యాంకర్ ప్రదీప్ హీరోగా, దీపిక పిల్లి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”. జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్, భరత్ తమ ఫస్ట్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేశారు. యాంకర్ ప్రదీప్, ఆయన స్నేహితులందరూ కలిసి ఈ సినిమాను నిర్మించారు. టెలివిజన్‌లో యాంకర్ ప్రదీప్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు, రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం, పదండి.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథ:
కృష్ణ (యాంకర్ ప్రదీప్) హైదరాబాద్‌లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఆంధ్ర-తమిళనాడు బోర్డర్‌లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి దక్కడంతో, తన డ్రైవర్(సత్య)తో కలిసి ప్రదీప్ ఆ ఊరికి బయలుదేరతాడు. అయితే, ఆ ఊరిలో 60 మంది కుర్రాళ్లకు గానూ ఏకైక అమ్మాయి రాజా(దీపిక) ఉంటుంది. ఆమెను ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావించే ఊరి వాళ్లు, ఆమె ఆ 60 మంది కుర్రాళ్లలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలని, ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్‌గా చేయాలని ఫిక్స్ అవుతారు. అయితే, అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాకుండా, మొదటి కలయికలోనే ముద్దు పెడతాడు. నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తరువాత ఏమైంది? కృష్ణ, రాజా ఒక్కటయ్యారా? కాలేదా? వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అనే విషయాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
ప్రదీప్ హీరోగా, దీపిక పిల్లి హీరోయిన్‌గా ఈ సినిమా వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై జబర్దస్త్ ఫ్యాన్స్‌లో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, జబర్దస్త్ ఆర్టిస్టులు డైరెక్ట్ చేయడం, “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడంతో, ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక, ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్ మోడ్‌లోనే సాగుతుంది. తమిళనాడు సరిహద్దులోని ఒక ఆంధ్ర గ్రామంలో పుట్టిన ఏకైక అమ్మాయి రాజాను ఆ ఊరి యువకులందరూ అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు. 60 మందిలో ఒకరిని ఆమె వివాహం చేసుకుంటే, ఆ ఒక్కరికి ఊరికి ప్రెసిడెంట్ పదవిని వారసత్వంగా కట్టబెట్టి, ఊరిని జాగ్రత్తగా చూసుకునేలా ఆ ఊరి పెద్ద ప్లాన్ చేస్తాడు. అయితే, అనుకోకుండా ఆ ఊరికి సివిల్ ఇంజనీర్‌గా వచ్చిన ప్రదీప్ ఆ ఊరి అమ్మాయితో ప్రేమలో పడడంతో అసలు కథ మొదలవుతుంది. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, ఒక ఆసక్తికరమైన ఇంటర్వెల్‌తో ఫస్ట్ హాఫ్ ముగించారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఆకట్టుకునేలా రాసుకున్నారు. చాలా చోట్ల సత్య-ప్రదీప్ ట్రాక్‌తో పాటు సత్య, గెటప్ శ్రీను ట్రాక్‌లు బాగా పేలాయి.
అయితే, ఫస్ట్ హాఫ్ ఎంత ఆసక్తికరంగా సాగిందో, సెకండ్ హాఫ్ మాత్రం అంత ఆసక్తికరంగా మలచడంలో దర్శక ద్వయం తడబడింది. ఎందుకంటే, ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా ఆర్గానిక్‌గా వస్తే, సెకండ్ హాఫ్‌లో కామెడీ మాత్రం కాస్త ఫోర్స్డ్‌గా అనిపిస్తుంది. అలాగే, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అయినా లాజికల్‌గా అనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా లాజిక్‌లను మరిచిపోయి తెరకెక్కించిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి, ఇలాంటి కథతో గతంలో సినిమాలు వచ్చాయా అంటే లేదు. కానీ, సిమిలర్ లైన్‌తో మాత్రం సినిమాలు వచ్చాయి. హీరో-హీరోయిన్‌ల పెళ్లి కావాలంటే, హీరోయిన్ చెల్లెలు లేదా హీరో చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేస్తే, ఆ తర్వాత వివాహాలు జరిగేలా గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇక్కడ అలాంటి ఒక పాయింట్‌ను ప్రధానంగా తీసుకున్నారు. అయితే, ఆ పాయింట్ తీసుకున్నప్పటి నుంచి కథలో పట్టు తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. చివరికి క్లైమాక్స్ కూడా లాజిక్‌లెస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీంతో, అది పూర్తి స్థాయిలో వర్కవుట్ అయిందా అనేది చెప్పలేని పరిస్థితి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, ప్రదీప్ కృష్ణ అనే పాత్రలో ఆకట్టుకున్నాడు. “పక్కవాడు ఎలా పోతే నాకేం” అనుకునే ఒక టిపికల్ మైండ్‌సెట్ ఉన్న కుర్రాడిగా ఇమిడిపోయాడు. రాజా అనే పాత్రలో దీపిక కూడా అలాగే సెట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ కూడా స్క్రీన్ మీద బాగుంది. ఇక సత్యతో పాటు గెటప్ శ్రీను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వీరిద్దరి ట్రాక్ ఆసక్తికరంగా సాగడం సినిమాకి బాగా ప్లస్ అయింది. మురళీధర్ గౌడ్, రోహిణి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, రథన్ అందించిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. లొకేషన్స్ ఎక్కడ ప్లాన్ చేశారో తెలియదు, కానీ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టు బాగున్నాయి. నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా, లాజిక్స్ పక్కన పెట్టేసి చూస్తే, “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” ఒక ఫన్ ఎంటర్‌టైనర్.