NTV Telugu Site icon

O Kala Movie Review: ఓ కల (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

Kala

Kala

O Kala Movie Review: కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కు ఓటీటీ కరెక్ట్ ప్లాట్ ఫామ్. అలాంటి ఓ చక్కని కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఓ కల’. ఈ మూవీ 13వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గౌరీష్ యేలేటి, రోష్ని సహోట, ప్రాచి టక్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను దీపక్ కొలిపాక దర్శకత్వంలో నవ్య మహేశ్, రంజిత్ కుమార్ కొడాలి నిర్మించారు.

ఎం.బి.ఎ. చేసిన హారిక (రోష్ని)కు ఉద్యోగం చేయడం కంటే… తన ప్రతిభను ఉపయోగించి సొంత కంపెనీ పెట్టి ఓ వంద మందికి ఉపాధి కల్పించాలనే కోరిక. అందుకు తండ్రి (దేవి ప్రసాద్) సైతం సహకరిస్తాడు. స్నేహితుడు శరణ్ తో కలిసి బిజినెస్ లోకి దిగిన హారిక… అతన్ని నమ్మి మోసపోతుంది. నష్టాల్లో మునిగిపోయిన కంపెనీని వేరే వాళ్ళకు అమ్మేసి, డిప్రషన్ తో సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది. ఆ సమయంలో ఆమె జీవితంలోకి హర్ష (గౌరీష్ యేలేటి) అడుగు పెడతాడు. లైఫ్ మీద హోప్ కోల్పోయిన హారికలో హర్ష ఎలా ఆశలు రేకెత్తించాడు? ఆమెను మళ్ళీ ఎలా సక్సెస్ ఫుల్ ఎంటర్ పెన్యూర్ గా మలిచాడు? హర్ష గతం ఏమిటీ? అనేదే ఈ చిత్రం.

ఓ చిన్న పాయింట్ ను తీసుకుని దర్శకుడు దీపక్ కొలిపాక చక్కని దృశ్య కావ్యంగా దీన్ని మలిచాడు. ఇవాళ సమాజంలో పది శాతం మంది డిప్రషన్ కు లోనవుతున్నారు. సూసైడ్  చేసుకుంటున్న వారిలో తొంభై శాతం మంది ఆ డిప్రషన్ కారణంగానే అందుకు పాల్పడుతున్నారు. వాళ్ళలో చిన్న పాటి ఆశను సకాలంలో కల్గిస్తే… వాళ్ళకో కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టు అవుతుంది. అలాంటి ప్రయత్నం సమాజంలో కొంత మేర జరుగుతోంది. కానీ అది మరింతగా జరగాలన్నదే ఈ సినిమా ద్వారా దర్శకుడు దీపక్ చెప్పాలనుకున్నాడు. దానికి తగ్గట్టు గా సింపుల్ గా ఓ స్టోరీని రాసుకున్నాడు. అన్ని వర్గాలను ఆకట్టుకోవాలనే అత్యాశకు పోకుండా… తను రాసుకున్న కథకు తగిన న్యాయం చేస్తూ, మంచి నటీనటులను ఎంపిక చేసుకుని, ఈ క్యూట్ మూవీని తెరకెక్కించాడు.

ఇందులో ప్రధానంగా కనిపించేవి రెండే పాత్రలు. గౌరీశ్ యేలేటీ అండ్ రోష్ని. ఇద్దరూ చక్కగా నటించారు. మరీ ముఖ్యంగా… ఇప్పటికే ఉత్తరాదిన నటిగా గుర్తింపు తెచ్చుకున్న రేష్ని చాలా బాగా తన పాత్రను పోట్రేట్ చేసింది. ప్రత్యూష పాత్రకు ప్రాచీ టక్కర్ తగిన న్యాయం చేసింది. అయితే రోష్ని పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో ప్రాచీ పాత్ర పట్ల దర్శకుడు కాస్తంత శీతకన్ను వేశాడనిపిస్తుంది. ఇతర ప్రధాన పాత్రలను దేవి ప్రసాద్, వైవా రాఘవ, శక్తి, రవితేజ, కృష్ణకుమారి శ్రీపతి పోషించారు. ఫిల్మ్ డైరెక్టర్ గా అలీ చేసిన పాత్ర పెద్దంత మెప్పించలేదు. ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ, నీలేష్ మండలపు సంగీతం. కశ్మీర్ అందాలను అఖిల్ తన కెమెరాలో చక్కగా బంధించాడు. నేపథ్య గీతాలు వినసొంపుగా ఉన్నాయి. వీటిని కృష్ణ చైతన్య, రాకేందు మౌళి రాశారు. సినిమా అనేది ప్రధానంగా వినోదసాధనమే అయినా దాని ద్వారా సమాజ హితానికి పాటు పడటం ఉత్తమ లక్షణం. అది తమకుందని ‘ఓ కల’ ద్వారా దర్శక నిర్మాతలు చాటి చెప్పారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా… ఓటీటీలోని ఈ సినిమాను చూస్తే… మనసుకు హాయిగా ఉంటుంది. లోపల ఎక్కడైనా డిప్రషన్ ఉంటే… తొలగిపోతుంది!

రేటింగ్ : 2.5/5

ప్లస్ పాయింట్స్
ఉదాత్తమైన కథ
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
అఖిల్ సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
ఊహకందే ముగింపు
ఫ్లాట్ నెరేషన్

ట్యాగ్ లైన్: కలలాంటి సినిమా!