Raj Tarun Bhale Unnade Review: గత కొంతకాలంగా అనూహ్యంగా వివాదాల్లో నలుగుతున్నాడు రాజ్ తరుణ్. ఈ వివాదాలు సాగుతుండగానే ఆయన హీరోగా నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో పురుషోత్తముడు సినిమా పరవాలేదు అనిపించుకున్నా తిరగబడరా సామి సినిమా మాత్రం దారుణమైన టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన మరో సినిమా భలే ఉన్నాడే ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమాని గతంలో పలు వెబ్ సిరీస్ లు డైరెక్ట్ చేసిన శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేశాడు. మనీషా కందుకూరు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వీటీ గణేష్, హైపర్ ఆది, రచ్చ రవి, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, అభిరామి, గోపరాజు రమణ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే ప్రేక్షకులలో ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని ప్రమోషనల్ కంటెంట్ మరింత పెంచింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా ? లేదా? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూసేద్దాం.
భలే ఉన్నాడే కథ:
విశాఖపట్నంలో ఒక బ్యాంకు ఉద్యోగిని కొడుకు రాధ (రాజ్ తరుణ్) విశాఖపట్నం మొత్తానికి ఏకైక శారీ డ్రేపర్ కావడంతో నాలుగు చేతులా సంపాదిస్తూ ఉంటాడు. అలాంటి రాధకు తల్లి సహోద్యోగినిగా కృష్ణ(మనీషా) పరిచయమవుతుంది. ఆడవాళ్లు అంటేనే ఆమడ దూరం అన్నట్టుగా ఉండే రాధా ఎందుకో కృష్ణ విషయంలో కనెక్ట్ అవుతాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డాక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక ఊహించని పరిణామం ఎదురవుతుంది. దీంతో వాళ్ళిద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విడిపోయిన రాధాకృష్ణ మళ్ళీ కలిశారా ? అసలు వారిద్దరూ విడిపోవడానికి కారణమైన పరిణామం ఏమిటి? అసలు ఆడవాళ్లు అంటే ఎందుకు రాధ అంత దూరంగా ఉంటాడు? ఎన్నో అవకాశాలు వచ్చినా ఎందుకు అమ్మాయిల విషయంలో ముందడుగు వేయడు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా కథగా చూసుకుంటే కొత్త కథ ఏమీ కాదు అలా అని రొటీన్ సినిమా కూడా కాదు. గతంలో ఎన్నో సినిమాలలో అపార్థాల వల్ల విడిపోయిన ప్రేమ జంటలు చివరికి కలవడంతో శుభం కార్డు పడటం చూసే ఉంటాం. ఈ సినిమా కూడా అలాగే సాగుతుంది కానీ ఎంచుకున్న పాయింట్ తో పాటు స్క్రీన్ ప్లేలో కొంత ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. అసలు ఈ రోజుల్లో రాముడు లాంటి ఒక కుర్రాడు ఉంటే అతన్ని మిగతా అమ్మాయిలందరూ ఎలా చూస్తారు? తప్పుగా టచ్ చేయడం ఇష్టం లేని వ్యక్తిని సమాజం ఎలా చూస్తుంది అనే విషయాలను బల్లగుద్ది చెప్పడం ఆసక్తికరం. ఒకప్పుడు మంచిగా ఉంటే మంచివాడు అనుకునే లోకం ఇప్పుడు మంచిగా ఉంటే చేతగాని వాడు అనుకోవడం అనే పాయింట్ తో ఈ సినిమాని నడిపించాడు డైరెక్టర్. ఫస్టాఫ్ అంతా ఏదో సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఇంటర్వెల్ ముందు కడుపుబ్బ నవ్వించి బయటకు పంపించాడు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కొన్ని క్రింజ్ కామెడీ సీన్స్ పక్కన పెడితే సినిమా ఎమోషనల్ మోడ్ లోకి వెళుతుంది. అసలు తాను తప్పుగా అమ్మాయిలను ఎందుకు చూడను అనే విషయాన్ని రాజ్ తరుణ్ చెప్పే విధానం ఆకట్టుకునేలా ఉంది. అదే సమయంలో ఊహకు తగ్గట్టుగానే ఉంది. దానికి తోడు క్లైమాక్స్ కూడా రొటీన్ గా అందరూ ఊహించదగిందే. అయితే ఇక్కడ కొత్త క్లైమాక్స్ ఊహించడం కూడా మూర్ఖత్వమేలే. మొత్తానికి ఇక్కడ ఈ సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్ బాగుంది. మగాడంటే ఆడదాన్ని సుఖ పెట్టేవాడు మాత్రమే కాదు, ఆడదానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు అనే పాయింట్ లో సినిమాలు తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. అయితే సినిమా అద్భుతం అని చెప్పలేం కానీ చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం. కొన్ని క్రింజ్ సీన్లు పంటి కింద రాయిలా తగిలిన వాటిని పక్కన పెట్టి చూస్తే ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ నుంచి వచ్చిన ఒక మంచి అటెంప్ట్ అని చెప్పవచ్చు. కథ పరంగానే చిన్న చిన్న రొమాన్స్ సీన్స్ ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ కి అవి అడ్డులా అనిపించొచ్చు.
ఇక నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఒక తేడా అని అందరి చేత పిలిపించుకునే పాత్రలో జీవించాడు. అసలు రాజ్ తరుణ్ ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నాడు అనిపించేలా చాలా సీన్స్ లో నటించి తన నటనను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ కొన్ని సీన్స్ లో బాగానే ఉన్నా కొన్ని చోట్ల మాత్రం రాజ్ తరుణ్ పక్కన తేలిపోయింది. ఇక ఆమె విషయానికి వస్తే తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. హీరో పాత్ర తర్వాత అంత బరువైన పాత్ర పడింది అభిరామికే. సింగితం శ్రీనివాసరావు కనిపించింది రెండు మూడు సీన్స్ అయినా సరే మంచి ఇంపాక్ట్ ఉన్న సీన్స్ లో కనిపించారు. ఆమె పాత్ర సినిమా మొత్తానికి హైలైట్. ఇక హైపర్ ఆది రచ్చ రవి శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వాళ్లు కొంతవరకు నవ్వించారు. గోపరాజు రమణ కనిపించింది రెండు మూడు సీన్స్ అయినా సరే తన పాత్రను చక్కగా పండించాడు. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించిన ఇందు కూడా బాగా చేసింది. టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడిగా శివ సాయి వర్ధన్ మంచి మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు. కొంతవరకు సఫలం అయ్యాడు కూడా ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో మాత్రం హ్యాట్సాఫ్ అనాల్సిందే. పెద్దగా లేకుండానే గుండెలను గుచ్చేలా డైలాగ్స్ ఉన్నాయి. ఇక శేఖర్ చంద్ర మ్యూజిక్ కూడా బాగుంది. కొన్ని సాంగ్స్ ఆకట్టుకునేలా ఉండగా రీ రికార్డింగ్ మాత్రం అదిరిపోయింది. ఇక సినిమా మొత్తం ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడ లేదు అనిపించింది. అవసరం మేరకు బాగానే ఖర్చు పెట్టారు. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది.
ఫైనల్లీ భలే ఉన్నాడే.. అనిపించేస్తాడు