NTV Telugu Site icon

Major Movie Review: హ్యాట్సాఫ్‌ మేజర్

Major Movie

Major Movie

ఈ మధ్య బయోగ్రాఫికల్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం ఎక్కువవుతోందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన మరో బయోపిక్ ‘మేజర్’. 2008లో ముంబై దాడుల్లో ముష్కరమూకల నుండి అమాయక జనాన్ని రక్షించే క్రమంలో అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా ఈ ‘మేజర్’ తెరకెక్కింది. సందీప్ ఉన్నికృష్ణన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’లో ఎలా చేరారు? అక్కడ సందీప్ ఏ తీరున తన దేశభక్తిని ప్రదర్శిస్తూ పతకాలు సాధించారు? అన్న అంశాలతో పాటు సందీప్ జీవితంలోని అనురాగబంధాలనూ ఈ చిత్రంలో ప్రస్తావించడం విశేషం.

కేరళకు చెందిన ఇస్రో అధికారి కె.ఉన్నికృష్ణన్ (ప్రకాష్ రాజ్) తనయుడు సందీప్ (అడివి శేష్‌). చిన్నప్పటి నుండి నేవీలో చేరాలన్నది అతని కోరిక. అయితే అందులో అవకాశం రాకపోవడంతో దేశానికి ఎలాగైనా సేవ చేయాలనే తలంపుతో సందీప్‌ ఆర్మీలో జాయిన్ అవుతాడు. కాలేజీలో చదువుతుండగానే క్లాస్ మేట్ ఇషా (సయీ మంజ్రేకర్)తో ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో వాళ్ళ పెళ్ళి జరుగుతుంది. ఉద్యోగరీత్యా దేశ సరిహద్దుల్లో ఉండే సందీప్ కు భార్య పట్ల ప్రేమ ఉన్నా ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతుంటాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త ఎడబాటును భరించలేక కినుక వహిస్తుంది ఇషా. వారి వైవాహిక జీవితం ఒడిదుడుకులలో ఉండగానే 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ ట్రైనింగ్ ఆఫీసర్ గా ఉన్న మేజర్ సందీప్ 2008 నవంబర్ 26న జరిగిన ముంబై అటాక్స్ ఆపరేషన్ లో పాల్గొనాల్సి వస్తుంది. తాజ్ హోటల్ పై దాడి చేసిన పాకిస్తాన్ టెర్రరిస్టులు అక్కడ విడిది చేసిన విదేశీయులను టార్గెట్ చేసి మరి హతమార్చుతుంటారు. వారి దాడిలో 175 మంది కన్నుమూయగా, దాదాపు 300 మంది గాయపడతారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టడం కోసం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? అందుకు ఎంతటి మూల్యం చెల్లించాడన్నదే మిగతా కథ.

ముంబై అటాక్స్ ఆపరేషన్‌లో అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు భారత ప్రభుత్వం అశోక చక్ర బిరుదును ప్రకటించింది. అతని జీవితాన్ని వెండితెరకెక్కించాలని గతంలో కొందరు ప్రయత్నించినా, సందీప్ తండ్రి సున్నితంగా తిరస్కరించారు. అయితే, పట్టువదలని విక్రమార్కుడిలా అడివి శేష్‌ ప్రయత్నించి, ఆయన అంగీకారాన్ని పొందాడు. మేజర్ సందీప్ మరణానికి కారణం ఏమిటనేది మాత్రమే కాకుండా, తన కుమారుడి జీవన విధానాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నది ఆ తండ్రి ఆలోచన. దానికి తగ్గట్టుగానే సందీప్ బాల్యం నుండి అతను దేశం కోసం చేసిన త్యాగం వరకూ ఈ సినిమాలో చూపించారు. దాంతో ముంబై బాంబు దాడి ఘటనను మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో ఓ సోల్జర్ కథను ఆసక్తికరంగా చెప్పినట్టు అయ్యింది. విశేషం ఏమంటే… కమర్షియాలిటీ కోసం సందీప్ వైవాహిక జీవితాన్ని గ్లోరిఫై చేయకుండా, అతను ఎదుర్కొన్న ఆటుపోటులను కూడా ఇందులో చూపించారు. అయితే ద్వితీయార్థంలో తాజ్ ఇన్సిడెంట్ ఓ టెంపోలో సాగిపోతున్న సమయంలో తిరిగి అతని వ్యక్తిగత జీవితాన్ని చూపించడంతో మూవీ గ్రాఫ్ పడిపోయింది. అలానే సెంటిమెంట్ సీన్స్ ను పండించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

జనాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవాలంటే నటీనటులు కొన్ని పాత్రల్లో తమదైన బాణీ పలికించి తీరాలి. ఆ దిశగా సాగుతున్నాడు యంగ్ హీరో అడివి శేష్. దేశభక్తిని మిళితం చేస్తూ, దుష్టులపై ఎలా విజయం సాధించారు అన్న అంశాలతో కథలను తయారు చేసుకుంటూ అడివి శేష్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతకు ముందు అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ అదే తీరున తెరకెక్కి, జనాన్ని ఆకట్టుకుంది. ఆ దిశగానే ఈ ‘మేజర్’కూ కథను సమకూర్చారు శేష్. తన రచనతో రూపొందిన కథ కావడంతో శేష్ తన పాత్రను సులువుగా పోషించాడు. అంతేకాదు… దానికి తగ్గ మేకోవర్ చేశాడు. అది తెర మీద స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మేజర్ ఉన్నికృష్ణన్ జీవితంలో చోటు చేసుకున్న ఫ్యామిలీ సెంటిమెంట్ ను పండించడంలో శేష్ సక్సెస్ సాధించాడు. ఇషా పాత్రలో సయీ మంజ్రేకర్ చక్కగా ఇమిడిపోయింది. కాలేజీ సన్నివేశాల్లో వీరి జంట చూడముచ్చటగా ఉంది. ఆ మధ్య వచ్చిన ‘గని’లో కంటే సయీ ఇందులో చాలా బాగుంది. ఇక ప్రమోదగా శోభిత దూళిపాళ ఎంట్రీ ఇచ్చేది ద్వితీయార్థంలోనే అయినా… అక్కడ నుండి ఆమె పాత్ర చివరి వరకూ ఉంటుంది. పాత్ర పరిధి మేరకు ఆమె చక్కగా నటించారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో రేవతి, ప్రకాశ్ రాజ్ తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఇతర ప్రధాన పాత్రలను మురళీశర్మ, అనీశ్‌ కురువిల్ల, రుద్రప్రతాప్ తదితరులు పోషించారు. అబ్బూరి రవి మాటలు సందర్భోచితంగా సాగాయి. పాటల్లో ‘హృదయమా…’, ‘ఓ ఇషా…’, ‘జనగణ మన…’ అంటూ సాగే గీతాలు అలరించాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ, అవినాశ్‌ కొల్లా ఆర్ట్ డైరెక్షన్‌ మూవీని మరో స్థాయిలో నిలబెట్టాయి. డైరెక్టర్ శశికిరణ్ తిక్క, హీరో అడివి శేష్ ఇంతకు ముందు ‘గూఢచారి’తో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. ఈ సారి కూడా అదే మ్యాజిక్ చేసే ప్రయత్నం ముంబై దాడులు జరిగి దాదాపు 14 ఏళ్ళవుతోంది. ఈ నేపథ్యంలో నవతరం సినీ అభిమానులను ‘మేజర్’ ఆకట్టుకునే ఆస్కారం ఉంది. కొడుకుగా, భర్త గా న్యాయం చేయలేకపోయినా… ఓ సోల్జర్ గా తన ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి సేవ చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి ఈ తరం తెలుసుకోవాలి. అందుకోసమైనా ఈ సినిమా చూడాలి. ఇలాంటి సినిమా నిర్మించిన అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రను చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్ బాబును, సోనీ పిక్చర్స్ సంస్థను అభినందించాలి.

ప్లస్ పాయింట్స్:
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కావడం
మెప్పించే నటీనటుల అభినయం
ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
అంతగా పండని సెంటిమెంట్ సీన్స్
రొటీన్‌గా ఉన్న యాక్షన్ సన్నివేశాలు

ట్యాగ్ లైన్: హ్యాట్సాఫ్‌ మేజర్

రేటింగ్: 3/5