ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఈ నేపద్యంలోనే ఒక మంచి కంటెంట్ ప్రేక్షకులకు అందించాలని ఉద్దేశంతో ఒక బృందావనం అనే సినిమా రూపొందించారు మేకర్స్. బాలు, షిన్నోవా, సాన్విత కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూపాలక్ష్మి, మహేందర్, వంశి నెక్కంటి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సీర్ స్టూడియోస్ బ్యానర్ పై కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మాణంలో సత్య బొత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘ఒక బృందావనం’ సినిమా మే 23న థియేటర్స్ లో రిలీజయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
కథ:
రాజా విక్రమ్(బాలు) కెమెరామెన్ గా ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. అయితే కామన్ మ్యాన్ కష్టాలు తీరాలంటే ఎప్పటికైనా అమెరికాకు వెళ్లి బాగా సంపాదించాలని అందుకోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క మహి(షిన్నోవా)ఇంట్లో పెళ్లి వద్దని చనిపోయిన వాళ్ళ అమ్మ చేయాలనుకున్న డాక్యుమెంటరీ చేయాలని, చెప్పి బయటకు వచ్చేస్తుంది. అలాగే అనాథాశ్రమంలో ఉండే నైనికా(సాన్విత)కు ప్రతి సంవత్సరం జోసెఫ్(శుభలేఖ సుధాకర్) పేరు మీద క్రిస్మస్ కి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఎప్పటికైనా జోసెఫ్ ని కలవాలని, తన పేరెంట్స్ ఎవరో కనుక్కోవాలని ఆమె భావిస్తూ ఉంటుంది. రాజా బ్రేకప్ బాధలో ఉన్నప్పుడు మహి తన డాక్యుమెంటరీ కెమెరామెన్ గా చేయమని అడుగుతుంది. రాజ్ అవసరాలకు డబ్బు కావాలని ఓకే చెప్తాడు. అలా రాజ్ – మహి ఓ డాక్యుమెంటరీ కోసం కలిసి నైనికని కలుస్తారు. అయితే అసలు మహి డాక్యుమెంటరీ దేని గురించి? రాజ్ అమెరికాకు వెళ్లాడా? జోసెఫ్ ఎవరు? పాపకు ఎందుకు గిఫ్ట్స్ పంపిస్తున్నాడు?మహి పెళ్లి జరుగుతుందా? జోసెఫ్ కోసం రాజ్, మహి, నైనిక చేసే ప్రయత్నం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ:
తెలుగు సినిమా అనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలో హిట్ ఫార్ములా అనేదాన్ని ఇప్పటివరకు ఎవరు సిద్ధం చేయలేకపోయారు. అందుకే కొంతమంది హిట్ అయినా సినిమా ఫార్ములాలని బేస్ చేసుకుని సినిమాలు చేస్తుంటే మరి కొంతమంది తమకు ఉన్న ప్యాషన్ తో ఆసక్తికరమైన సినిమాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక బృందావనం సినిమా కూడా ఆ కోవలోకి చెందిందే. ఫస్ట్ హాఫ్ అంతా రాజా, మహి, నైనిక పాత్రల పరిచయం, రాజా బ్రేకప్ స్టోరీ, మహి డాక్యుమెంటరీ కోసం తిరగడం, డాక్యుమెంటరీ షూటింగ్ తో కాస్త లాగ్ ఫీలింగ్ తో సాగుతుంది. ఒక మంచి ఎమోషన్ తో ఇంటర్వెల్ కట్ చేసి సెకండ్ హాఫ్ లో జోసెఫ్ ని వెతుక్కుంటూ రాజా, మహి, నైనిక ప్రయాణం ఎలా సాగింది, నైనిక ఎవరు.. అంటూ మంచి ఫీల్ తో తెరకెక్కించారు. అయితే అప్పటి వరకు ఎటువంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం ప్రయాణం చేయడం అనేది ఎన్నో సినిమాల్లో ఉన్నా ఇక్కడ కనెక్ట్ అయ్యేందుకు రాసుకున్న పాయింట్ బాగుంది. అక్కడక్కడా కాస్త సాగదీసినా ఒక మంచి ఫీల్ ఇచ్చేలా కథని నడిపించారు. లవ్ సీన్స్ మాత్రం రెగ్యులర్ గానే అనిపించినా ఫ్లాష్ బ్యాక్, ప్రీ క్లైమాక్స్ లో లవ్ ఎమోషన్ బాగా పండింది. అక్కడక్కడా కంటతడి పెట్టిస్తూ అక్కడక్కడా నవ్విస్తూ సినిమా సాగుతుంది.
నటీనటుల విషయానికి వస్తే బాలు కెమెరామెన్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మొదటి సినిమా అనే ఫీలింగ్ లేకుండా అనిపిస్తుంది. షిన్నోవా ఒక పరిణితి చెందిన యువతి పాత్రలో ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విత కూడా క్యూట్ గా నటించింది. మహేందర్, మహబూబ్ బాషా అక్కడక్కడా నవ్విస్తారు. శుభలేఖ సుధాకర్, వంశి నెక్కంటి, రూపాలక్ష్మి, శివాజీరాజా.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో అలరించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే విజువల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటూ. మ్యూజిక్ సింపుల్ గా ఉంది. అనవసరమైన రణగొణ ధ్వనులు జోలికి పోకుండా కథకు తగ్గట్టు బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ లో ఇంకాస్త కత్తెరకు పని పెడితే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ : ఒక బృందావనం సినిమా సోల్ ఫుల్ హార్ట్ టచింగ్ మూవీ..