My Name Is Shruthi: దేశముదురు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హన్సిక చాలా కాలం నుంచి ఎందుకో తెలియదు కానీ కాస్త తెలుగు సినీ ప్రేక్షకులకు దూరమైంది. తెనాలి రామక్రిష్ణ సినిమా తరువాత ఆమె మళ్లీ ఇప్పుడు మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమాతో చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రెయిలర్ ఆసక్తి పెంచడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది సినిమా రివ్యూలో చూసి తెలుసుకుందాం.
మై నేమ్ ఈజ్ శృతి కథ:
శృతి సంప్రదాయబద్దంగా పెరిగిన అమ్మాయి. తండ్రి చనిపోవడంతో ఒంటరి తల్లి ఆమెను పెంచి పెద్ద చేస్తుంది. ఒక యాడ్ ఏజెన్సీలో పని చేసే ఆమె ఒక సందర్భంలో ఒక వ్యక్తిని హత్య చేయాల్సి వస్తుంది. అయితే అతన్ని తన ఇంటి బాత్ రూంలోనే ఉంచి ఇంటికి అర్జెంట్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఇంటికి వెళ్లి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి ఇంటి ముందు పోలీసులు ఉండడం చూసి కంగారు పడుతుంది. అయితే తాను కొట్టి చంపినట్టు భావించిన వ్యక్తి కాకుండా అక్కడ ఒక అమ్మాయి(బిగ్ బాస్ ఫేం పూజ) శవం ఉండడంతో ఆమె ఒక్క సారిగా షాక్ అయ్యి అరిచిన అరుపుకు పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుంటారు. అయితే శృతి చంపింది ఎవరినీ? అక్కడ పడి ఉన్న అమ్మాయి శవం ఎవరిది? అసలు ఆ శవాలు ఎలా మారాయి? ఈ హత్యకు స్కిన్ మాఫియా నడిపే గురుమూర్తి(ఆదుకాలం నరేన్)కి సంబంధం ఏంటి? అలాగే ఫేమస్ డెర్మటాలజీ డాక్టర్ (ప్రేమ)కి సంబందం ఏంటి? శృతి జైలుకు వెళుతుందా? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సాధారణంగా మనం ఎన్నో సినిమాల్లో ఆర్గాన్ మాఫియా గురించి విన్నాం, చూశాం. ఈ సినిమాలో మాత్రం కొత్త స్కిన్ మాఫియా గురించి చూపించారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. సినిమా ఓపెనింగ్ లోనే స్కిన్ కి ఇప్పుడు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో చెబుతూ నెమ్మదిగా కథలోకి తీసుకువెళ్ళాడు డైరెక్టర్. హన్సిక మర్దర్ చేసినట్టు భ్రమింపచేస్తు కథను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ అక్కడే కొన్ని సీన్స్ లాజిక్ కు అందకుండా రాసుకున్నాడు. నిజానికి ఈ సినిమా స్క్రీన్ ప్లే అంతా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయాలనే రాసుకున్నారు. అలా మొదటి భాగం అంతా ప్రేక్షకుల్లో అనేక సందేహాలు కలిగించి రెండో భాగంలో తీసుకు వెళ్ళాడు డైరెక్టర్. రెండో భాగం అంతా ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేస్తూ అసలు విషయం అర్థం అయ్యేలా చెప్పాడు. అయితే ఎందుకో అంత సస్పెన్స్, ఇంటెన్సిటీ క్యారీ అయినట్టు అనిపించలేదు. హన్సిక ప్రేమలో పడే సీన్స్ కూడా అంత కన్విన్సింగ్ అనిపించలేదు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ ట్రీట్మెంట్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ వేరే లెవల్లో ఉండేది. అయితే కొత్త దర్శకుడి స్థాయికి మించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది అందులో ఆయన దాదాపు సఫలం అయ్యాడు కూడా. కానీ ఈ సినిమా అందరినీ ఆకట్టుకోవడం కష్టమే, థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడేవారు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వస్తే ఏమైనా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక టైటిల్ జస్టిఫికేషన్ కూడా ఇచ్చి ఉండాల్సింది.
నటీనటులు:
హన్సిక లేడీ ఓరియెంటెడ్ పాత్ర అనగానే ఒక రేంజ్ ఫైట్స్ ఊహిస్తే కష్టమే. అయితే మునుపటి సినిమాలతో పోలిస్తే గ్లామర్ పక్కనపెట్టి ఆమె నటన మీద ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. వన్ ఉమెన్ షో లాగా ఆమె సినిమాను భుజాల మీద నడిపింది. ఆడుకాలం నరేన్, ప్రవీణ్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ప్రేమ అసలు ఇలాంటి ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర ఎందుకు చేసిందో ఆమెకు మాత్రమే తెలియాలి. సాంకేతిక నిపుణుల విషయానికి కనుక వస్తే పాటలు అంత గుర్తుంచుకోవడం కష్టమే. ఆర్ఆర్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది, థ్రిల్లర్ కాబట్టి అది చాలా అవసరం కూడా. సినిమాటోగ్రఫీ సినిమాకి తగినట్టు ఉంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్నా సరే థియేట్రికల్ రిలీజ్ కోసం ఇంకా కొంత నిడివి ఉంచినట్టే అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ మై నేమ్ ఈజ్ శృతి ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్, అంచనాల్లేకుండా థియేటర్లకు వెళితే ఆ జానర్ ఇష్టపడే వారికి నచ్చవచ్చు.