Operation Raavan Review: పలాస, నరకాసుర వంటి సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ రావణ్. రక్షిత్ తండ్రి వెంకట సత్య ఈ మూవీలో దర్శకుడిగా పరిచయం కాగా సోదరుడు ధ్యాన్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యాడు. విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా ప్రమోషన్స్ కూడా గట్టిగా భిన్నంగా చేయడంతో ‘ఆపరేషన్ రావణ్’పై ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల మధ్య నేడు(జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
రామ్(రక్షిత్ అట్లూరి) టీవీ 45 అనే న్యూస్ ఛానెల్ చైర్మెన్ కొడుకు. అయితే ఆ విషయం బయట పెట్టకుండా అదే ఛానెల్‌లో ఎంప్లాయ్‌గా జాయిన్ అయి కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తున్నారు? ఛానెల్‌లో అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే అదే ఛానల్ లో పని చేసే ఆమని(సంగీర్తన) అనే జర్నలిస్ట్ తో ప్రేమలో పడుతాడు. అయితే ఆమని ఓ మంత్రి(రఘు) అవినీతిని బయట పెట్టాలని స్టింగ్ ఆపరేషన్ చేసి షాకింగ్ విషయాలను కనిపెట్టి ఛానెల్‌లో టెలికాస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆ కేసుని పక్కన పెట్టేసి ఒక సీరియల్ కిల్లర్ కేసుని ఫాలో అవ్వమని అంటాడు సీఈఓ(మూర్తి)అప్పగిస్తాడు. ఆమెతో పాటు రామ్‌ని కూడా అదే కేసు ఫాలో అవ్వమని అంటారు. ఈ క్రమంలో సుజాత(రాధికా శరత్ కుమార్) కూతురికి త్వరలోనే పెళ్లనగా కిడ్నాప్ అవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలోనే ఆమని కూడా కిడ్నాప్ అవుతుంది. మరి ఆమెని కిడ్నాప్ చేసింది ఎవరు? సీరియల్ కిల్లర్ ఎవరు? మాస్క్ వెనుక మర్మం ఏమిటి? చివరికి ఆమని దొరుకుతుందా? అసలు సీరియల్ కిల్లర్ పగకు కారణం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్న జానర్ ఏదైనా ఉందంటే అది హారర్ అని చెప్పొచ్చు అలాగే ఆ తర్వాత థ్రిల్లర్ టైప్ ఆఫ్ సినిమాలకు కూడా ఎక్కువగానే కనెక్ట్ అవుతున్నారు ఈ నేపథ్యంలో అలాంటి సినిమాలు చేయడానికి మన దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. . ఇప్పుడు అదే కోవాలో సైకో సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకట సత్య. మొదటి సినిమానే ఇలాంటి కథనం ఎంచుకున్న ఆయన థియేటర్లో కూర్చున్న ఆడియెన్స్ ని రెండున్నర గంటల పాటు ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసాడు. ఈ సినిమా ఓ వ్యక్తి సైకో కిల్లర్‌గా, సీరియల్ కిల్లర్‌గా ఎలా మారతాడనే పాయింట్ లో రాసుకున్నాడు. సైకో కిల్లర్‌గా ఎలా మారాడు? ఎందుకు మారాడనే అంశాల చుట్టూ కథని తిప్పుతూ, ఆ వ్యక్తిలో జరిగే సంఘర్షణ అని కూడా దృశ్య రూపకంతో చూపిస్తూ ఆసక్తికరంగా సినిమా కథను నడిపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలు కేవలం కిల్లర్‌ని కనిపెట్టేందుకు జరిగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంటుంది కానీ ఈ సినిమాలో మాత్రం అందుకు భిన్నంగా అనేక అంశాలను స్పృశించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అందు వలెనే కథ కొంత ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరోహీరోయిన్ల మధ్య లవ్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోనే సైకో కిల్లర్ కథలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మొదటి భాగం స్లో అనే ఫీల్ వస్తుంది. హంతకుడు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం మొదలయ్యాక వచ్చే సన్నివేశాలు ఉత్కంఠకి గురి చేస్తుంటాయి. అయితే సినిమా కథ, కథనంలో చాలా చోట్ల లాజిక్‌లను వదిలేశారు అనుకోవాలో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనుకోవాలో చెప్పలేం. దర్శకుడికి మొదటి సినిమా అనే విషయం కొన్ని సీన్స్ లో ఇట్టే అర్థమయిపోయేలా ఉంటుంది. మీ ఆలోచనలే మీ శత్రువులు అనే పాయింట్ ని కరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు కానీ దాని తాలూకా సంఘర్షణను బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలో తడబడిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే రామ్ పాత్రలో రక్షిత్ అట్లూరి ఆకట్టుకున్నా, డైలాగ్ డెలివరీ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. . యాక్షన్ సీన్స్ లో అయితే రక్షిత్ అదరగొట్టాడు. ఆమని పాత్రలో సంగీర్తన విపిన్ తనదైన నటనతో మెప్పిస్తూ అందం, అభినయంతో ఆకట్టుకుంది. సైకో కిల్లర్‌గా నటించిన వ్యక్తి ఎవరో కానీ క్లైమాక్స్ లో ఆట్ కమల్ హాసన్ అనిపించాడు. రాధికా శరత్ కుమార్ పాత్ర పరిమితమే అయినా ఒక సీన్ లో మాత్రం ఆమె తన సీనియారిటీని నిరూపించుకుంది. ఇక చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ తమ పాత్రలతో పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే సినిమా కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉంది. కొన్ని ఫ్రేములు భలే ఉన్నాయి రా అనిపించాయి. మ్యూజిక్ ఫర్వాలేదనిపించేలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ పరంగా ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. దర్శకుడికి మొదటి సినిమాని అయినా కొన్నిచోట్ల కొన్ని లోపాలను పక్కన పెడితే సస్పెన్స్ అంశాలను, థ్రిల్లర్ ఎలిమెంట్లని, ఎమోషన్స్ ని తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌లీ: ఆపరేషన్ రావణ్- కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్.. ఆ జానర్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చొచ్చు