Miral Movie Review in Telugu: ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘మిరల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన ‘మిరల్’ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. మే 17న ఈ సినిమా హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎం శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ భయపెట్టి అంచనాలు పెంచింది. మరి అంచనాలు పెంచేలా చేసుకున్న ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
మిరల్ కథ ఏమిటంటే:
సివిల్ ఇంజనీర్ హరి (భరత్) భార్య రమ (వాణి భోజన్), తన భర్తను ముసుగు వేసుకున్న వ్యక్తి చంపినట్లు కల కంటుంది. ఇలాంటివే ఏవో ఒకటి జరుగుతూ ఉండడంతో కుల దైవం గుడికి వెళ్లాలని రమ సొంత ఊరికి వెళ్తారు. అక్కడి కుల దైవం ఆలయంలో పూజలు చేసిన అనంతరం సిటీకి బయలుదేరతారు. అయితే బయలుదేరినప్పటి నుంచి హరి ఫ్యామిలీకి వింత అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. ఒకానొక సమయంలో ఆ కలే నిజమైనట్టు వింత మనుషులు హరి ఫ్యామిలీని చంపేప్రయత్నం చేస్తారు. అయితే అసలు హరి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నించింది ఎవరు? హరి తన ఫ్యామిలీని కాపాడుకుంటాడా? చివరికి అసలు ఏమైంది? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సినిమా మొదటి నుంచి ఏదో అతీత శక్తి హరి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతోంది అనిపించేలా సినిమా మొదలు అవుతుంది. ప్రతి సీన్ లో ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యం అన్నట్టుగా ఎఫెక్ట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రెచ్చిపోయారు. నిజానికి మొదటి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ప్రేక్షకులు ఒక రకమైన ట్రాన్స్ లో ఉంటారు. కానీ ప్రీ క్లైమాక్స్ లో రివీల్ చేసిన ట్విస్ట్ దెబ్బకు మోసపోయాం అనే ఫీలింగ్ తో బయటకు వస్తారు. నిజానికి ఇది ఒక హారర్ ఎలిమెంట్స్ ఉన్న థ్రిల్లర్ మూవీ. అయితే అసలు ప్లాట్ వింటే ఇంతేనా అనిపిస్తుంది. కానీ సినిమా స్క్రీన్ ప్లేతోనే భయపెట్టే ప్రయత్నం చేశారు. కేవలం కొన్ని పాత్రలతో కూడిన కథ ఇది. భరత్, వాణీ భోజన్‌లు సినిమా మొత్తాన్ని మోసుకెళ్లే బాధ్యతను తీసుకున్నారు. తమ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక హీరో మామగారి పాత్రలో నటించిన కె.ఎస్.రవికుమార్ నటనలో ఎలాంటి లోపాలు లేకపోయినా, ఆ పాత్ర రూపకల్పన కృత్రిమంగా ఉంది. రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించారు, నిజానికి ఆ పాత్రలో జీవించాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ కార్డ్ వేసే వరకు లేని దెయ్యాన్ని చూపిస్తున్నట్టు భ్రమించేలా చేస్తూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బండి నడిపించాలని అనుకోవడం సినిమాకు పెద్ద మైనస్.
నటీనటుల విషయానికి వస్తే ఎన్నో సినిమాల్లో ప్రేమికుడిగా కనిపించిన భరత్ ఈ బాధ్యతాయుతమైన కుటుంబ పెద్ద పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ప్రేమ, జాలి, కోపం ఇలా అన్ని భావాలను చక్కగా పలికించాడు. తన భార్య, పిల్లలను పోగొట్టుకునే సన్నివేశాల్లో జీవించాడు. వాణి భోజన్ కూడా తనకు ఇచ్చిన పాత్రను అద్భుతంగా చేసింది. రాజ్ కుమార్ కూడా సర్ప్రైజ్ పాత్రలో కనిపించదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే హారర్ సినిమా కావడంతో సంగీత దర్శకుడు ప్రసాద్ కేవలం సౌండ్ ఎఫెక్ట్స్ తో వైవిధ్యం చూపించాడు. పాటలు లేని సినిమాకి ఆయన నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. ఇక సినిమాటోగ్రాఫర్ సురేష్ బాలా, ఎడిటర్ కలైవానన్ ల పనితనం భయంకరమైన ‘జంప్ స్కేర్’ సీన్స్ లో కనిపించింది. అయితే సరైన బ్యాక్‌గ్రౌండ్ ఏర్పరుచుకోకపోవడంతో ఒక్కో హారర్ సీన్‌ని ఎందుకు, ఎలా జరుగుతుంది అనే విషయాలపై ఎలాంటి అవగాహన లేకుండా ఒక్కో హారర్ సీన్‌ను దాటుకుంటూ వెళ్లడం కాస్త కష్టమే. చివరికి క్లైమాక్స్ చూశాక అప్పటిదాకా చూసినవన్నీ అర్థరహితం అనిపిస్తాయి. పేపర్‌పై బాగా కనిపించే ఆ ట్విస్ట్, చివరకు రివీల్ అయ్యాక దాని ఇంటెన్సిటీ కోల్పోతుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. లా తమిళ సినిమాల తరహాలో స్క్రీన్ ప్లే రాసుకోకుండా విజువల్స్, కెమెరా, సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం దర్శకుడు శక్తివేల్ కి ప్లస్ అయింది.
ఫైనల్లీ: కొన్ని లోపాలు పక్కన పెట్టి చూస్తే మిరల్ భయపెడుతుంది.