NTV Telugu Site icon

Jack Review: సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ రివ్యూ

Jack

Jack

యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన సిద్ధు జొన్నలగడ్డ హీరోగా “జాక్” అనే సినిమా రూపొందింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, నరేష్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ప్రమోషన్స్‌తో సినిమా మీద ప్రేక్షకులలో కొంత ఆసక్తి ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి, ప్రేక్షకులలో ఏర్పడిన ఆసక్తిని ఈ సినిమా క్యాష్ చేసుకుందా? అసలు సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

జాక్ కథ: జాక్ అలియాస్ పాబ్లో నెరుడా (సిద్ధు జొన్నలగడ్డ)కి ఏ విషయం మీదా ఆసక్తి ఉండదు. అన్ని పనుల్లో ప్రావీణ్యత ఉండాలని భావించి, ఏ పని కుదిరితే ఆ పని చేస్తూ ఉంటాడు. అయితే, అతనికి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో జాయిన్ కావడం ఒక కల. “రా” ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యేవరకు ఎందుకు ఆగాలి అనే ఉద్దేశంతో, ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ హైదరాబాద్‌లో చేసిన బాంబ్ బ్లాస్ట్‌ను ఒక స్లీపర్ సెల్‌ను అదుపులోకి తీసుకుని ఆపేస్తాడు. అయితే, ఒక కన్ఫ్యూజన్‌లో “రా” ఏజెంట్ మనోజ్ (ప్రకాష్ రాజ్)ను కూడా అదుపులోకి తీసుకుంటాడు. దీంతో ఒక పక్క రా టీం అలాగే టెర్రరిస్ట్ గ్యాంగ్ కూడా జాక్ ను ట్రేస్ చేసే పనిలో పడతారు. మధ్యలో జాక్ ఏ పని చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతని తండ్రి(నరేష్) ఏర్పాటు చేసిన డిటెక్టివ్ (వైష్ణవి) కారణంగా జాక్ రా టీంకి చిక్కుతాడు. అసలు రా’లో అతన్ని సెలెక్ట్ చేయలేదని తెలుస్తుంది. అయినా రా టీం క్షమించి వదిలేస్తుంది. కానీ జాక్ మాత్రం ఓటమిని ఒప్పుకోకుండా ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్ ను పట్టుకోవాలి అని నేపాల్ వెళ్తాడు. అలా వెళ్లిన జాక్ ఏం చేశాడు? తన డ్రీమ్ జాబ్ వచ్చిందా? చివరికి ఏమైంది?

విశ్లేషణ: ఈ “జాక్” సినిమా లైన్ ఏంటి అని ప్రమోషన్స్‌లో దర్శకుడిని అడిగినప్పుడు, “రాయి, శిలా, శిల్పం” అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అయితే, సినిమా చూసిన తర్వాత ఆయన చెప్పిన స్టేట్‌మెంట్ లాగే కన్ఫ్యూజన్ ఎక్కువగా కనిపించింది. బొమ్మరిల్లు భాస్కర్ చెప్పాలనుకున్నది ఒక రాయి శిల్పంగా మారొచ్చు, కానీ శిల్పం రాయిలా మారలేదు కదా? అని వినడానికి మీకు కూడా కాస్త కన్ఫ్యూజన్‌గా ఉంది కదా? సినిమా కూడా అలాగే కన్ఫ్యూజ్డ్ స్టేట్‌లో నడిపించేశారు. చిన్నప్పుడే టెర్రరిస్ట్ యాక్టివిటీ వల్ల తల్లిని కోల్పోయిన బాలుడు, పెద్దయిన తర్వాత “రా” ఏజెంట్ అయి ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నింటినీ అరికట్టాలని అనుకుంటాడు. అలా “రా” ఏజెన్సీకి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, తాను సెలెక్ట్ అయిపోతానని నమ్మకంతో పలు విషయాల్లో ఎక్కువ ఊహించుకుంటూ వెళ్తాడు. అలా అనుకోకుండా ఒక మిషన్ తనకు తానే ప్రారంభించి, అసలైన “రా” ఏజెంట్స్ చేసే మిషన్ లో వేలు పెడతాడు. ఆ తర్వాత ఎదురయ్యే అంశాలను దర్శకుడు తెలివిగా రాసుకున్నాడు. కానీ ఎగ్జిక్యూషన్ లో ఎఫెక్ట్ పడింది.. నిజానికి, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో అనేక కమర్షియల్ అంశాలను చొప్పించే ప్రయత్నం చేశాడు. అయితే, ఎన్నో అంశాలు చొప్పించడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలా పరిస్తితి ఏర్పడింది. నిజానికి, ఇలాంటి కథలతో మనం గతంలో ఎన్నో సినిమాలు చూశాము. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు కానీ సిద్ధూ మార్క్ కామెడీ కొన్ని చోట్ల వర్క్ అవుట్ అయింది. గతంలో చూసిన ఎన్నో సినిమాల లాగే ఈ సినిమా లైన్ కూడా అనిపిస్తుంది. కాకపోతే, “రాయి శిల్పం” అంటూ ఒక లాజిక్‌తో ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ ట్రాక్ కానీ, హీరోకి తల్లి మీద ఉన్న ఎమోషన్స్ ఇంకా క్యారీ చేసి ఉండొచ్చు.. దర్శకుడు రాసుకున్న స్పై డ్రామాతో పాటు టెర్రరిస్ట్ విలన్ యాంగిల్ కూడా రొటీన్ అనిపించినా సిద్ధూ క్యారెక్టర్ ఆ లాజిక్స్ ను పక్కన పెట్టేలా రాసుకున్నారు..

ఇక నటీనటుల విషయానికి వస్తే, సిద్ధు జొన్నలగడ్డ ఎప్పటిలాగే తనకు బాగా అలవాటైన ఒక పాత్రలో నటించే ప్రయత్నం చేశాడు. అయితే, మనోడి నటనలో ఎక్కువగా “టిల్లు” ఛాయలు కనపడడం గమనార్హం. ఇక వైష్ణవి చైతన్య నటన కంటే ఎక్కువగా అందాలు ప్రదర్శించడంలోనే ఆసక్తి చూపించింది. ఒకటి రెండు ముద్దు సీన్స్‌లో కూడా ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. సుబ్బరాజు, నరేష్, రవి ప్రకాష్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్న కథ కొత్తగా లేకపోయినా, కథనంతో నడిపించాలనుకున్నాడు. సిద్దు మార్క్ కామెడీ వర్కౌట్ కావడం ప్లస్ పాయింట్. సంగీత దర్శకులు ముగ్గురు ఉన్నా సరే, సినిమాలో సాంగ్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఫైనల్లీ, ఈ “జాక్” పూర్తి క్రాక్ కాదు.. బానే నవ్విస్తాడు.