Saripodhaa Sanivaaram Movie Review in Telugu: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తరువాత వాళ్ళు ఇద్దరు కలిసి సరిపోదా శనివారం అనే మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద నెమ్మదిగా ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మొదటి రోజే సినిమా లైన్ ఏంటో చెప్పేసింది సినిమా యూనిట్. ఒక రకంగా ప్రేక్షకులను సినిమా కథ ఏంటో చెప్పేసి మరీ ప్రిపేర్ చేయించి థియేటర్లకు రప్పించుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? వివేక్ ఆత్రేయ మొదటిసారిగా బయటి సంగీత దర్శకుడు అయిన జేక్స్ బిజాయ్ తో చేతులు కలిపాడు. అది కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడడానికి ఒక కారణమని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
సరిపోదా శనివారం కథ: సూర్య(నాని) చిన్నప్పుడే తల్లి(అభిరామి)ని క్యాన్సర్ కారణంగా కోల్పోతాడు. అయితే తల్లి చనిపోయే ముందే సూర్యకి ఉన్న ఆవేశాన్ని తగ్గించేందుకు వారంలో ఒక్కరోజు మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించాలని మాట తీసుకుంటుంది. దాని ప్రకారం వారంలో శనివారం మాత్రమే సూర్య తన కోపాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. వారం మొత్తం జరిగిన అన్ని విషయాలను బేరీజు వేసుకుని శనివారం నాడు ఆ కోపం ప్రదర్శించాలా? లేదా? అని ఫిక్స్ అయి దాని ప్రకారం ముందుకు వెళ్తాడు. ఇలాంటి సమయంలోనే సూర్యకు ఒక గొడవలో చారులత(ప్రియాంక మోహన్) పరిచయమవుతుంది. మొదటి చూపులోనే ఆమె మీద ఇష్టం ఏర్పడుతుంది. ఐతే ఆమెకు వయలెన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఆమె సూర్యతో ప్రేమలో పడిన తర్వాత తన శనివారం సీక్రెట్ గురించి ఆమెకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అనుకోకుండా ఒక షాకింగ్ సంఘటన ఎదురవుతుంది. దీంతో శనివారం సీక్రెట్ రివీల్ కావడమే కాక సోకులపాలం అనే ప్రాంతానికి చెందిన అందరికీ సూర్య అండగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం చారులత పనిచేసే స్టేషన్ సీఐ దయానంద్ (ఎస్జే సూర్య)ను నాని కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అదే సమయంలో చారులత ఇచ్చిన ఒక సలహాతో సీఐను కొట్టకుండా ఒక సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తారు. అయితే చారులత, సూర్య కలిసి వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? శాడిజానికి ప్యాంటు, షర్ట్ వేస్తే ఇతనే అనిపించే సీఐ దయానంద్ ను సూర్య, చారులత ఎలా ఎదిరించారు? సోకుల పాలెం ప్రాంత ప్రజలను సూర్య కాపాడగలిగాడా? అసలు చివరికి ఏమైంది? చారులతకు సూర్యకు ప్రేమ కలగడానికంటే ముందే ఉన్న సంబంధం ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటి? అనే విషయాన్ని సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదటి రోజు నుంచి చెబుతూ వచ్చింది. అలాగే నాని కూడా మేము చెప్పాల్సింది అంతా ప్రమోషనల్ కంటెంట్ లోనే చెప్పేశాం. ఇక మీరు థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయడమే అన్నట్టుగా ప్రేక్షకులను ఒక రకమైన మైండ్ సెట్ తో ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులు కూడా చెప్పిన కథనే చూపిస్తున్నారు అంట, ఎలా ఉంటుందో అని చూసేందుకు ధియేటర్లకు వచ్చారు. అలా వచ్చిన వాళ్లకు ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా తనదైన శైలిలో కథను నడిపించాడు దర్శకుడు. ఫస్ట్ ఆఫ్ మొదలైనప్పటినుంచి సూర్య క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి అతని శనివారం సీక్రెట్ ఏమిటి? ఎందుకు ఆవేశాన్ని శనివారానికి మాత్రమే పరిమితం చేయాల్సి వచ్చింది? లాంటి విషయాలను చాలా కన్విన్సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అలాగే మూర్ఖత్వానికి పరాకాష్ట, శాడిజానికి నిలువెత్తు రూపంలా ఉండే సీఐ దయ క్యారెక్టర్ ను కూడా ఫస్ట్ ఆఫ్ లోని ఎస్టాబ్లిష్ చేస్తూ వారిద్దరికీ అసలు ఎలా గొడవ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా మలవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే ఈ క్యారెక్టర్ లని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ అఫ్ మొత్తం వాడేసుకున్నాడు. దీంతో కొంతమందికి ఫస్ట్ అఫ్ కొంత సాగదీసిన ఫీలింగ్ కలగడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా పెట్టుకున్నాడు. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య పోటీ ఎలా ఉంటుందో అలాంటి ఒక పోటీ వాతావరణాన్ని ఇంటర్వెల్ కి ముందు సృష్టించాడు. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత రాసుకున్న సన్నివేశాలు కొన్ని ఊహకు అందేటట్టు ఉన్నా కొన్ని మాత్రం ఊహకు అందకుండా తనదైన కథనంతో బండి నడిపించాడు డైరెక్టర్. డైరెక్టర్ గత సినిమాలతో పోలిస్తే ఇలాంటి ఒక సినిమా ఆయన దర్శకత్వంలో వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అలాంటి ఒక సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు. నిజానికి సినిమా కథలో కొత్తదనం ఏమీ లేదు ఒక ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న వ్యక్తిని, అదే ప్రాంత ప్రజలకు ధైర్యం ఇచ్చి ఎలా వాళ్లందరికీ స్వాతంత్రం కలిగించారు అనే పాయింట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. అయితే శనివారం మాత్రమే చేయి చేసుకునే హీరో అనే క్యారెక్టర్ ను ఇలాంటి లైన్ కు జత చేయడంతోనే స్క్రీన్ ప్లే మ్యాజిక్ జరిగేలా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. కథ రొటీన్ అనిపించినా కథనంతో కొంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు సినిమాలో లోపాలు ఉన్నా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం మాత్రం సినిమా చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కొన్ని సీన్స్ లాజిక్ లెస్ అనిపించినా తర్వాత వచ్చే సీన్స్ వాటిని మరిపింప చేసేలా డైరెక్టర్ కథను నడిపించాడు. మల్లాది నవల లో ఒక పాయింట్ తీసుకున్నట్లు మాత్రం ఆ నవల చదివిన వారికి అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే నాని గత సినిమాలతో పిలిస్తే ఈ సినిమాలో వయలన్స్ పాళ్లు కాస్త ఎక్కువే.
నటీనటుల విషయానికి వస్తే నాని ఎప్పటిలాగే తనదైన న్యాచురల్ యాక్టింగ్ తో నటించే ప్రయత్నం చేశాడు.. అయితే ఆయనకు అసలైన టాస్క్ ఎస్జే సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకునే సమయంలోనే వచ్చి పడింది.. ఎందుకంటే సూర్య యాక్టింగ్ నానిని డామినేట్ చేసేలా కొన్ని సీన్స్ లో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో నాని పాత్రకు నటించాల్సిన స్కోప్ లేదు కానీ అక్కడ సూర్య పాత్రకు నటించాల్సిన అవసరం ఉండడంతో కొన్ని సీన్స్ లో ఎందుకో డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇలాంటి ఒక కథను ఎంచుకోవడంతో నాని సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఎందుకంటే నటన విషయంలో తన డామినేట్ చేస్తారేమో అని అనుమానం ఉన్న చాలామంది హీరోలు ఒప్పుకోరు కానీ నాని మాత్రం అందుకు భిన్నం అని ఈ సినిమాతో తేల్చేశాడు. ప్రియాంక పాత్ర స్కోప్ తక్కువే ఆమెకు నటించే అవకాశం కూడా తక్కువగానే దొరికింది. ఉన్నంతలో పద్ధతి గల అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఇక హర్షవర్ధన్, మురళీ శర్మ, సాయికుమార్, విష్ణు ఓయ్, అభిరామి వంటి వాళ్ళ పాత్రలకు కూడా స్కోప్ తక్కువే అయినా ఉన్నంతలో వాళ్ళు తమ పాత్రలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.. సూర్య పాత్రలో నాని, దయ పాత్రలో ఎస్జే సూర్యలను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం అన్నంతగా తమదైన మేనరిజంతో బండి నడిపించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా ప్రధానమైన ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా మూడ్ మొత్తాన్ని క్యారీ చేయడంలో సినిమాటోగ్రాఫర్ తనదైన పాత్ర పోషించాడు. ఇక జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. అయితే అవసరం లేని సీన్స్ లో కూడా అదరగొట్టడం కాస్త ఇబ్బందికర అంశం. ఇక అవసరమైన సీన్స్ లో ఎలివేట్ చేశాడు పర్లేదు కానీ అనవసరమైన సీన్స్ లో కొంత రణగొన ధ్వనులను తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. పాటలు పరవాలేదు. యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. క్రిస్పీ గానే ఉన్న ఫస్టాఫ్ విషయంలో ప్రేక్షకులకు కాస్త సాగ తీసిన ఫీలింగ్ కలిగి ఉండేది కాదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం చాలా ఫ్రేమ్ లో కనబడింది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్లీ : ఈ సరిపోదా శనివారం కొత్త కథ కాదు కానీ ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్.