2026 నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మదం’. బిగ్ బాస్ ఫేమ్ బ్యూటి ఇనయా సుల్తానా నటించిన ఈ సినిమాను రా అండ్ రస్టిక్‌గా లైంగిక కోరికలు, ప్రతికారం, యాక్షన్, డ్రామా అంశాల చుట్టూ సాగే కథగా రూపొందించారు. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో, సూర్యదేవర రవీంద్రనాథ్ (చినబాబు), రమేష్ బాబు కోయ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఒక బోల్డ్ అటెంప్ట్‌గా నిలుస్తోంది. 1980వ దశకం నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సోషల్ డ్రామా మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
మదం కథ:
ఈ సినిమా 80ల నాటి గరుకు నేపథ్యాన్ని మన కళ్ళకు కడుతుంది. అధికారం చేతిలో ఉన్న ఒక అవినీతి పోలీస్ అధికారి, అతని భార్య కలిసి ఒక నిరుపేద కుటుంబాన్ని ఎలా చిత్రహింసలకు గురిచేశారు? వారి కుట్రల వల్ల ఆ కుటుంబం ఎలా ఛిన్నాభిన్నమైంది? అనే అంశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అన్యాయంపై ఒక సామాన్యుడు చేసిన పోరాటమే ‘మదం’. అయితే ఈ కథలో అత్యంత కీలకమైన మలుపు ఇనయా సుల్తానా పోషించిన పాత్ర. ఆమె పురుషులతో సంబంధాలు పెట్టుకుంటూ ఎందుకు సినిమాను మలుపులు తిప్పింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:’మదం’ కేవలం ఒక మహిళ శృంగార వాంఛల చుట్టూ తిరిగే సినిమా మాత్రమే కాదు. ఇది ఒక వ్యక్తి మానసిక ప్రవృత్తిని, సమాజంలోని అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించేలా రాసుకున్న సినిమా. సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ, అవి కథలో భాగంగానే వస్తాయి తప్ప కేవలం అట్రాక్షన్ కోసం పెట్టినట్టుగా అనిపించవు. అలానే సినిమా క్లైమాక్స్ ప్లస్ పాయింట్. ఎవరూ ఊహించని విధంగా వచ్చే మలుపు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సమాజం విధించిన కట్టుబాట్లను ఎదిరించే ఒక మహిళను మనం ద్వేషించాలా లేక ఆమె తెగింపును చూసి ఆశ్చర్యపోవాలా అనే సందిగ్ధంలో ప్రేక్షకుడిని పడేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కానీ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అయితే కాదనే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే కనుక బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానాకు ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఎటువంటి మొహమాటం లేకుండా, ధైర్యవంతురాలైన, దూకుడు స్వభావం ఉన్న స్త్రీ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. తెలుగు సినిమాల్లో సాధారణంగా కనిపించే హీరోయిన్ పాత్రలకు ఇది పూర్తి భిన్నమనే చెప్పాలి. ఇక హర్ష, అనురూప్‌లు తమ పరిధి మేరకు భావోద్వేగాలను పండించి సినిమాకు బలాన్ని చేకూర్చారు. లతారెడ్డి, అరంగనాథన్, హేమ పాప్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వంశీ కృష్ణ మళ్ల ఎక్కడా కృత్రిమత్వం లేకుండా, సహజత్వాన్ని నమ్ముకుని ఈ సినిమాను తెరకెక్కించారనిపించింది. రవికుమార్ వి అందించిన విజువల్స్ 80ల నాటి వాతావరణాన్ని అద్భుతంగా ప్రతిబింబించాయి. స్టూడియో సెట్టింగ్స్ కాకుండా నిజమైన లొకేషన్లలో చిత్రీకరించడం వల్ల సినిమా చాలా ‘రా’గా అనిపిస్తుంది.’ఈగల్’ ఫేమ్ డేవ్‌జాంద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఇంటెన్స్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లింది. నందమూరి తారకరామారావు ఎడిటింగ్ షార్ప్‌గా ఉండగా, శంకర్ ఉయ్యాల నేతృత్వంలో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌లు సహజంగా ఉన్నాయి.
ఫైనల్లీ బోల్డ్ అండ్ ఇంటెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి ‘మదం ‘ ఒక ఆప్షన్