద్యను అందిస్తామంటూ త్రిపాఠీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ గవర్నమెంట్‌ తో ఓ ఒప్పదం చేసుకుంటుంది. నిజానికి వాటిని మరింత దిగజార్చాలన్నది దాని అధినేత త్రిపాఠి (సముతిర ఖని) ఆలోచన. పల్లెల్లో ఉండే ప్రభుత్వ కళాశాలలకు అంత జ్ఞానం లేని లెక్చరర్స్ ను పంపుతాడు. అలా సిరిపురం అనే గ్రామానికి బాలు లెక్చరర్‌గా వెళతాడు? స్కూల్ కే రాని విద్యార్థులను అతను ఎలా దారికి తెచ్చాడు? తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో త్రిపాఠి అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ‘సార్‌’ చిత్రకథ.

తెలుగు మీడియం ఉండాలని ఉద్యమం చేసే వాళ్ళు తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్ లో చదివిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలలు కొనసాగాలని కోరుకునే వారు తమ పిల్లలను లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆవశ్యకత గురించి మాట్లాడే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ లోనే వైద్యం చేయించుకుంటారు. ఇవాళ అంతలా విద్య, వైద్య రంగాల్లోకి కార్పొరేట్‌ సంస్థలు అడుగుపెట్టాయి. వీటిని నిరోధించలేం. అయితే ఏదో ఒక స్థాయిలో ‘మన నడుస్తోంది సరైన మార్గం కాదు, దీని వల్ల బడుగు, బలహీన, మధ్య తరగతి వర్గాలు నానా కష్టాలు పడుతున్నాయి’ అని ఎలుగెత్తి చాటడమో, వేలెత్తి చూపాల్సిన అవసరమో ఉంది. ఈ సినిమా అదే పనిచేసింది. కార్పొరేట్‌ విద్యాసంస్థల కారణంగా ఎన్ని మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయో చెప్పింది. అంతేకాదు.. ఒక్కడినే అని ఊరుకోకుండా ఒకే ఒక్కడు తన వంతుగా విద్యారంగంలో ఎలాంటి కృషి చేశాడో తెలిపింది. అందుకు దర్శక నిర్మాతలను అభినందించాలి.

ఇక సినిమాగా చూస్తే.. ఇందులో మనకు ఎన్నో అంశాలు కనిపిస్తాయి. పాతికేళ్ళ క్రితం కూడా కులం యువత మీద ఎలాంటి ప్రభావం చూపింది? పల్లెటూళ్ళలో ఉండే కట్టుబాట్లు వారి మధ్య ఎలాంటి ఎడబాట్లకు కారణమయ్యాయి? రాజకీయ లబ్ది కోసం తెలిసో తెలియకో గ్రామీణ స్థాయి నాయకులు సైతం ఎలా తప్పటడుగులు వేశారు? అనే వాటిని దర్శకుడు వెంకీ అట్లూరి టచ్ చేశాడు. వీటిలో చాలా వాటికి పరిష్కారం చూపినా ఎడ్యుకేషన్‌ సిస్టమ్ ను ప్రక్షాళన చేయడం ఓ వ్యక్తి వల్ల కాదని, ఎవరికి వారు చిత్తశుద్థితో ఉచిత విద్యను అందించి సేవ చేయాలనే సందేశాన్ని మాత్రం అందించాడు. చిత్రం ఏమంటే.. పాతికేళ్ళ తర్వాత ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ కార్పొరేట్‌ వర్గాల చేతుల్లోనే ఉంది. ప్రభుత్వాలు సైతం ఆ సంస్థలతో చేతులు కలిపి, ఓ మేరకు విద్యాసాయం చేస్తున్నా.. అందులోని లొసుగుల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే ధనుష్‌ ఈ చిత్రానికి మెయిన్‌ పిల్లర్. కథను తన భుజానికి ఎత్తుకుని నడిపించాడు. మిగిలిన పాత్రలన్నీ అతని పక్కన తేలిపోయాయి. వినోదాన్ని పండిస్తాడని భావించిన హైపర్ ఆది పాత్రను మధ్యలోని ఇంటికి పంపేశారు. బోటనీ లెక్చరర్‌ సంయుక్త మీనన్‌ పాత్ర మరింత బాగా రాసుకుని ఉండొచ్చు. అలానే ప్రధాన ప్రతినాయకుడైన సముతిర ఖని పాత్ర కొంత మేరకే పవర్‌ ఫుల్‌గా మలిచారు. అన్ని రకాల షేడ్స్ ఉన్న గ్రామ ప్రెసిడెంట్ పాత్రలో సాయికుమార్ బాగా చేశారు. ఇతర పాత్రల్లో ‘ఆడుకాలమ్‌’ నవీన్‌, భరణి, హరీశ్‌ పేరడి, ‘టెంపర్‌’ శివ, తోటపల్లి మధు, నాగమహేశ్‌, మొట్ట రాజేంద్రన్, కల్పలత తదితరులు కనిపిస్తారు. సుమంత్‌ స్క్రీన్ మీద కనిపించడం ఓ సర్ ప్రైజ్! ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లయిమాక్స్ లో భారతీరాజా అతిథి పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల్లో ‘మాస్టారు మాస్టారు…’ మాత్రమే ఆకట్టుకునేలా సాగింది. జీవీ ప్రకాశ్‌ నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాలో కొన్ని సందర్భాలలో వచ్చే డైలాగ్స్ థియేటర్ లో క్లాప్స్ కొట్టించాయి. అయితే కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపించాయి.

ధనుష్‌ లాంటి మాస్‌ ఇమేజ్‌ ఉన్న హీరోను దర్శకుడు వెంకీ ఇంకా బాగా యూజ్‌ చేసుకుని ఉండాల్సింది. చెప్పేది అర్థవంతమైన విషయమే అయినా దానికి మరింత కమర్షియాలిటీని మిక్స్ చేసి, పవర్ ఫుల్ గా చెప్పి ఉండాల్సింది. మన వ్యవస్థలోని లోపాలను చూపించాలని అనుకున్నప్పుడు కథ మరింత పవర్ ఫుల్ గా ఉండాలి. ఈ సినిమా చూస్తుంటే ఇటీవల కాలంలో విద్యావ్యవస్థపై వచ్చిన అనేక సినిమాలు మనసులో మెదులుతాయి. ఓ కొత్త పాయింట్‌ నో, కొత్త కథనో చూశామనే భావన కలగపోయినా ఆడియెన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. ధనుష్‌ లాంటి ఆల్ రౌండర్ డేట్స్ దొరికాయి కదా అని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్‌ మూవీ చేయకుండా అర్థవంతమైన సినిమా నిర్మించడం గ్రేట్! ఇలాంటి సినిమాలు రావలసిన అవసరం కూడా ఉంది.

రేటింగ్‌: 2.75/5

ప్లస్‌ పాయింట్స్
ఎంచుకున్న అంశం
ధనుష్‌ నటన
నేపథ్య సంగీతం

నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్స్
స్లో నెరేషన్
ఒక్కటి తప్ప ఆకట్టుకోని పాటలు

ట్యాగ్ లైన్: గ్రేట్ ‘సార్’!