Prema Desam Movie Review: త్రిగుణ్ గా పేరు మార్చుకున్న అదిత్ అరుణ్ లేటెస్ట్ మూవీ ‘ప్రేమదేశం’ శుక్రవారం రిలీజైంది. గత యేడాది వర్మ తెరకెక్కించిన ‘కొండా’లో మాజీ నక్సలైట్ కమ్ పొలిటీషియన్ కొండా మురళీ పాత్ర పోషించి మెప్పించిన త్రిగుణ్ ఇందులో లవర్ బోయ్ అవతారమెత్తాడు. ‘ప్రేమదేశం’ అనగానే అబ్బాస్, వినీత్ నటించిన ఇరవై ఏడేళ్ళ నాటి సినిమా గుర్తొస్తుంది. దానికి రెహ్మాన్ స్వరాలు అందిస్తే… ఈ ‘ప్రేమదేశం’కు మణిశర్మ స్వరరచన చేశారు.
అర్జున్ (త్రిగుణ్) తన కాలేజీలో జూనియర్ ఆద్య (మేఘా ఆకాశ్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె తమ ఎదురింటి వాళ్ళ బంధువు అని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆ విషయాన్ని తన తల్లి మధుమతి (మధుబాల)కి చెప్పినప్పుడు ఆమె కూడా ఆనందిస్తుంది. కొడుకు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఆద్యతో పరిచయం పెంచుకుంటుంది. అయితే అర్జున్ తన కొడుకనే విషయం మాత్రం చెప్పదు. వేలంటైన్స్ డేన తన ప్రేమను ఆద్యకు చెబుదామని అనుకున్న అర్జున్ ఆమె కళ్ళముందే ప్రమాదానికి గురౌతాడు. ఈ యాక్సిడెంట్ నుండి అర్జున్ బతికి బయటపడ్డాడా? అర్జున్, ఆద్యను జంటగా చూడాలని అనుకున్న మధుమతి కోరిక తీరిందా? అనేది ఓ అంశం.
ఇక ద్వితీయార్థంలో మరో ప్రేమకథ నడుస్తుంది. మాయ (ప్రీతిశంకర్)ను చూసిన తొలి క్షణంలోనే ప్రేమలో పడతాడు శివ (శివ రామచంద్ర). తల్లి కూడా ఓకే చెప్పడంతో అతని పెళ్ళి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతుంది. బట్… మాయకు ఓ సాడ్ ఎండింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆమె ప్రేమించిన రుషి (అజయ్ కుమార్ కతుర్వార్)తో మరి కొద్దిసేపట్లో పెళ్ళి జరుగుతుందనగా ఆమె కారణంగా అతను కారు యాక్సిడెంట్ లో కన్నుమూస్తాడు. మరి రుషి మరణాన్ని మర్చిపోయి మాయ… శివతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలిగిందా? అక్కడి అర్జున్, ఆద్యకు… ఇక్కడి శివ, మాయకు మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది తెరమీద చూడాల్సిందే!
దర్శకుడు శ్రీకాంత్ సిద్థమ్ ‘ప్రేమదేశం’ పేరుతో ఒకే టిక్కెట్ పై రెండు సినిమాలు చూపించాడు. ఈ రెండు లవ్ స్టోరీస్ కు ఇంటర్ లింక్ గా ఓ కీలకమైన సన్నివేశం ఉన్నా… దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా… రెండు కథలను విడివిడిగా చూపించడంతో ప్రేక్షకులకు ఇదే అభిప్రాయం కలుగుతుంది. మొదటి భాగాన్ని సరదాగా నడిపిన దర్శకుడు శ్రీకాంత్, సెకండ్ హాఫ్ కు వచ్చే సరికీ ఎమోషన్స్ మీద ఆధారపడ్డాడు. అక్కడ నుండి కథ నత్తనడకలా సాగింది. కొంతసేపు గడిచేసరికీ వేరే ఏదో సినిమా చూస్తున్నామా? అనే సందేహమూ ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ రెండు కథలను సమైల్టేనియస్ చూపిస్తూ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే… ఇంకాస్తంత ఆసక్తికరంగా ఉండేది. కానీ సినిమాను ప్లాట్ గా దర్శకుడు నడిపేశాడు. అలానే క్లయిమాక్స్ ను సదాసీదాగా చుట్టేశారు. మధుబాలపై చిత్రీకరించిన లాస్ట్ షాట్ గ్రీన్ మ్యాట్ లో తీసినట్టు అర్థమైపోతోంది. ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.
నటీనటుల విషయానికి వస్తే… త్రిగుణ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. అయినా ఫిజిక్ బాగానే మెయిన్ టైన్ చేస్తున్నాడు. నటిగా మేఘా ఆకాశ్ మరింత పరిణతి చెందాల్సి ఉంది. అజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కోలీవుడ్ నుండి వచ్చిన మాయ కూడా తెరపైన అందంగానే ఉంది. శివ రామచంద్రకు మంచి పాత్ర లభించింది. త్రిగుణ్ స్నేహితుడిగా వైవా హర్ష, శివ స్నేహితుడిగా కమల్ తేజ నార్ల కాస్తంత నవ్వించే ప్రయత్నం చేశారు. మాయ తండ్రిగా భరణి, చెల్లిగా వైష్ణవి చైతన్య నటించారు. ‘రోజా’ ఫేమ్ మధుబాల యాక్టివ్ గానే నటించింది, కానీ ఆమెతో పలికించిన భాష, బాడీ లాంగ్వేజ్ కాస్తంత ఓవర్ గా అనిపించాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు కొన్ని బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ శ్రీకాంత్ సిద్ధమ్, ప్రొడ్యూసర్ శిరీష సిద్ధమ్ కు టెక్నీషియన్స్ నుండి చక్కని సహకారమే లభించింది. సినిమాటోగ్రాఫర్ సాజద్, ఆర్ట్ డైరెక్టర్ రవికుమార్ పనితనం అభినందించదగ్గది. వారిద్దరూ కలిసి ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా, రిచ్ గా కనిపించేలా చేశారు. అయితే… ఈ సాదాసీదా ‘ప్రేమదేశం’ను థియేటర్ లో ఓపికగా చూడటం కాస్తంత కష్టమే. ఓటీటీ లో అయితే బెటర్!!
రేటింగ్: 2.25/5
ప్లస్ పాయింట్స్
ప్రేమకథ కావడం
కలర్ ఫుల్ గా ఉండటం
మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేకపోవడం
ప్లాట్ నెరేషన్
ట్యాగ్ లైన్: ఒకే టిక్కట్ పై రెండు చిత్రాలు!