Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. చాదర్‌ఘాట్‌లోని ముస్లిం ఆసుపత్రి సమీపంలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో హల్‌చల్ చేశారు. సెల్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ విషయంలో జరిగిన చిన్న వివాదం పెద్ద గొడవగా మారింది. రూ.60 విలువైన స్క్రీన్ గార్డ్ అంశమే ఈ రాదంతానికి కారణమని సమాచారం. గంజాయి మత్తులో ఉన్న యువకులు తమను తాము రౌడీషీటర్లమని చెప్పుకుంటూ స్థానిక సెల్‌ఫోన్ రిపేర్ షాపులో దౌర్జన్యానికి దిగారు. షాపు యజమానిని దూషిస్తూ నెలనెలా మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా, ఇవ్వకపోతే పని చేయకుండా చేస్తామని బెదిరించారు. ఈ సమయంలో గొడవ మరింత ముదిరగా, ఓ యువకుడు కత్తి తీసుకుని రభస సృష్టించే ప్రయత్నం చేశాడు. భయాందోళనకు గురైన షాపు యజమాని ఈ మొత్తం ఘటనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. గంజాయి మత్తులో ఉన్న యువకులు ఏమి చేస్తున్నారో వాళ్లకే అర్థం కాని పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. పాతబస్తీలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
REAM MORE: Allu Arjun : 2026లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టిన ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కోసం ఎమోషనల్ నోట్!