మలయాళంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన ‘జయ జయ జయ జయ హే’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, అప్పటికే ఆ సినిమాని అందరూ డబ్బింగ్ లో లేదా తెలుగు వర్షన్ లో చూసేశారు. అయితే తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్ గా ఈ సినిమాని ’35 చిన్న కథ కాదు’ నిర్మాత సృజన్ తన స్నేహితులతో కలిసి నిర్మించారు. నిజానికి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఒరిజినల్ కంటెంట్ లానే అనిపించింది, దీంతో ప్రేక్షకులకు ఈ సినిమా మీద కూడా ఆసక్తి ఏర్పడింది. మరి సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన శాంతి (ఈషా రెబ్బా), చిన్నప్పటి నుంచి స్త్రీ వివక్ష ఎదుర్కొంటూనే ఉంటుంది. అన్నయ్యకు ఒకలాంటి రూల్స్, చెల్లెలికి ఒకలాంటి రూల్స్ అంటూ ఆమెను అన్నింటికీ పరిమితం చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ చదవాలనుకున్న ఆమెను, అదే ఊరిలో డిగ్రీ చదివేలా చేస్తారు. డిగ్రీలో ఆమె తన లెక్చరర్ తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్ళి చేసేయాలని భావించి, చేపల చెరువుల బిజినెస్ చేసే అంబటి ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) తో సంబంధం ఫిక్స్ చేస్తారు. పెళ్లి కూడా అయిపోతుంది.
అయితే అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో, తన అసలు స్వరూపం బయటపెడతాడు ఓంకార్ నాయుడు. చిన్న చిన్న విషయాలకు కూడా చేయి చేసుకుంటూ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శాంతి ఒకరోజు అనుకోని షాక్ ఇస్తుంది. ఓంకార్ నాయుడుకి శాంతి ఇచ్చిన షాక్ ఏంటి? అనునిత్యం వేధిస్తున్న ఓంకార్ నాయుడు తన తప్పు తెలుసుకున్నాడా లేదా? విడాకుల వరకు వెళ్లిన వీరి వ్యవహారం చివరికి ఏమైంది? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
తెలుగువారికి రీమేక్ సినిమాలు పెద్దగా కొత్త ఏమీ కాదు. కాకపోతే ఒకప్పుడు ఇతర భాషలలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలను స్టార్ హీరోలతో రీమేక్ చేసి రిలీజ్ చేసేవాళ్లు, లాభాలు ఆర్జించేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటే ఓటీటీలో వచ్చేటప్పుడు దాదాపుగా ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు. ‘జయ జయ జయ జయ హే’ సినిమా పరిస్థితి కూడా అంతే. నిజానికి ఈ సినిమాని తెలుగు సినీ లవర్స్ అందరూ ఇప్పటికే చూసేశారు. అలాంటి సినిమాను రీమేక్ చేయాలి అనే ఆలోచన కాస్త సాహసవంతమైనది.
అయితే తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. కానీ కథ మాత్రం దాదాపుగా ఒరిజినల్ లోని మార్పులేమీ లేకుండానే పూర్తి చేసుకున్నారు. కేవలం తెలుగు నేటివిటీ మార్పులు మాత్రమే ఉన్నాయి. అయితే క్లైమాక్స్ లో వచ్చే చిన్న అంశాన్ని కూడా మార్చుకున్నారు, అంతకుమించి ఒరిజినల్ కి దీనికి ఏమాత్రం తేడా లేదు.
నిజానికి ఒరిజినల్ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ మాత్రం ఈ సినిమా చూసినప్పుడు కలగదు. దానికి ప్రధాన కారణం హీరోయిన్ ఎంపిక. ఒరిజినల్ లో దర్శన బాధపడుతున్నప్పుడు ప్రేక్షకుల్లో ఒక సింపతీ కలుగుతుంది. “అయ్యో ఇలాంటి అమాయకురాలిని ఇంత వేధిస్తున్నారేంటి” అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈషా రెబ్బను చూస్తే ఆ ఫీలింగ్ కలగదు. ఎందుకంటే ఆమె కాస్త రెబల్ క్యారెక్టర్ లాగానే ముందు నుంచి అనిపిస్తుంది. కాబట్టి, ఇదేదో ఇద్దరు సమఉజ్జీల మధ్య ఫైట్ అనే ఫీలింగ్ కలుగుతుంది తప్ప, ఆమె పాపం బాధపడుతుందనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగదు. ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ పురుష సమానత్వం అనే అంశాన్ని ఫన్నీవేలో చెప్పే ప్రయత్నం చేసి కొంత వరకు నవ్వులు పంచారు. అయితే మాతృకకు దీనికి తేడాలు అయితే పెద్దగా కనిపించలేదు.
నటీనటులు & సాంకేతిక నిపుణులు:
నటీనటుల విషయానికి వస్తే, ఓంకార్ నాయుడు అనే పాత్రలో తరుణ్ భాస్కర్ పరకాయ ప్రవేశం చేశాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన అతను, ఈ సినిమాలో మాత్రం ఇరగదీశాడు. ముఖ్యంగా చిన్నచిన్న ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను నవ్వించిన తీరు ఆకట్టుకుంది. ఈషా రెబ్బా నటన కూడా బాగుంది, పాత్రకు తగినట్లుగా సరిపోయింది. కానీ, ఆమె ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఆప్షన్ అని మాత్రం అనిపించలేదు. ఇక మిగిలిన పాత్రలలో నటించిన వారందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే, తెలుగు డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని ఆలోచింపజేసేలా, కొన్ని నవ్వించేలా రాసుకోవడంలో సక్సెస్ అయ్యారు. సంగీతం బాగుంది, పాటలు ఒకటి రెండు గుర్తుంచుకునేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిడివి క్రిస్పీగా ఉంది.
ఫైనల్లీ: ఈ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఒరిజినల్ చూడని వారికి నచ్చొచ్చు.