NTV Telugu Site icon

Mangalavaram Movie Review: మంగళవారం మూవీ రివ్యూ

Mangalavaram

Mangalavaram

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అజయ్ భూపతి

ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి మహాసముద్రం డిజాస్టర్ తర్వాత మంగళవారం అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం ఆ సినిమా టైటిల్ పోస్టర్ మొదలు టీజర్, ట్రైలర్ పాటలన్నీ సినిమా మీద ఆసక్తి పెంచేయడమే. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరిని ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో శైలు అనే పాత్రలో నటిస్తున్నట్లుగా ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా కోసం కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ పనిచేయడం అలాగే అనేకమంది సీనియర్ టెక్నీషియన్లు ఈ సినిమాలో భాగమవడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.. సినిమాని నవంబర్ 17వ తేదీన రిలీజ్ చేస్తున్నా సరే ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

మంగళవారం కథ ఏమిటంటే
రాజమండ్రి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరిలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గోడమీద కొన్ని రాతలు ప్రత్యక్షమవుతాయి. ఆ గోడ మీద రాసిన పేర్లలో ఉన్న వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోతారు. ఆ తర్వాత సరిగ్గా వారానికి మళ్ళీ మంగళవారం నాడే మరో ఇద్దరు అలాగే శవాలుగా తేలుతారు. ఆ ఊరి గ్రామ దేవతగా భావించే మహాలక్ష్మమ్మకు ఇష్టమైన మంగళవారం నాడే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు చనిపోతూ ఉండడంతో ఆ ఊరి జమీందారు (చైతన్య కృష్ణ) సలహా మేరకు కుర్రాళ్ళందరూ రాత్రి వంతులు వేసుకొని మంగళవారం నాడు మళ్ళీ అలాంటిదేమీ జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరి ఆర్ఎంపీ డాక్టర్ విశ్వనాథం (రవీంద్ర విజయ్) కొన్నాళ్ల క్రితం చనిపోయిన శైలు(పాయల్ రాజ్ పుత్) అనే అమ్మాయి దయ్యంగా మారి ఈ హత్యలు చేస్తుందని ఊర్లో చెప్పడంతో వారంతా వణికి పోతారు. అయితే ఈ హత్యలను ఇంట్రాగెట్ చేయడానికి ఆ ఊరికి వచ్చిన ఎస్ఐ(నందితా శ్వేత) ఊరందరూ వాటిని ఆత్మహత్యలను భావిస్తుంటే కాదు హత్యలు అని చెబుతుంది. అయితే అసలు నిజంగా ఆ ఊరిలో జరుగుతున్నవి ఆత్మహత్యలా? హత్యలా? అసలు గోడల మీద వారి పేర్లు రాస్తున్నది ఎవరు? అమ్మానాన్న లేక అమ్మమ్మ పెంపకంలో పెరిగిన శైలు అసలు ఎందుకు చనిపోయింది? ఊర్లో ఎవరికీ కనబడని శైలు దెయ్యం ఆర్ఎంపీ డాక్టర్ కు మాత్రమే ఎందుకు కనిపించింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా ద్వారా ఇండియన్ సినీ హిస్టరీ లోనే టచ్ చేయని ఒక పాయింట్ను టచ్ చేస్తున్నామని అజయ్ భూపతి అండ్ టీం పెద్ద ఎత్తున చెబుతూ వచ్చింది. అసలు ఇంతలా ఎవరు టచ్ చేయని పాయింట్ ఏముంటుంది అని బుర్రలు బద్దలు కొట్టుకున్న ఎవరికీ ఏమీ అర్థం కాలేదు కానీ సినిమా చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది. సినిమా మొదటి భాగం అంతా పాత్రల పరిచయం చేయడం కోసమే తీసుకున్నాడు అజయ్ భూపతి. అయితే కథనం చాలా నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. మొదటి భాగం అంతా శైలు, రవి స్నేహం ఆ తర్వాత రవి మరణం, కట్ చేస్తే ఊరిలో వరుస మరణాలు అంటూ ఒక్కసారిగా ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు.. అజయ్ భూపతి కథనం విషయంలో కాస్త వేగం పెంచి ఉండొచ్చు. అయితే ట్విస్టులను ఏమాత్రం ఊహించకుందా రాసుకోవడం, చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి సీన్స్ మాత్రం ఒక రేంజ్ లో తెరకెక్కించాడు. మనం నిజంగానే ఆ ఊరిలో ఉన్నామేమో మన కళ్ళ ముందుకు ఏదో పరిగెత్తుకుని వస్తుందేమో అని భయపెట్టేలా తెరకెక్కించడంలో సఫలం అయ్యాడు. శైలు ఎంట్రీతో సినిమా మొదలుపెట్టిన అజయ్ భూపతి ఇంటర్వెల్ కి వచ్చేసరికి అదే శైలు పెద్దయి కాలేజీకి వెళుతున్నట్లు చూపించాడు. అక్కడి నుంచి ఆమె కాలేజీకి వెళ్లడం, ఒకరితో ప్రేమలో పడటం, ఆ తర్వాత అతని చేతిలో మోసపోవడం ఎవరూ ఊహించని ఒక రకమైన జబ్బుకి గురి కావడం లాంటి విషయాలన్నీ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. అయితే ఎందుకో ఇవన్నీ కొంత రియాలిటీకి దగ్గరగా అనిపించవు. కానీ పాయల్ పాత్రతో చెప్పించిన పాయింట్ నిజంగానే ఎక్కడా డిస్కస్ చేయని పాయింట్. ఊర్లలో అక్రమ సంబంధాలు గురించి పుకార్లు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటాయి కానీ వాటినే ఆధారంగా చేసుకుని ఇలా సినిమా కూడా తీయవచ్చు అని అజయ్ భూపతి నిరూపించాడు. సెకండ్ హాఫ్ అంతా శైలు చనిపోవడం ఆమె దయ్యంగా మారినట్లు ప్రచారం జరగడం వంటి విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఊరి ప్రజలందరూ కలిసి కొట్టుకునే సీన్, నైట్ ఎఫెక్ట్ లో చేసిన కొన్ని చేజింగ్ సీక్వెన్స్ లు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తాయి. అయితే అసలు ఆ ఊరి జనాల ఫైట్ అక్కర్లేదు కానీ టెక్నికల్ బ్రిలియన్స్ కోసమే పెట్టినట్టు ఉంది. నిజానికి ఈ సినిమా అంతా 1986- 1996 మధ్య జరుగుతున్నట్లు చూపించారు కానీ ఎందుకో కొన్ని సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా అనిపించలేదు. సినిమాటిక్ లిబర్టీ గట్టిగా వాడినట్లు అనిపించింది. అయితే చివరిలో ఇచ్చిన మెసేజ్ మాత్రం అభినందనీయం. ఇలాంటి సబ్జెక్ట్స్ చెప్పాలంటే ఎలాంటి బెరుకు లేకుండా అజయ్ భూపతి మాత్రమే చెప్పగలడు. ఏదైతేనేం లాజిక్స్ అన్ని పక్కన పెట్టి చూస్తే ఈ సినిమా ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని పాయల్ తన భుజస్కంధాల మీద నడిపించినట్లు అనిపించింది. లేడీ ఓరియంటెడ్ సినిమా అని ముందు నుంచే చెబుతున్నారు కానీ ఆమె నటించిన పాత్రలో వేరే నటిని ఊహించుకోవడం కూడా కష్టమే అన్నంతగా రెచ్చిపోయిన నటించింది. ఒక రకమైన రుగ్మతతో బాధపడే అమ్మాయిగా ఒకపక్క శృంగారాన్ని అనుభవిస్తూనే మరోపక్క ఆ శృంగారంలో పాల్గొన్నందుకు బాధను అనుభవించే పాత్రలో ఆమె జీవించింది.. ఇక ఆమె తర్వాత నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్ లకు. ముఖ్యంగా అజయ్ ఘోష్ క్యారెక్టర్ చాలా సరదాగా సాగిపోతూనే సినిమాకు ప్రధానమైన కామెడీ వనరుగా మారింది. ఇక శ్రీ తేజ, శ్రవణ్ రెడ్డి, మీసాల లక్ష్మణ్ వంటి వారందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ప్రియదర్శి నటించాడనే విషయాన్ని ఇప్పటి వరకు దాచి ఉంచి సినిమాలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా ఉంచారు. ప్రియదర్శి కనిపించింది చాలా తక్కువ సేపు అయినా నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఆయన కన్నా మంచి క్రేజ్ ఉన్న హీరోతో చేయిస్తే సినిమాకి బాగా బూస్ట్ అయ్యేది. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ముఖ్యంగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అజయ్ భూపతి విషయంలో మాత్రం ఎలాంటి వంకలు పెట్టలేని విధంగా సినిమాను ఒక రేంజ్ లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కథనం విషయంలో కాస్త పరుగులు పెట్టించి ఉంటే ఇంకా బావుండేది అనిపిస్తుంది. ఇక సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది సినిమాటోగ్రఫీ, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్.. ఎందుకో పాటలు అంత క్యాచీగా అనిపించకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం భయపెట్టే విధంగా ఒక రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ కూడా చాలా కొత్తగా అనిపించింది. డైలాగ్స్ కనెక్ట్ అయ్యేలా, గుచ్చుకునేలా రాశారు తాజుద్దీన్, రాఘవ్ పసుపుల. నిర్మాతలకు ఇది మొదటి సినిమా అనిపించదు ఎందుకంటే నిర్మాణ విలువలు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.

ఫైనల్లీ:
మంగళవారం అవుట్ అండ్ అవుట్ ఎంగేజింగ్ థ్రిల్లర్. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది.

Show comments