Rudramkota Movie Review: సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహరిస్తూనే ఓ కీలక పాత్రలో నటించిన రుద్రంకోట శ్మశానంలో ప్రేమ కథగా రిలీజ్ కు ముందే ఆసక్తి రేపింది. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రుద్ర, శక్తి, విభీష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? శ్మశానంలో ప్రేమ కథ ప్రేక్షకులను అలరించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
రుద్రంకోట కథ
తెలంగాణలోని రుద్రంకోట అనే ఒక ఊరిలో కోటమ్మ(నటి జయలలిత) ఊరిపెద్ద. ఆమె చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టు ఆ ఊరి ప్రజలు అందరూ భవిస్తూ ఉంటారు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అలా పడితేనే మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటారని ఆమె భావన. అలాంటి ఆ ఊరికి కాపాలాగా రుద్ర(అనిల్) ఉండగా అతని కళ్లుగప్పి ఎవరూ ఊరు దాటలేరు. అలాగే కోటమ్మ తప్ప మిగతా ఏ మహిళను రుద్ర కన్నెత్తి చూడడు, మాట్లాడడు. స్మశానంలోనే ఉంటూ ఊరికి కాపాలా కాస్తుండే శక్తి(విభీష)కి రుద్ర అంటే చచ్చేంత ప్రేమ. మరోపక్క సిటీ నుంచి ఊరికి వచ్చిన కోటమ్మ మనవరాలు ధృతి(అలేఖ్య) కూడా రుద్రపై మనసు పారేసుకుంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగానే ఊరి చివర్లో కొంతమంది యువకులు ఓ దారుణానికి ఒడిగడతారు. రుద్ర ప్రాణంగా ప్రేమించిన శక్తికి ఏం జరిగింది? అమ్మాయిలంటే ఎందుకు రుద్రకు గిట్టదు? శక్తి ప్రేమ సఫలం అయిందా లేదా? రుద్ర తిరస్కారంతో పగ పెంచుకున్న ధృతి చివరకు ఏం చేసింది? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సినిమా టీమ్ ముందు నుంచి చెబుతున్నట్టుగా శ్మశానంలో పెరిగి పెద్దైన ఓ యువకుడి లవ్ స్టోరీనే ఈ రుద్రంకోట. లవ్ అండ్ లస్ట్ తో సాగేలా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ రాము కోన. నిజానికి ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు కానీ హీరో నేపధ్యం, ఆ పాత్రను తీర్చి దిద్దిన తీరు మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. అలాగే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా కొత్తగా ఉంది కానీ.. దాని చుట్టూ అల్లుకున్న కథలో, స్క్రీన్ ప్లేలో తడబాటు కనిపించింది. సాగదీత లేకుండా మొదట్లోనే ముఖ్యమైన పాత్రలు వాటి నేపథ్యాన్ని రివీల్ చేస్తూ వెళ్లిన క్రమంలో కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగగా ఆ ఆసక్తిని చివరి వరకు కొనసాగించలేకపోకపోవడం కొంత మైనస్. సినిమా మొదలై పాత్రల పరిచయం అయ్యాక కాసేపటికే కథనం నెమ్మదిస్తుంది. ఇక రొటీన్ సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగిసినా సెకండాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కోటమ్మ, రుద్ర పాత్రల నేపథ్యాన్ని, ఎమోషనల్ పార్ట్ మీద మరింత వర్కౌట్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే ముందుగా నటీనటుల విషయానికి వస్తే హీరోగా అనీల్‌కు ఇది మొదటి సినిమా అయినా తడబాటు లేకుండా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శ్మశానంలో పెరిగి పెద్దైన మొరటు రుద్ర పాత్రలో సెట్ అయ్యాడు. కోటమ్మ పాత్రకు సీనియర్ నటి జయలలిత సరిగ్గా నప్పారు. శక్తిగా విభీష తెరపై అందంగా కనిపించింది. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న ధృతి పాత్రలో అలేఖ్య టాలెంట్ చూపించింది. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పరిధి మేర ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే కోటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉండాల్సింది. పాటలు పర్వాలేదు. అయితే సినిమాటోగ్రఫీ విషయంలో మాత్రం పల్లెటూరి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటింగ్ టేబుల్ మీద మరింతగా డైరెక్టర్ వర్కౌట్ చేసి ఉండాల్సింది. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ: రుద్రంకోట శ్మశానంలో ప్రేమ కథ.. అందరికీ నచ్చకపోవచ్చు కానీ మంచి పాయింట్ డిస్కస్ చేశారు.