కోమాలి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై లవ్ టుడే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ప్రదీప్ రంగనాథన్. తమిళనాట జూనియర్ ధనుష్ గా పేరు తెచ్చుకున్న ఆయన లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రదీప్ హీరోగా ఓ మై కడవులే డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ రిలీజ్ చేసింది. టీజర్, ట్రైలర్ కంటెంట్ తో ప్రేక్షకులలో ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కథ:
రాఘవన్(ప్రదీప్ రంగనాధన్) ఇంటర్మీడియట్లో 96%తో పాస్ అవుతాడు. అదే ఊపులో వెళ్లి ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెప్పి రిజెక్ట్ చేస్తుంది. దీంతో బాడ్ బాయ్ అవతారమెత్తిన క్రమంలో ఇంజినీరింగ్ లో ఎవరూ ఊహించని విధంగా 48 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతాడు. కాలేజీలో ప్రేమించిన కీర్తి (అనుపమ పరమేశ్వరన్) ఉద్యోగం లేదని బ్రేకప్ చెప్పేసి వెళ్తుంది. ఆమె మీద పంతంతో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టీ ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఇల్లు, లగ్జరీ కారు కొనుగోలు చేసి సెటిల్ కావడంతో ఓ బిగ్ షాట్ కుమార్తె పల్లవి (కాయాదు)తో పెళ్ళి సెట్ అవుతుంది..మరో ఆరు నెలలలో పెళ్లి, అమెరికా వెళ్లిపోవాలి అనుకుంటున్న సమయంలో రాఘవన్ కాలేజ్ ప్రిన్సిపాల్ రూపంలో ఒక ఊహించని షాక్ తగులుతుంది. అసలు ఆ షాక్ ఏంటి? పల్లవితో రాఘవన్ పెళ్లి జరిగిందా? మళ్ళీ రాఘవన్ లైఫ్ లోకి వచ్చిన కీర్తి ఏం చేసింది? చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
లవ్ టుడే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రతి తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని ఏమాత్రం తగ్గించకుండా మరోసారి ట్రెండీ లవ్ స్టోరీతోనే ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. నిజానికి ఈ సినిమా ప్రారంభంలో కాలేజ్ ఎపిసోడ్స్ మొత్తం ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ తర్వాత పెళ్లి సెట్ అయిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఒక తప్పు చేస్తే లైఫ్ మొత్తం మారిపోతుంది అంటే ఆ తప్పుచేసినా తప్పు కాదు అని నమ్మే ఓ అమ్మాయి కారణంగా ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అనే లైన్ ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. దానికి తోడు ఇప్పటి జనరేషన్ కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలను కథలో మిళితం చేసిన విధానం సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది. నిజానికి సినిమా మొత్తాన్ని ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ప్రతి సీన్ మలిచిన విధానం మాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఇక ప్రేమలో ఫెయిల్ అయిన ఓ కుర్రాడు తన మాజీ ప్రేయసి మీద పంతంతో ఫేక్ చేసి ఎదిగే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితం ఏమైంది? అతని కారణంగా మరో జీవితం నాశనమవుతున్న సమయంలో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా వదులుకొని కష్టాల పాలవడానికి కూడా సిద్ధమవుతాడు. నిజానికి వినడానికి ఆశ్చర్యకరంగా అనిపించే ఈ లైన్ తో ఒక సినిమా చేయాలి అనుకోవడమే ఒక పెద్ద సాహసం. కానీ అలాంటి లైన్ తోనే సినిమా చేసి ప్రేక్షకుల ముందు తీసుకురావడం అభినందనీయం. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో చుట్టూనే కథ తిరుగుతుంది. అతని క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసి అతని కష్టాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఒక రిచ్ లైఫ్ లోకి ఎంటర్ అయినా కూడా అతనికి వచ్చే కష్టాలను చూసి ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవుతాడు. నిజానికి ఎలాంటి కష్టం లేకుండా ఎదిగే ఓ వ్యక్తిని సమాజం చూసే తీరు ఎలా ఉంటుంది? అతను ఫేక్ అని తెలిసాక ఎలా ఉంటుంది? అనే విషయాలను సినిమాలో చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా తప్పు చేసి ఎదగవచ్చు కానీ ఆ తప్పు మరొకరి జాకతాన్ని మార్చే లా ఉంటే అన్నీ వదులుకోవడానికి సిద్ధం అయిన క్రమం తప్పక ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీసాయి? అనే లాంటి విషయాలను ప్రేక్షకులు ఎంగేజ్ చేసేలా తీసుకురావడంలో టీం సక్సెస్ అయింది. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగినా సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ రాసుకున్న తీరు అభినందనీయం.
నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనకు బాగా అచ్చొచ్చిన పాత్రలో ఒదిగిపోయాడు. రాఘవన్ అనే ఒక పాత్రలో అసలు ప్రదీప్ తప్ప ఇంకెవరూ నటించరేమో అనేలా రెచ్చిపోయినటించాడు. ఇక అనుపమ, ఖయాదు లోహార్ వంటి వారు తమ పాత్రలలో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా మిష్కిన్, కేఎస్ రవికుమార్, గౌతమ్ మీనన్, నెపోలియన్ వంటి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఈ సినిమాకి సంగీతం అందించిన లియోన్ జేమ్స్ పాటలు తెలుగులో అంతా వినసొంపుగా లేకపోయినా నేపథ్య సంగీతం మాత్రం సినిమాని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ సినిమాని చాలా కలర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయింది. నిడివి విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
ఫైనల్లీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ విత్ మెసేజ్.