Market Mahalakshmi Movie Review: ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు కంటెంట్ ని నమ్ముకుని రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు కొత్త దర్శకుడు ముఖేష్, కొత్త నిర్మాత అఖిలేష్. గతంలో చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉన్న దర్శకుడు ముఖేష్ పార్వతీశం హీరోగా ప్రణీకాన్విక హీరోయిన్గా మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని మరింత పెంచే విధంగా ప్రమోషనల్ కంటెంట్ ఉండడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం
మార్కెట్ మహాలక్ష్మి కథ:
హీరో(పార్వతీశం) చిన్నప్పటి నుంచి తండ్రి కోరిక మేరకే అన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఎవరో అమెరికా వెళ్లారని తెలిసి కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలని భావించి హీరో తండ్రి(కేదార్ శంకర్) ఆరు లక్షలు అప్పు చేసి చదివిస్తాడు. ఆ ఆరు లక్షల అప్పు తీర్చాలంటే కోటి రూపాయలు కట్నం తెచ్చే కోడలు అయితేనే కరెక్ట్ అని భావించి అలాంటి అమ్మాయి కోసమే వెతుకుతూ ఉంటాడు. హీరో కూడా పెళ్లి చూపులకు వెళుతూ అమ్మాయిలను టెస్ట్ చేస్తూ వాళ్ళు తనకు కరెక్ట్ కాదని పక్కన పెడుతూ ఉంటాడు. అలాంటి అతనికి స్వతంత్ర భావాలు కలిగి, ఒక కూరగాయల మార్కెట్ మొత్తాన్ని నడిపించే తెలివితేటలు గల మహాలక్ష్మి (ప్రణీకాన్విక) కనిపిస్తుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే అనూహ్యంగా తన తల్లి (జయలక్ష్మి నాయుడు) ఆమెతో గొడవ పడుతున్న సమయంలో ఐ లవ్ యు చెప్పి చెంప దెబ్బలు తింటాడు. ఇక తర్వాత మహాలక్ష్మిని ప్రేమలో పడేసేందుకు మార్కెట్లో ఆమె స్నేహితుల సహాయం తీసుకుంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా లక్షలు జీతం సంపాదించే హీరో మార్కెట్లో కూరలు అమ్ముకునే మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడటం అతని కుటుంబ సభ్యులకు నచ్చదు. అయితే వినడానికే వింతగా ఉన్న ఈ ప్రేమ కథ చివరికి ఏమవుతుంది? మహాలక్ష్మి హీరో ప్రేమను ఒప్పుకుంటుందా? చివరికి వీరిద్దరూ ఒకటవుతారా? వీరి ప్రేమకు ఉన్న అడ్డంకులు ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రేమ- పెళ్లి అనే లైన్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా కాస్త భిన్నం అని ముందు నుంచి దర్శక నిర్మాతలు ప్రచారం చేస్తూనే వచ్చారు. దానికి తోడు తమ సినిమాలో ఒక మంచి సందేశం ఉంటుందని, కాకపోతే దాన్ని వాడుకుని ప్రమోషన్ చేయడం తమకు ఇష్టం లేదని దర్శకుడు చెప్పడం సినిమా మీద వ్యక్తిగతంగా నాకు ఆసక్తి రేకెత్తించిన అంశం. సినిమా మొదట్లోనే క్యారెక్టర్ లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందులో భాగంగానే హీరో తండ్రి హీరో కోసం అప్పు చేసి చదివించి అతని ద్వారా ఆ డబ్బు వెనక్కి రాబట్టుకోవాలని ప్రయత్నం చేయడం ఈరోజు సమాజంలో ఎంతోమంది తండ్రులను తెరమీద చూపినట్టు అనిపించింది. అయితే లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనతో పాటు పనిచేసే ఏ సాఫ్ట్వేర్ అమ్మాయినో లేకపోతే పాష్ గా ఉన్న అమ్మాయినో చూసి ప్రేమలో పడటం సర్వసాధారణం. కానీ సినిమాలో హీరో మాత్రం స్వతంత్ర భావాలు కలిగిన మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడటం కాస్త రియాలిటీకి దూరంగానే ఉనా సినిమాటిక్ గా మాత్రం భలే అనిపించింది. హీరో హీరోయిన్ ని మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆమె ప్రేమ కోసం పరితపించడం, ఆమె నుంచి చిత్కారాలు ఎదుర్కొంటూ చివరికి ఆమె ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనే విషయాన్ని ఆహ్లాదకరంగా తెరకెక్కించే విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే హీరోయిన్ ప్రేమను హీరో దక్కించుకునే ప్రయత్నంలో మార్కెట్లో రాసుకున్న కొన్ని సీన్స్ కామెడీ పరంగా కూడా ఆకట్టుకున్నాయి. కొన్ని సీన్స్ మాత్రం క్రింజ్ అనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అసభ్యకరమైన కామెడీ కోసం పరితపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా దర్శకుడు చేసిన నవ్వించే ప్రయత్నం అభినందనీయం. ఫస్టాఫ్ అంతా హీరో హీరోయిన్ ని ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలతో సాగిపోగా సెకండ్ హాఫ్ వారి పెళ్లికి దారి తీసే పరిస్థితులను చక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సాఫ్ట్వేర్ అబ్బాయి మార్కెట్ అమ్మాయిని ప్రేమించడం అనేది కాస్త వాస్తవ దూరంగా అనిపించినా మిగతా విషయాలన్నీ చాలా రియలిస్టిక్ గా కొంతమంది కనెక్ట్ అయ్యేలా మరికొంతమంది బాధపడేలా రాసుకున్నాడు. తన స్నేహితుడి జీవితంలోనే జరిగిన కథను ఆధారంగా ఈ సినిమా తర్కెక్కించానని దర్శకుడు చెప్పడం ఆసక్తికరం. చివరిలో దర్శకుడు ఇచ్చిన సందేశం ఈ రోజుల్లో పెళ్లిళ్లు కాక, ప్రేమలో ఉండి కూడా పెళ్లి చేసుకోవడానికి వెనుకాడే ఎంతోమందికి కళ్ళు తెరిపించేలా ఉంటుంది. అయితే అంతా రివీల్ చేస్తే సినిమా మీద ఉన్న ఆసక్తి పోతుంది కాబట్టి పెళ్లయి ఫ్యామిలీతో ఉన్నవారు, పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వారు చూడాల్సిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు. చిన్నచిన్న లోపాలు ఉన్నా ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే హీరోగా చేసిన పార్వతీశం గతంలో కొన్ని సినిమాలతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమా విషయంలో మాత్రం సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా క్లాస్ లుక్ లో కనిపిస్తూనే ఒక మాస్ అమ్మాయిని ప్రేమించే వ్యక్తిగా ఒక భిన్నమైన పాత్రలో మెరిశాడు. డైలాగ్ మోడ్యులేషన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా ఒక మాస్ మహాలక్ష్మిగా గుర్తుండిపోయే పాత్రలో నటించింది. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్వతంత్ర భావాలతో ఎదగాలనుకునే అమ్మాయిగా ప్రణీకాన్విక ఆసక్తికరమైన నటన కనబరిచింది. ఇక కేదార్ శంకర్, జయలక్ష్మి నాయుడు, మహమ్మద్ పాషా, ముక్కు అవినాష్ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ముక్కు అవినాష్ , పార్వతీశం, పాషా కాంబినేషన్లో కొన్ని సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే పాటలు ఉన్నది తక్కువే అయినా బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకి బాగా ప్లస్ అయ్యే విధంగా ఉంది. సినిమా మూడ్ ని క్యారీ చేయడంలో బాగా ప్లస్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. మార్కెట్ లోని సన్నివేశాలు కొన్ని మాంటేజ్ షాట్లు సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. సినిమాలోని కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా నవ్విస్తూనే సందేశమిస్తుంది, ఆలోచింపచేస్తుంది. పెళ్లయిన వారికి, పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వారికి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.