ఇవాళ తెలుగు నుండి పాన్ ఇండియా మూవీ వస్తోందంటే ఫిల్మ్ లవర్స్ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాల కారణంగా ఏర్పడిన నమ్మకం అది. ఇప్పుడు అదే కోవలో మైథలాజికల్ మూవీగా ‘శాకుంతలం’ ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సమంత, గుణశేఖర్, ‘దిల్’ రాజు… కాంబినేషన్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. దానికి తోడు ఈ మూవీని త్రీడీలోనూ విడుదల చేస్తుండటంతో నేచురల్ గా క్రేజ్ ఏర్పడింది. మరి భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్ళిన వారిని ‘శాకుంతలం’ ఏ మేరకు ఆకట్టుకుంటోందో తెలుసు కుందాం.
“కావ్యేషు నాటకం రమ్యం… నాటకేషు శకుంతలా…” అంటారు. కాళిదాసు విరచిత అభిజ్ఞాన శాకుంతలం కథ అందరికీ తెలిసిందే. విశ్వామిత్రుడు, మేనక కుమార్తె అయిన శకుంతల కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతుంది. యుక్త వయసు వచ్చిన శకుంతలను చంద్రవంశానికి చెందిన దుష్యంతుడు ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెను వదిలి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. నిండు గర్భిణి అయిన శకుంతలను కణ్వమహర్షి దుష్యంతుడి దగ్గరకు పంపుతాడు. దుర్వాసుడి శాపం కారణంగా గతం మర్చిపోయిన దుష్యంతుడు శకుంతలను భార్యగా స్వీకరించడానికి నిరాకరిస్తాడు. కశ్యప మహర్షి ఆశ్రమానికి వచ్చిన శకుంతల అక్కడే భరతుడికి జన్మనిస్తుంది. దేవదానవ సంగ్రామంలో దేవతల పక్షాన పోరాడి తిరిగి వస్తున్న దుష్యంతుడికి భరతుడు కనిపిస్తాడు. అదే సమయంలో శాపవిమోచన కారణంగా దుష్యంతుడికి గతం గుర్తొచ్చి భార్యాబిడ్డలను చేరదీస్తాడు. భారతంలోని కథ ఇది కాకపోయినా… కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంలో ఆ యా పాత్రలను అలానే తీర్చిదిద్దాడు. దర్శకుడు గుణశేఖర్ సైతం ఇదే కావ్యాన్ని ఆధారంగా చేసుకుని ‘శాకుంతలం’ను వెండితెరపై ఆవిష్కరించాడు.
నిజానికి శకుంతల కథ సినీ జనాలకు కొత్తదేమీ కాదు. హిందీలో ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు వి. శాంతారాం 1943లో ‘శకుంతల’ రూపొందించి ఘనవిజయం సాధించారు. ఆ తరువాత ఆయనే దుష్యంతునిగా నటిస్తూ 1961లో ‘స్త్రీ’ పేరుతో శకుంతల నాటకాన్ని తెరకెక్కించారు. సంధ్య టైటిల్ రోల్ పోషించిన ఆ సినిమా పరాజయం పాలయింది. ఆ తర్వాత 1966లో ఎన్టీఆర్, బి.సరోజాదేవి జంటగా కమలాకర కామేశ్వరరావు ‘శకుంతల’ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో కుట్టీ పద్మిని భరతుడిగా నటించింది. కానీ ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇప్పుడు మరోసారి గుణశేఖర్… దేవ్ మోహన్, సమంతతో ‘శాకుంతలం’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు.
అందానికి, అమాయకత్వానికి ప్రతీక శకుంతల! అలాంటి యువతికి అనుకోని కష్టం వస్తే… ఆమె చుట్టూ ఉన్నవారంతా తల్లడిల్లి పోతారు. అయితే, ఇందులోని శకుంతల పాత్రధారిణి సమంతలో అందం, అమాయకత్వం మనకు మచ్చుకైనా కనిపించవు. ఇక ఆమెకు జరిగిన అన్యాయం పట్ల ఎలాంటి సానుభూతికి ప్రేక్షకులు లోనుకారు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ కృతకంగా ఉండటమే అందుకు కారణం. ప్రధాన పాత్రధారులైన శకుంతల, దుష్యంతుల ఎంట్రీ సైతం ఆసక్తికరంగా లేదు. సమంతలో మునుపటి ఛార్మ్ మిస్ అయ్యింది. ఈ పురాణ పాత్రకు ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం నప్పలేదు. దుష్యంతుడిగా నటించిన దేవ్ మోహన్ నటన కొంతలో కొంత బెటర్. అతని ఆకారం, ఆహార్యం బాగున్నాయి. దుర్వాసుడిగా మోహన్ బాబు కనిపించేది కొద్దిసేపే అయినా తనదైన శైలిలో మెప్పించారు. ఇతర ప్రధాన పాత్రలను ప్రకాశ్ రాజ్, సచిన్ ఖేడేకర్, గౌతమి, మధుబాల, జిషు సేన్ గుప్తా, అనన్య నాగళ్ళ, అదితి బాలన్ తదితరులు పోషించారు. వీరెవ్వరూ తమదైన ముద్రను ఆయా పాత్రలపై వేయలేకపోయారు. అయితే… చివరి పది నిమిషాలలో భరతుడిగా నటించిన అర్హా (అల్లు అర్జున్ కూతురు) ముద్దుముద్దు మాటలతో ఆకట్టుకుంది. సాంకేతిక నిపుణులలో మణిశర్మ నేపథ్య సంగీతం బాగున్నా… బాణీలు ఏమంత గొప్పగా లేవు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. శేఖర్ వి. జోసఫ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇవాళ తెలుగు సినిమాల్లోని గ్రాఫిక్స్… హాలీవుడ్ మూవీస్ ను తలపిస్తున్నాయి. కారణం ఏమిటో తెలియదు గానీ ఇందులోని వి.ఎఫ్.ఎక్స్. వర్క్ అంతగా ఆకట్టుకునేలా లేదు. సమంత, గుణశేఖర్, దిల్ రాజు కాంబినేషన్ కారణంగా భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్ళిన వారిని.. ‘శాకుంతలం’ ఒకింత నిరాశకు గురిచేస్తుంది. 2డీ కంటే 3డీలో చూసిన వారు మరింతగా డిజప్పాయింట్ అవుతారు.
రేటింగ్ : 2.25 /5
ప్లస్ పాయింట్స్:
పాపులర్ స్టోరీ కావడం
కాంబినేషన్
అల్లు అర్హ నటించడం
మైనెస్ పాయింట్స్:
నిరాశ పరచిన సమంత!
ఆకట్టుకోని వి.ఎఫ్.ఎక్స్.
పేలవమైన కథనం
3Dలో రూపకల్పన
ట్యాగ్ లైన్: అసహజ ‘శాకుంతలం’!