Raja Yogam Movie Review: అదృష్టం, దురదృష్టం మధ్యనే జీవితాలు సాగుతూ ఉంటాయి. కూటికి లేని పేదవాడు కోట్లకు పడగలెత్తవచ్చు. కోట్లలో నానుతూ ఉన్నా, మనశ్శాంతి లేకుండానూ పోవచ్చు. ఇలాంటి కథలతో పలు చిత్రాలు రూపొందాయి. లక్ కిక్కుతో ‘రాజయోగం’ పట్టిన ఓ యువకుని కథే ఇది.
హీరో ఓ మెకానిక్. కానీ, చూడటానికి అందంగా, హుందాగా కనిపిస్తూ ఉంటాడు. దాంతో అతడిని చూసిన వారెవరూ అతను మెకానిక్ అని భావించరు. బాగా డబ్బున్నవాడే అనుకుంటూ ఉంటారు. అలాంటి హీరోను పిలిచి ఓ కారు ఓనర్, కారును ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఇచ్చి రమ్మంటాడు. లాబీలో పార్కు చేసిన హీరో, కారు తాళాన్ని ఇవ్వడానికి ఓ గదికి వెళతాడు. అక్కడ అందమైన అమ్మాయిలు, అబ్బుర పరిచే వైనాలు చూసిన హీరో తబ్బిబ్బయి పోతాడు. కారు ఓనర్ వచ్చే దాకా, నాలుగు రోజులు ఎంజాయ్ చేయవచ్చని ఆశిస్తాడు హీరో. అక్కడ ఓ అందమైన అమ్మాయి తగులుతుంది. ఆమె ఇతనో బిలియనీర్ అని భావించి, అతనికి తన సర్వస్వమూ అర్పిస్తుంది. తరువాత ఒకరికొకరు నిజం తెలుసుకుంటారు. వారి మధ్యలో ఓ ముఠా వస్తుంది. వందల కోట్లు విలువ చేసే వజ్రాలను మార్చేపనిలో ఆ ముఠా ఉంటుంది. ఆ హోటల్ లోనే ఈ కథ సాగుతూ ఉండగా, మరో అమ్మాయి కూడా ఆ వజ్రాల కోసం వెదుకుతూ ఉంటుంది. చివరకు ఆ ముఠాలో ఒకరినొకరు చంపుకుంటారు. వందల కోట్ల విలువైన వజ్రాలు దొరికినా, సింపుల్ లైఫ్ గడపాలన్నదే హీరో అభిలాష. అందుకు అతని ప్రేయసి అంగీకరించదు. తనకు డబ్బే సర్వస్వం అంటుంది. దాంతో ఆమెకు గుడ్ బై చెబుతాడు హీరో. తరువాత ఆ వజ్రాలు దొరికిన అమ్మాయి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. ఆ వజ్రాలు తమ వంశానికి చెందినవేనని, ఊరికి ఉపకారం చేసే తన తండ్రి, బాబాయ్ ని చంపేసి వజ్రాలు అపహరించారని, వారి చావు చూడడం కోసమే తాను వచ్చానని వివరిస్తుంది. తనకు ఈ వజ్రాల కన్నా ఉన్నదానితో సంతృప్తిగా జీవించడం చాలంటుంది. హీరో ఆమెను తనకు అసలైన జోడీ అని భావిస్తాడు.
కొత్తవారితో సినిమా రూపొందించేటప్పుడు తప్పకుండా కొత్తదనం పాలు హెచ్చుగా ఉండేలా చూసుకోవాలి. ‘రాజయోగం’లో అది మిస్ అయిందనే చెప్పాలి. దర్శకుడు రామ్ గణపతి కొన్ని సన్నివేశాలను భలేగా తెరకెక్కించారు. ముఖ్యంగా యువతను లక్ష్యం చేసుకొని హీరో, తనకు పరిచయమైన అమ్మాయితో సాగించిన కిస్సింగ్ సీన్స్ కుర్రకారును ఆకర్షిస్తాయి. హీరో సాయి రోనక్ తన నటనతో పరవాలేదనిపించాడు. నాయికలు అంకిత సాహా, బిస్మి నాస్ అందచందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. చాలా ఏళ్ళ తరువాత రచయిత చింతపల్లి రమణ ఈ సినిమాలో తన మాటలు వినిపించడం విశేషం!
ప్లస్ పాయింట్స్:
– యూత్ కు పట్టే కొన్ని సీన్స్
– చింతపల్లి రమణ రచన
మైనస్ పాయింట్స్:
– కొత్తదనం లేని కథ, కథనం
– ఊహకందే సన్నివేశాలు
– అలరించని సంగీతం
రేటింగ్ : 2.25/5
ట్యాగ్ లైన్: అరాచ(క) యోగం!