NTV Telugu Site icon

Sindooram Movie Review: సిందూరం

Sindooram

Sindooram

Sindooram Movie Review:’సిందూరం’ టైటిల్ వినగానే దాదాపు 25 సంవత్సరాల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమ గుర్తుకు రాక మానదు. నక్సలిజం వర్సెస్ పోలీస్ కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా సమాజంలో నక్సలిజం ప్రభావం ఉన్నపుడే ప్రజాదరణ దక్కించుకోలేక పోయింది. నక్సలైట్స్ దాదాపు కనుమరుగై పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నక్సలిజం కమర్షియల్ యాంగిల్ లో టర్న్ అయిందనే పాయింట్ తో తీసిన ఇప్పటి ‘సిందూరం’కి ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

కథ విషయానికి వస్తే 2003 నేపథ్యంలో జరిగినట్లు చూపించారు. శ్రీరామగిరి ఏజెన్సీలో భూస్వాములు, కమ్యూనిస్ట్ లు, పోలీసుల మధ్య జరిగిన ఆధిపత్యపోరు ఈ సినిమా కథాంశం. దోపిడికి గురవుతున్న రైతులు, కార్మికులకు అండగా సింగన్న (శివబాలాజీ) దళం పోరాటం చేస్తుంటుంది. అదే గ్రామానికి చెందిన రవి (ధర్మ మహేష్) నక్సలైట్లకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఆ గ్రామానికి కొత్తగా ఎం.ఆర్.వోగా వచ్చిన శిరీష (బ్రిగిడా సాగా) మార్పు కోసం ప్రయత్నిస్తూ రైతులకు, కూలీలకు అండా నిలబడుతుంది. క్లాస్ మేట్ అయిన శిరీష పట్ల రవి ఆకర్షితుడవుతాడు. భూస్వామ్య వర్గానికి చెందిన శిరీష వారి వర్గ ప్రయోజనాలకే అలా చేస్తుందని సింగన్న దళం భావించి జడ్.పి.టీ.సీలో తమ అభ్యర్థిని రంగంలోకి దింపుతుంది. ఆ అభ్యర్థి  హత్యకు గువరవుతాడు. దాంతో పోటీలో ఉన్న శిరీష అన్నను కూడా హతమారుస్తారు. వీరిని ఎవరు హతమారుస్తారు? పోటీలో నిలిచిన శిరీష ఏమవుతుంది? ఇన్ ఫార్మర్ గా ఉన్న రవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? సింగన్న దళం ఏమవుతుంది? అన్నదే ఈ సినిమా.

నిజానికి దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి ఎంచుకున్నది సున్నితమైన కథ. పనికి తగిన వేతనం, కార్మిక సమస్యల కోసం పోరాటం వంటివి గతంలో ఎన్నో సినిమాల్లో వచ్చాయి. అనేక ఏజెన్సీ ప్రాంతాలలో దీనికోసం ఘర్షణలు జరగటం కూడా చూశాం. నక్సలైట్స్, పోలీసులలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేదానిని విశ్లేషించటం కత్తిమీద సామే. అయితే ఈ ప్రథమార్ధంలో సమస్యలు ఎత్తి చూపుతూ ద్వితీయార్థంలో కమ్యూనిజం ముసుగులో జరిగే అవకతవకలను ఇందులో ఎత్తిచూపించాడు దర్శకుడు. దీనికోసం ఎంతో రీసెర్చ్ చేసినట్లు అవగతం అవుతుంది. అయితే దానిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయటంలో దర్శకుడు తడబడ్డాడు. అవి లెక్చర్ ఇచ్చినట్లుగా అనిపించింది. ముందు చెప్పినట్లు సమాజంలో ప్రస్తుతం అంతగా ప్రాధాన్యం లేని అంశాలను అప్పట్లో అని చూపించటం, దానికి నిర్మాతలు రాజీపడకుండా నిర్మించటం అభినందించాల్సిన విషయం. అయితే వారిది వృధా ప్రయాసగా మిగిలిపోతుందన్నదే బాధ.

నటీనటుల విషయానికి వస్తే రవిగా నటించిన ధర్మ, శిరీష పాత్రధారి బ్రిగిడా తమ పాత్రలలో ఒదిగి పోయారు. వారిద్దరి హావభావాలు కూడా చక్కగా ఉన్నాయి. ప్రత్యేకించి బ్రిగిడా తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చింది. సింగన్నగా శివబాలాజీ ఓకె. ఇక ఈ సినిమాకు హైలైట్ అంటే కేశవ్ సినిమాటోగ్రఫి. ఏజెన్సీ ప్రాంతం ఏరియల్ షాట్‌లు, అడవుల్లోని సన్నివేశాల చిత్రీకరణ, వాటి ఫ్రేమింగ్ చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. ఇక సంగీత దర్శకుడు గౌర హరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పాటలు కూడా ఆకట్టుకునేలా సాగాయి. నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి. కమ్యూనిజాన్ని ఇష్టపడే వారికి ‘సిందూరం’ పంటి కింద రాయివంటిదే. ఓ 20 సంవత్సరాలు లేటుగా ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది.

రేటింగ్: 2.5/5

ప్లస్ పాయింట్స్
ధర్మ, బ్రిగిడా నటన
కేశవ్ సినిమాటోగ్రఫీ
గౌర హరి సంగీతం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
కమ్యూనిజం వ్యాపారమైందని చెప్పటం
స్లో నెరేషన్

ట్యాగ్ లైన్: నాన్ టైమింగ్ ‘సిందూరం’

Show comments