NTV Telugu Site icon

Om Bheem Bush Review: ఓం భీమ్ బుష్ రివ్యూ

Om Bheem Bush Review

Om Bheem Bush Review

Om Bheem Bush Review in Telugu: యంగ్ హీరో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి గతంలో బ్రోచేవారెవరురా అనే సినిమాలో నటించారు. ఇప్పుడు ఇదే కాంబో రిపీట్ చేస్తూ ఓం భీమ్ బుష్ అనే సినిమా తెరకెక్కింది. సినిమా దాదాపు పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కు వచ్చేవరకు మీడియాలో ఎలాంటి హడావుడి చేయకుండా సినిమా యూనిట్ జాగ్రత్త పడింది. అలా రెండు నెలల క్రితం ప్రేక్షకుల దృష్టికి వచ్చిన ఈ ఓం భీమ్ బుష్ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎలా అయినా చూడాలి రా అని యూత్ అందరూ ఫిక్స్ అయ్యేలా ప్రమోషనల్ కంటెంట్ ఉంది. హుషారు లాంటి యూత్ ఫుల్ సబ్జెక్టు డైరెక్ట్ చేసిన శ్రీహర్ష కానుగంటి డైరెక్ట్ చేయడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే మీడియా కోసం ఒకరోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ వేసింది సినిమా యూనిట్. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం

ఓం భీమ్ బుష్ కథ:
తమ చదువులకు ఎక్కడ ఉద్యోగాలు దొరకవు అని ఫిక్స్ అయిన కృష్ణకాంత్ దుగ్గిరాల (శ్రీ విష్ణు), మాధవ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి) ముగ్గురూ కలిసి ఒక యూనివర్సిటీలో పీహెచ్డీ చేయడానికి జాయిన్ అవుతారు. వారి వల్ల మనశ్శాంతి లేకుండా పోవడంతో వాళ్ళు ఏమీ కష్టపడకుండానే డాక్టరేట్ పట్టాలు ఇచ్చి పంపించేస్తాడు ఆ కాలేజ్ డీన్ రంజిత్ వినుకొండ (కృష్ణ కాంత్ అయ్యంగార్). ఇక ఎలాగోలా బయట ప్రపంచంలో బతకాలని భావించి వారిలో వినయ్ ఊరికి ముగ్గురు బయలుదేరుతారు. అయితే డీజిల్ అయిపోవడంతో మధ్యదారిలో భైరవ పురం అనే ఊరిలో ఆగాల్సి వస్తుంది. అక్కడ ఒక మంత్రగాడు చిన్న చిన్న పనులకే దండిగా డబ్బు సంపాదించడం చూసి తమ తెలివితేటలతో అదే ఊరిలో ఉండి అతని కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటారు. అలా అదే ఊర్లో బ్యాంగ్ బ్రోస్ ఏ టు జెడ్ సొల్యూషన్స్ పేరుతో ఒక టెంట్ ఏర్పాటు చేసి అక్కడే స్థిరపడతారు. ఆ ఊరిలో ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చినా తమ తింగరి పనులతో వాటిని క్లియర్ చేస్తూ ఆ ఊరి మొత్తానికి దేవుళ్ళుగా మారిపోతారు. వీరి వల్ల తన వ్యాపారం దెబ్బతిందని భావించిన మంత్రగాడు వీరందరినీ పంచాయతీలో నిలబెడతాడు. వీళ్ళందరూ మోసాలు చేస్తూ ఊరి ప్రజలను ఏం మారుస్తున్నారని నిజంగా తన మంత్ర విద్యలకంటే సైన్స్ గొప్పది అని భావిస్తే ఊరు మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న సంపంగి మహల్ సంపంగి దెయ్యాన్ని మాయ చేసి అక్కడ ఉన్న నిధి ఊరికి చెందేలా చేయాలని చాలెంజ్ విసురుతాడు. సంపంగి అంటేనే ఆ ఊరు మొత్తం హడలిపోతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు ఆ ఛాలెంజ్ స్వీకరిస్తారా? స్వీకరించిన తర్వాత సంపంగితో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అసలు సంపంగి మహల్ కథ ఏమిటి? ఎందుకు సంపంగి ఆ ఊరి వారందరినీ ఇబ్బంది పెడుతోంది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే ట్యాగ్ లైన్ నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే దాన్ని కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండు కార్డు పడే వరకు ఇదే ట్యాగ్ లైన్ ని గుడ్డిగా ఫాలో అయిపోయినట్లు అనిపించింది. కథ మీద కథనం మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా ప్రేక్షకులను నవ్వించడం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆ విషయంలో పూర్తిగా సఫలమయ్యారు. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇలా ముగ్గురికి ముగ్గురు కామెడీతో ఒక ఆట ఆడుకోగల టాలెంట్ ఉన్నవారే. వారి కోసమే ఈ క్యారెక్టర్లు రాశారు అన్నట్టు తమ తమ క్యారెక్టర్లలో చెలరేగిపోయి సినిమా మొత్తాన్ని ముగ్గురు భుజస్కందాల మీద నడిపించారు. సినిమా మొదలైన తర్వాత ఈ ముగ్గురు కాలేజీలో చేసే హడావిడి ఆ తర్వాత ఊరిలో ఎంటర్ అయ్యే వరకు జరిగే పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. ఊరిలో ఎంటర్ అయిన తర్వాత ముగ్గురిలో ఇద్దరికీ లవ్ ట్రాక్స్ ఏర్పడడం, ఊరందరి సమస్యలు తీరుస్తూ ఊరి మొత్తానికి దేవుళ్ళుగా మారిపోవడం మరింత ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది. సినిమాలో ఈ సీన్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఆ సీన్ ఇక్కడ రాకుండా ఉండాల్సింది కదా? లాంటి లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది. నిజానికి కొన్ని చోట్ల చాలా జాగ్రత్తగా వింటే తప్ప జోక్స్ అర్థం కావు, మీరు శ్రీ విష్ణు గత చిత్రం సామజ వర గమన గమనిస్తే శ్రీ విష్ణు పలికే డైలాగ్స్ చాలా జాగ్రత్తగా వింటే తప్ప అక్కడ జోక్ అర్థం అయి మనం నవ్వుకోలేము. ఈ సినిమాలో కూడా కొన్ని డైలాగ్స్ తో అలాంటి కామెడీ పుట్టించే ప్రయత్నం చేశారు. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే దెయ్యం ఎపిసోడ్ అయితే ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సంపంగి దెయ్యం మధ్య వచ్చే ఎపిసోడ్ అయితే గత తెలుగు చిత్రాలను గుర్తు చేసినా ఒక రేంజ్ లో నవ్విస్తుంది. నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చినా ఆశ్చర్యం లేదు అనేంతలా ఆ సీక్వెన్స్ మొత్తం పేలింది. తర్వాత సంపంగి దెయ్యం, శ్రీ విష్ణు బుగ్గగిల్లడం అసలు సంపంగి దెయ్యం కథ తెలుసుకోవడానికి శ్రీ విష్ణు లోపలికి వెళ్లడం లాంటి సన్నివేశాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తాయి. అయితే ఇంత ఫాస్ట్ గా నడిపిస్తూ వెళ్లిన కథని క్లైమాక్స్ విషయానికి వస్తే బాగా స్లో డౌన్ చేసేసి ఎమోషనల్ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. అయితే ఇది కొంచెం లాజికల్ గా కన్విన్సింగ్ అనిపించదు. అప్పటి వరకు అసలు ఏమాత్రం బాధ్యతలు లేని, సీరియస్ నెస్ లేని వ్యక్తులకు ఒక దెయ్యం పడే బాధ అర్థమై ఆ దెయ్యం బాధ తీర్చాలి అనుకోవడం కాస్త లాజిక్ కి దూరం అనిపిస్తుంది. కానీ తమ సినిమాల్లో అసలు లాజిక్స్ కే చోటు లేదని సినిమా యూనిట్ ముందు నుంచి ప్రచారం చేస్తూ రావడంతో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలో ఏ సర్టిఫికెట్ జోకులకు కొదవలేదు, సామజ వర గమన సినిమాతో పోలిస్తే ఆ అడల్ట్ జోక్స్ బాగా పెరిగినట్టు అనిపించింది. మొత్తంగా లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే పెట్టిన డబ్బుకి పూర్తి న్యాయం చేస్తూ థియేటర్లలో కడుపుబ్బ నవ్వుకుని బయటికి వచ్చేలా ఉంది సినిమా.

నటీనటుల విషయానికి వస్తే ముగ్గురు ప్రధాన పాత్రధారులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శ్రీ విష్ణు ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. సినిమాలో చాలామంది నటీనటులు ఉన్నారు కానీ ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులుగా తమ పాత్రలను చాలా సమర్థవంతంగా పోషించారు. వీరి కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. అయితే హీరోయిన్లుగా ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చిన అయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ ల స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. కేవలం గ్లామర్ ఆబ్జెక్ట్స్ గానే వాళ్లను చూపించారు. ఉన్నంతలో వాళ్లు తమ అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో ఇద్దరు హీరోయిన్లు ప్రియా వడ్లమాని ఒక స్పెషల్ సాంగ్ లో, సాయి కామాక్షి భాస్కరాల ఒక సీన్ లో అతిథి పాత్రలో కనిపించింది. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ తో పాటు రచ్చ రవి చేసే కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సంపంగి పాత్రధారి ఎవరో కానీ దెయ్యంగా ఒక రేంజ్ పర్ఫామెన్స్ ఉంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సంపంగి మహల్ అనే ఒక ఊహాజనిత మహల్ ని సృష్టించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఆ కష్టాన్ని తన కెమెరా పనితనంతో మరింత అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట సఫలమయ్యాడు. ఆయన సినిమాటోగ్రఫీ సినిమా మొత్తానికి ప్రధానమైన అసెట్ అని చెప్పవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ అందించిన పాటలు కొంత క్యాచీగా అనిపించకపోయినా తెరమీద మాత్రం బాగున్నాయి. ఇక ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అవుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. యువి వాళ్ళ నిర్మాణ విలువలు గురించి చెప్పాల్సిందేముంది? ప్రతి ఫ్రేమ్ లో రిచ్నెస్ కనిపిస్తుంది.

ఫైనల్ గా చెప్పాలంటే నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్.. లాజిక్స్ వెతుక్కోకుండా సినిమా చూస్తే రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వుకుంటారు. పెట్టిన డబ్బుకు ఫుల్ పైసా వసూల్ మూవీ.. కొందరికి కొన్నిచోట్ల క్రింజ్ అనిపించి నచ్చకపోవచ్చు కానీ జాతి రత్నాలు, సామజ వర గమనలా ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యే సినిమా ఇది.

Show comments